logo

చికెన్‌ కోసం రాద్ధాంతం.. ఇదెక్కడి చోద్యం

గిరిజన బాలుర వసతి గృహంలో వండిన కోడికూర సరిగ్గా లేదని కొంత మంది విద్యార్థులు బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో కోడికూరతో వినూత్న రీతిలో ఆందోళన చేశారు.

Updated : 27 Jan 2023 12:24 IST

వసతిగృహం ఖాళీ చేయించిన అధికారులు

లగేజీతో బయటకు వెళ్తున్న విద్యార్థులు

బళ్లారి, న్యూస్‌టుడే: గిరిజన బాలుర వసతి గృహంలో వండిన కోడికూర సరిగ్గా లేదని కొంత మంది విద్యార్థులు బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో కోడికూరతో వినూత్న రీతిలో ఆందోళన చేశారు. వేళపాళా లేకుండా చికెన్‌ కూరతో ఇంటి ముందు ఆందోళన చేస్తారా? అని ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను లగేజ్‌తో ఇంటికి పంపించి, తల్లిదండ్రులతో వచ్చిన తర్వాత విషయం చెప్పి వసతిగృహంలోకి తీసుకోవాలని డీసీ పవన్‌కుమార్‌ మాలపాటి గట్టిగా హెచ్చరించారు. దీంతో గిరిజన సంక్షేమశాఖాధికారి సకినా ఆదేశాలతో 25 మంది విద్యార్థులను గురువారం వసతిగృహం నుంచి లగేజ్‌తో బయటకు పంపించారు. ముందు జాగ్రత్తగా కౌల్‌బజార్‌ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని కౌల్‌బజార్‌లో పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం ఎదురుగా డిగ్రీ విద్యార్థుల కోసం గిరిజన వసతిగృహం ఉంది. ఇక్కడ మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నెలకు ఓ సారి కోడికూర(చికెన్‌) ఇవ్వాలని ఉండేది. కొన్ని రోజులు నుంచి ప్రతి బుధవారం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో చికెన్‌ అందజేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వండిన కూర సరిగా లేదని 25 మంది విద్యార్థులు భోజనం చేయలేదు. వార్డెన్‌ విద్యార్థులను విచారణ చేయగా, చికెన్‌ సరిగ్గా లేదు. భోజనం చేయడం లేదు. తాలూకా అధికారి ఇక్కడికి వచ్చి పరిశీలించాలని డిమాండ్‌ చేయడంతో తాలూకా అధికారి వసతిగృహానికి చేరుకుని భోజనం చేశారు. కొద్దిగా మసాల ఎక్కువైంది. ఈ రోజుతో సరిపెట్టుకోండి…. వచ్చే వారం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినా విద్యార్థులు ఏ మాత్రం వినిపించుకోకుండా రాత్రి సుమారు 10 గంటల సమయంలో రెండు బకెట్లలో కూర తీసుకుని డీసీ నివాసం వద్దకు బయలుదేరారు. పలువురు అధికారులు, కౌల్‌బజార్‌ పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. అడ్డుకుంటే కౌల్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందే బైఠాయిస్తామని చెప్పడంతో పోలీసులు వదలిపెట్టారు. రాత్రి 10.30 గంటల సమయంలో డా.రాజ్‌కుమార్‌ రహదారిలోని డీసీ నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. డీసీ వచ్చే వరకు ఇక్కడ నుంచి వెళ్లమని చెప్పడంతో డీసీ విద్యార్థుల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. తల్లిదండ్రులు మీపై ఎంతో నమ్మకంతో వసతిగృహంలో ఉంచి చదివిస్తున్నారు. వేళాపాళా లేకుండా ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేయడం సరికాదు. 300 మంది ఉండగా, కేవలం 25 మందికి మాత్రమే చికెన్‌ బాగలేదా? అని విద్యార్థులను మందలించారు. గిరిజన సంక్షేమ శాఖాధికారితో మాట్లాడి ఈ సమయంలో వినూత్న రీతిలో ఆందోళన చేసిన విద్యార్థులను గురువారం లగేజ్‌తో ఇంటికి పంపించండి. తల్లిదండ్రులతో వస్తే మాట్లాడిన తర్వాత మరోసారి అవకాశం ఇవ్వాలని గట్టిగా సూచించారు. దీంతో గురువారం ఉదయం 25 మంది విద్యార్థుల్లో 13 మంది విద్యార్థులు వసతిగృహంలో ఉండటంతో డీసీ ఆదేశాల మేరకు డీఎస్పీ శేఖరప్ప సీఐ వాసుకుమార్‌ బయటకు పంపించారు. మిగిలిన విద్యార్థుల కోసం వార్డెన్‌ పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా బయటికెళ్లిన విద్యార్థులు వసతిగృహం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. రాత్రి 10.30 గంటల సమయంలో డీసీ నివాసం ఎదుట ఆందోళన చేయడం తప్పే. వార్డెన్‌ సరిగ్గా లేరు. రాత్రి పూట మద్యం తాగి వచ్చి విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా భోజనం పెట్టడం లేదు. మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని వార్డెన్‌ మార్చాలని పలుమార్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. డీసీని క్షమాపణ కోరుతున్నట్లు విద్యార్థులు సిద్దార్థ, శివప్ప, దేవరాజు, నాగేంద్ర, కనక, శ్రీకాంత్‌, రమేష్‌, పాండురంగ, హొన్నూరస్వామి గాదిలింగ, మేఘనాథ్‌ తదితరులు తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులతో చర్చించి వసతిగృహంలోకి అనుమతిస్తామని  చరవాణిలో డీసీ పవన్‌కుమార్‌ మాలపాటి విలేకరులకు చెప్పారు.


వసతిగృహం ముందు విద్యార్థుల ఆందోళన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు