logo

విశ్వాసం కోల్పోయిన భాజపా: సిద్ధు

భాజపా నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య ధ్వజమెత్తారు. అవినీతి ఆరోపణలు, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని తప్పుపట్టారు.

Published : 29 Jan 2023 04:02 IST

పార్టీలో చేరినవారికి కాంగ్రెస్‌ పతాకాన్ని అందిస్తున్న డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య తదితరులు

యాదగిరి, న్యూస్‌టుడే : భాజపా నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య ధ్వజమెత్తారు. అవినీతి ఆరోపణలు, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర నాయకులను పిలిపించి, ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. యాదగిరిలో ప్రజాధ్వని యాత్రలో ఆయన మాట్లాడారు. తాము నిర్వహిస్తున్న బస్సు యాత్రకు అన్ని చోట్లా చక్కని స్పందన లభిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో భాజపాకు ఎప్పుడూ పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదని, అడ్డదారిలోనే వారు అధికారాన్ని దక్కించుకున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను పక్కన పెట్టి, అధికారంలోకి వద్దామని భావించిన నేతలకు ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యిందని ఎద్దేవా చేశారు. ఆయనను బలవంతంగా సమావేశాలకు తీసుకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. భాజపాను ఓడించాలని గ్రామాల నుంచి పట్టణాల వరకు ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. దేశం మొత్తం తామే అధికారంలో ఉన్నామంటున్న భాజపా.. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, కేరళ, తమిళనాడులో ఎవరు అధికారంలో ఉన్నదీ చెప్పాలని నిలదీశారు. భాజపా తరహాలోనే కాంగ్రెస్‌ పార్టీ కూడా నాలుగైదు చోట్ల అధికారంలో ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌, కీలక నేతలు ఈశ్వర ఖండ్రే, హరిప్రసాద్‌, సతీశ్‌ జార్ఖిహొళి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు కొందరు ఇదే సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి శివకుమార్‌ పార్టీ పతాకాన్ని అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు