logo

ఆకాశ విహారానికి ఆలంబన

కేంద్ర పౌర విమానయాన శాఖ గత అక్టోబరులో ప్రకటించిన- దేశవ్యాప్తంగా 21 హరిత వలయ విమానాశ్రయాల్లో ఐదు కర్ణాటకలో విస్తరించాయి! వీటిల్లో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ప్రయాణ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, మరో మూడు త్వరలో ప్రారంభం కానున్నాయి.

Published : 01 Feb 2023 01:02 IST

మైసూరు విమానాశ్రయం.. హరిత వలయం

ఈనాడు, బెంగళూరు : కేంద్ర పౌర విమానయాన శాఖ గత అక్టోబరులో ప్రకటించిన- దేశవ్యాప్తంగా 21 హరిత వలయ విమానాశ్రయాల్లో ఐదు కర్ణాటకలో విస్తరించాయి! వీటిల్లో ఇప్పటికే రెండు విమానాశ్రయాలు ప్రయాణ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, మరో మూడు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఉడాన్‌ పథకాన్ని చక్కగా వినియోగించుకునే రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటని ఇటీవల దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రకటించారు. బెంగళూరుకు వెలుపల (బియాండ్‌ ద బెంగళూరు) పథకం పరోక్షంగా రాష్ట్రంలో దేశీయ విమానాశ్రయాల విస్తరణకు మార్గం చూపింది. ప్రతిష్ఠాత్మక ఏరో ఇండియా ప్రదర్శనను దిగ్విజయంగా నిర్వహించే కర్ణాటక.. త్వరలో మరో ప్రదర్శనకు సిద్ధమవుతుండగా ఇదే క్రమంలో రాష్ట్రంలో మరో మూడు విమానాశ్రయాలు ప్రారంభం కానున్నాయి.

నిర్మాణ దశలో..

* శివమొగ్గ, బళ్లారి (న్యూ బళ్లారి ఎయిర్‌పోర్ట్‌), హాసన, కార్వార (అంతర్జాతీయ), రాయచూరు, విజయపుర విమానాశ్రయాల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి.

* బెంగళూరులో హెచ్‌ఏఎల్‌, జక్కూరు, యలహంక ఎయిర్‌ఫోర్స్‌, బెళగావి సాంబ్రా ఏఎఫ్‌ఎస్‌, కోలార ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, బీదర్‌ ఏఎఫ్‌ఎస్‌, చిత్రదుర్గ ఏరోనాటికల్‌ పరీక్ష కేంద్రాలు సైనిక కార్యకలాపాల కోసం నిర్వహిస్తుండగా.. కొప్పళ్లలో బాలడోట కొప్పళ ఏరోడ్రమ్‌, హరిహర, సేడమ్‌ విమానాశ్రయాలు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో నిర్వహిస్తున్నారు.

* నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకున్న శివమొగ్గ విమానాశ్రయం ఈనెల 27న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రయాణ కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. రాయచూరు, హాసన, దావణగెరె, విజయపుర విమానాశ్రయాల భూసేకరణ పనులు ముగిసి ఎయిర్‌పోర్ట్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా అనుమతులు కూడా పొంది నిర్మాణ పనులు ప్రారంభించాయి. వీటిల్లో విజయపుర విమానాశ్రయం మే మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలున్నట్లు ఇటీవల భారీ పరిశ్రమల మంత్రి మురుగేశ్‌ నిరాణి ప్రకటించారు. ప్రతి విమానాశ్రయానికి కనీసం 800 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా.. రైతులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరణ ప్రక్రియకు న్యాయ సంబంధమైన చిక్కులు ఈ విమానాశ్రయాల ఆలస్యానికి కారణమవుతున్నాయని అధికారులు వివరించారు.

* రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాలు, ప్రయాణికుల రాకపోకలకు కొదవ లేకున్నా దేశీయ విమానాశ్రయాలకు నిర్వహణపరమైన చిక్కులు తలెత్తుతున్నట్లు మంగళూరుకు చెందిన నేవిగో సొల్యూషన్స్‌ సీఈఓ ప్రవీణ్‌ కుమార్‌ వివరించారు. బెంగళూరు నుంచి హుబ్బళ్లికి వెళ్లాల్సిన వ్యక్తి కొంత రోడ్డు ప్రయాణం చేయాలి. ఇదే స్థాయిలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుడు గంటల కొద్దీ రోడ్డు ప్రయాణం చేస్తేనే బెంగళూరులో గమ్యాన్ని చేరుకుంటాడు. విమాన ప్రయాణానికి సమానమైన సమయాన్ని రోడ్డు ప్రయాణానికి కేటాయించటం ఉడాన్‌ పథకం లక్ష్యానికి అడ్డుగా మారింది.

ఆధునిక సదుపాయాల వేదికగా బెంగళూరు కేఐఏ


పరిశ్రమలకు ఊతం

* బియాండ్‌ ద బెంగళూరు, ఉడాన్‌ పథకాలు రెండూ పరస్పరం ప్రగతిదాయకాలు. హుబ్బళ్లి, కలబురగి, మైసూరు, బెళగావిలో విమానాశ్రయాల వల్ల ఇక్కడ 2021-22 ఏడాదిలో రూ.45 వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పరిశ్రమలు వచ్చాయి. శివమొగ్గ, హాసన, రాయచూరు, విజయపుర విమానాశ్రయాల కారణంగా మరో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. నగరాల మధ్య అనుసంధానం, ప్రయాణ ధరలు, విమానాశ్రయ నిర్వహణ వ్యయం కోసం వీజీఎఫ్‌ నిధుల కేటాయింపులు దేశీయ విమానాశ్రయాలకు ఊతంగా నిలుస్తాయి.

మురుగేశ్‌ నిరాణి, పరిశ్రమల మంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని