logo

సబర్బన్‌.. వేగంగా ముందడుగు

రాజధాని నగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్ల నివారణ ప్రణాళికల్లో భాగంగా రూపొందించిన సబర్బన్‌ రైలు పథకం పనులు వేగం పుంజుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో పథకం సర్వే పనులతో పాటు మట్టి పరీక్షలు ప్రారంభించారు.

Published : 29 Jan 2023 04:02 IST

బెంగళూరుకు వరంగా మారనున్న సబర్బన్‌ రైలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాజధాని నగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్ల నివారణ ప్రణాళికల్లో భాగంగా రూపొందించిన సబర్బన్‌ రైలు పథకం పనులు వేగం పుంజుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో పథకం సర్వే పనులతో పాటు మట్టి పరీక్షలు ప్రారంభించారు. హీలగిగె- రాజానుకుంటె మధ్య సబర్బన్‌ కారిడార్‌ మార్గం టెండర్ల ప్రక్రియ కొలిక్కి తెస్తున్నారు. ఇక్కడ 8.96 కిలోమీటర్ల మెట్రో ఉపరితల వంతెన నిర్మాణంతో పాటు 37.92 కిలోమీటర్ల సబర్బన్‌ మార్గం రూపుదాల్చుతుంది. అన్నీ సక్రమంగా కొనసాగితే మూడేళ్లలో మరో నాజూకు రైలు నగర వాడలను చుట్టేస్తుంది. ఈ మార్గంలో 19 ప్రయాణ ప్రాంగణాలున్నాయి. వీటి సాయంతో నిత్యం కనీసం 3.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం సాగించే అవకాశం అందివస్తుంది. బయ్యప్పనహళ్లి- హెబ్బాళ మధ్య 24.86 కిలోమీటర్ల ‘మల్లిగె మార్గం’ అందుబాటులోకి తెస్తారు. ఈ మార్గంలో సబర్బన్‌ సేవలను చిక్కబాణ వరకు కొనసాగించాలనేది మరో ప్రతిపాదన. హెబ్బాళ్‌, బెన్నిగానహళ్లి సమీపాన ఈ రైలు డిపోలు నిర్మించాలి. అందుకు ప్రత్యేకంగా భూసేకరణ చేపట్టి మట్టి పరీక్షలు చేస్తున్నారు. ‘మల్లిగె మార్గం’ కోసం 177.83 ఎకరాల భూమి అవసరమని గుర్తించగా అందులో 157.07 ఎకరాలు రైల్వే భూములే అందుబాటులో ఉండటం ప్రస్తావనార్హం. మిగిలిన 15.72 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూములు, మరో 5.11 ఎకరాలు ప్రైవేట్‌కు చెందినవి. ఈ విస్తీర్ణం ప్రకారం స్వాధీన ప్రక్రియ చేపట్టామని కె.రైడ్‌ అధికారులు తెలిపారు. సబర్బన్‌ రైలు పథకం కోసం ఏర్పాటు చేసిన ‘కె.రైడ్‌’ సంస్థ 306 రైల్వే కోచ్‌ల కోసం టెండర్లను ఆహ్వానించింది. 3.2 మీటర్ల వెడల్పు, 21.74 మీటర్ల పొడవున్న- శీతల వ్యవస్థ బోగీలను సమకూర్చుకుంటారు. మార్చి నాటికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తాజా పరిస్థితులు విశ్లేషిస్తూ అధికారులు వివరించారు. సబర్బన్‌ రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నాయి. మెట్రో రైళ్లకు సమాంతరంగా ఇవి నగర సేవల్లో మమేకం కానున్నాయి.

హెబ్బాళ్‌ వద్ద సాగుతున్న సబర్బన్‌ రైలు మార్గం పనులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు