logo

ప్రగతిపధంలో నవ్యాంకురాలు

అంకుర సంస్థల ప్రగతి కర్ణాటక దూకుడు ప్రదర్శిస్తోందని, దేశంలోనే అత్యున్నత స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుందని గవర్నరు థావర్‌ చంద్‌ గహ్లోత్‌ ప్రకటించారు.

Published : 27 Jan 2023 03:08 IST

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌

బెంగళూరు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న గవర్నరు థావర్‌చంద్‌ గహ్లోత్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అంకుర సంస్థల ప్రగతి కర్ణాటక దూకుడు ప్రదర్శిస్తోందని, దేశంలోనే అత్యున్నత స్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుందని గవర్నరు థావర్‌ చంద్‌ గహ్లోత్‌ ప్రకటించారు. దేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం బెంగళూరు నగరంలోని ఫీల్డ్‌మార్షల్‌ మాణెక్‌షా సైనిక కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వివిధ దళాల కవాతు వీక్షించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన- అంకురాల ప్రగతిని గుర్తించే డీటీఐఐటీ జాబితాలో కర్ణాటక తొలి స్థానాన్ని దక్కించుకుందన్నారు. 2022లో రాష్ట్రంలో 25.87 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆర్థికతను కేంద్రానికి సమకూర్చి- ఎగుమతుల్లో నాలుగో స్థానం పొందినట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి ఓమైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహించి రూ.9,81,784 కోట్ల పెట్టుబడులు దక్కించుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 4,244 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించిందని ప్రకటించారు. దళిత, గిరిజన వర్గాలతో పాటు అల్పసంఖ్యాక ఉద్యోగ మహిళల కోసం ఆరు నగరాల్లో 24 వసతి గృహాలను ప్రారంభించినట్లు తెలిపారు. సామాజిక భద్రత పథకం కింద 75.76 లక్షల మందికి నెలనెలా పింఛన్‌ అందజేస్తున్నామన్నారు. సినీనటుడు పునీత్‌రాజ్‌కుమార్‌ మృతి చెందిన తరువాత ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని అందజేసిన విషయాన్ని ప్రస్తావించారు. చక్కని రహదారుల అభివృద్ధి కోసం రూ.5,140 కోట్లు విడుదల చేశామని, 1,411 వంతెనలు నిర్మించామని, రూ.165 కోట్లతో రహదారి ప్రమాద నియంత్రణ చర్యలు చేపట్టామని వివరించారు. యువశక్తి పథకం పరిధిలో గ్రామీణ యువత చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు సృష్టించడాన్ని ప్రస్తావించారు. 2021-22లో 2.1 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి, 4.4 లక్షల మెట్రిక్‌ టన్నుల రాగి, లక్ష మెట్రిక్‌ టన్నుల జొన్నలు రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. బెంగళూరు నగర, గ్రామీణ జిల్లాలు, తుమకూరు, చిక్కబళ్లాపురలో 97 చెరువులకు వృషభావతి కాలువ నీరు శుద్ధీకరించి సరఫరా చేస్తామన్నారు. ఎస్‌సీ వర్గాల రిజర్వేషన్‌ను 15 నుంచి 17 శాతానికి, ఎస్‌టీ వర్గాల రిజర్వేషన్‌ మూడు నుంచి ఏడు శాతానికి పెంచడం ఓ సామాజిక పరిణామంగా ప్రస్తావించారు. గ్రామీణులకు మేలైన సేవలందించేందుకు అన్ని శాఖలనూ కలిపి ‘గ్రామ వన్‌’ కేంద్రాలు స్థాపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందత శర్మ, డీజీపీ ప్రవీణ్‌సూద్‌, పాలికె పరిపాలన అధికారి రాకేశ్‌సింగ్‌, చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాయచూరు : గణతంత్ర వేడుకల్లో విద్యార్థుల మల్లకంబ సాహసవిద్య ప్రదర్శన

మాణెక్‌షా మైదానంలో విశేషంగా ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు


నారీశక్తికి ప్రతిరూపం

గణతంత్ర దినోత్సవ వేడుకలలో కొనసాగుతున్న నారీశక్తి శకటం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక నేతృత్వంలో దిల్లీకి పంపించిన ‘నారీశక్తి శకటా’నికి ఆహూతుల నుంచి చక్కని స్పందన లభించింది. గడచిన 14 సంవత్సరాలుగా వరుసగా దిల్లీకి స్తబ్ద చిత్ర శకటాన్ని పంపించిన ఏకైక రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ ఏడాది కర్ణాటకకు అవకాశం ఉండదనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి బొమ్మై, ఇతర నేతల విన్నపాలతో కేంద్ర సమాచార శాఖ అధికారులు స్పందించి మార్గం సుగమం చేశారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే దీన్ని తయారు చేయించామని సమాచార శాఖ కమిషనర్‌ డాక్టర్‌ పి.ఎస్‌.హర్ష తెలిపారు. ఈ ఏడాది మహిళల శౌర్యం, పట్టుదల కర్ణాటకకు గర్వకారణమని వివరించారు. సూలగిత్తి నరసమ్మ, వృక్షమాత తులసి గౌడ హాలక్కి, సాలుమరద తిమ్మక్కల బొమ్మలతో స్తబ్ద చిత్ర వాహనం ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న కళా దర్శకుడు శశిధర్‌ అడప దీనికి విన్యాసకర్త. యువ సంగీత దర్శకుడు ప్రవీణ్‌ డి.రావు సమకూర్చిన రాగాలకు, కారవారకు చెందిన పురుషోత్తమ పాండురంగ నేతృత్వంలో హాలక్కి ప్రజల సుగ్గి కుణిత పేరిట 20 మంది కళాకారులు ఆ శకటంతో నడుస్తూ ప్రదర్శన ఇచ్చారని ఆయన వివరించారు.


యుద్ధవిద్యలతో ఆకట్టుకున్న సైనికుల విన్యాసం


మాణెక్‌షా మైదానంలో సైనికుడి సాహస విన్యాసం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని