logo

ఎన్నికల వేళ.. టికెట్ల గోల

విధానసభ ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ టికెట్‌ పంపకాల ప్రక్రియ ముదిరి పాకాన పడుతోంది. జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్‌ల టికెట్‌ కేటాయింపులు దిల్లీ స్థాయిలో తేలాల్సి ఉంది.

Published : 30 Jan 2023 02:25 IST

వీధిన పడుతున్న పార్టీల అంతర్గత సమరం

ఈనాడు, బెంగళూరు:విధానసభ ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ టికెట్‌ పంపకాల ప్రక్రియ ముదిరి పాకాన పడుతోంది. జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్‌ల టికెట్‌ కేటాయింపులు దిల్లీ స్థాయిలో తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలోగా ఈ రెండు పార్టీల అభ్యర్థుల జాబితా వెల్లడయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు జేడీఎస్‌ పార్టీ తొలి విడత జాబితాను ఇప్పటికే వెల్లడించగా, మలివిడత జాబితా జాతీయ పార్టీల తొలి జాబితా కంటే ముందుగానే వెల్లడిస్తానని ఆ పార్టీ నేత కుమారస్వామి ప్రకటించారు. ప్రస్తుతం అనధికారిక ఎన్నికల ప్రచారాన్ని పార్టీలన్నీ రాష్ట్రమంతటా కొనసాగిస్తున్నాయి.

వసంతనగర వీధిలో పాదయాత్ర చేస్తున్న అరుణ్‌ సింగ్‌

వీధిన పడిన కుటుంబ కలహం

కుటుంబ పార్టీ అన్న అపవాదును మోస్తున్న జేడీఎస్‌లో తాజాగా టికెట్‌ పేరిట రచ్చ మొదలైంది. దళపతుల గడ్డ హాసనను 2018 ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఆక్రమించటం జేడీఎస్‌ నేతలను మింగుడుపడని వ్యవహారం. మొత్తం ఏడు స్థానాలున్న హాసన జిల్లాలో ప్రస్తుతం ఆరు స్థానాలు జేడీఎస్‌ ఆదీనంలో ఉన్నా కీలకమైన హాసన భాజపా ఆక్రమించుకుంది. ఈ ఎన్నికల్లో ఆ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని జేడీఎస్‌ పంతం పట్టింది. ఈ పంతం కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు రేపింది. ఇంత వరకు ఆ స్థానంలో అభ్యర్థిని ప్రకటించకపోయినా తనకు తానుగా అభ్యర్థినని ప్రకటించుకున్న ఎమ్మెల్యే రేవణ్ణ సతీమణి భవాన్ని రేవణ్ణ పార్టీలో కలకలం రేపింది. భవాన్ని ప్రకటనను విభేదించిన కుమారస్వామి..హాసనలో భవాని అనివార్యతం ఉంటుందని తాను భావించలేదని వ్యాఖ్యానించారు. ఆపై రేవణ్ణ కుమారులు ప్రజ్వల్‌, సూరజ్‌లు కుమారస్వామిపై పరోక్షంగా సవాలు విసరటం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా ఆదివారం విలేకరులతో మాట్లాడిన హెచ్‌డీ రేవణ్ణ...హాసనే కాదు పార్టీలో తుది నిర్ణయం కుమారస్వామి, పార్టీ అధ్యక్షులు సీఎం ఇబ్రహీంలదేనని గోడ మీద దీపం పెట్టినట్లు మాట్లాడారు. ఈ టికెట్‌ అనిశ్చితి తొలగాలంటే ఆ పార్టీ మరో జాబితా విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఈ మధ్యలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి హాసన నుంచి భవాని పోటీ చేస్తానంటే భాజపా టికెట్‌ ఇస్తుందని ఎద్దేవా చేయటం రాజకీయ దుమారంగా మారింది.

సిద్ధరామయ్య చుట్టూ

కోలారులో తానే అభ్యర్థినని ప్రకటించి కాంగ్రెస్‌లో టికెట్ల వేటకు శ్రీకారం చుట్టిన విపక్ష నేత సిద్ధరామయ్య ఆశావహుల్లో కదలిక తెచ్చారు. ఆ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన మాజీ కేంద్ర మంత్రి కేహెచ్‌.మునియప్ప పరోక్షంగా సిద్ధరామయ్య నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పేరుకు సిద్ధరామయ్య సభకు హాజరవుతున్నా..తన అసంతృప్తిని మద్దతుదారులతో వెల్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. కోలారలో సిద్ధరామయ్య టికెట్‌పై కేపీసీసీ అధికారికంగా ప్రకటించకపోవటం, అధ్యక్షులు డీకే శివకుమార్‌ కూడా స్పష్టత ఇవ్వకపోవటం అనిశ్చితికి దారి తీసింది. సిద్ధరామయ్య పోటీ నిర్ధరణ తర్వాత జేడీఎస్‌, భాజపా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల నేపథ్యంలో సిద్ధరామయ్య మరో స్థానం నుంచి పోటీ చేయాలని యత్నించినా సాధ్యపడే అవకాశం లేదని తెలుస్తోంది.

యడియూరప్ప రాజకీయం

భాజపాలో టికెట్‌ కేటాయింపులకు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదేశాలే కీలకమని తెలుస్తోంది. పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఆయన నిర్ణయానికి అధిష్ఠానం కూడా ఆమోదం తెలిపేందుకు సిద్ధంగా ఉంది. కానీ యడియూరప్పకు సర్వాధికారంపై పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. తన కుమారుడు విజయేంద్రకు టికెట్‌ ఇప్పించేందుకు శతవిధాలా యత్నించిన  యడియూరప్ప పలుమార్లు అధిష్ఠానం ముందు భంగపడ్డారు. శికారిపుర నుంచి విజయేంద్రకు టికెట్‌ ఖారారైతేనే పార్టీ తరపున ప్రచారం చేస్తానని పలుమార్లు ఆయన పార్టీ పెద్దలకు సంకేతాలు పంపారు. కానీ పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోశ్‌ రూపంలో యడియూరప్ప ఆధిపత్యానికి సవాలు ఎదురవుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై చేపట్టిన సమావేశాల్లో యడియూరప్ప ఉద్దేశపూర్వకంగా గైర్హాజరవటంపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. ఫిబ్రవరి చివరి వారంలో వెల్లడయ్యే అభ్యర్థుల తొలి జాబితా తర్వాతనే పార్టీలో ఎవరి ఆధిపత్యం నడుస్తుందో తెలుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని