logo

జేడీఎస్‌కు అధికారమివ్వండి

రాబోయే విధానసభ ఎన్నికల్లో జేడీఎస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఇవ్వాలి. దీంతో పార్టీ విడుదల చేసిన పంచరత్నాలను అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి పేర్కొన్నారు.

Published : 01 Feb 2023 01:02 IST

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

కుమారస్వామిని సన్మానిస్తున్న అభిమానులు

బళ్లారి, న్యూస్‌టుడే: రాబోయే విధానసభ ఎన్నికల్లో జేడీఎస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఇవ్వాలి. దీంతో పార్టీ విడుదల చేసిన పంచరత్నాలను అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి పేర్కొన్నారు. పంచరత్న రథయాత్రలో భాగంగా బళ్లారి జిల్లా సండూరు తాలూకా తోరణగల్లు, కురెకుప్పలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు. పంచరత్న రథయాత్రంలో ప్రకటించిన హామీలను పరిష్కరించడానికి రూ.2.50లక్షల కోట్లు నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రజలు తమకు పూర్తి ఆధిక్యం ఇవ్వాలన్నారు. పూర్తి మెజార్టీ రాకపోతే ఇచ్చిన హామీలు పూర్తి చేయడం కష్టమవుతుందన్నారు. గత 25 రోజులుగా జరుగుతున్న పంచరత్న రథయాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే జేడీఎస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఓటర్లు జేడీఎస్‌కి మరోసారి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర కర్ణాటకలో జేడీఎస్‌కి శక్తి లేదని మాట్లాడుతున్నారు. కుమారన్న ఒక్కసారి మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ ప్రాంత అభివృద్ధి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఇళ్లుకు పరిమితమవుతున్నారు. ప్రజలు సమస్యలపై స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయన్నారు.

కాంగ్రెస్‌ ఏకపక్ష ధోరణి

గత సంయుక్త ప్రభుత్వంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నా వద్ద సరిగ్గా ప్రవర్తించలేదు. ముఖ్యమంత్రి అయినా ఇంటిని ఇవ్వలేదు. చివరికి హోటల్లోనే ఉంటూ పరిపాలన కొనసాగించాను. పార్లమెంట్‌ ఎన్నికల్లో తుమకూరు క్షేత్రం నుంచి తమను ఓడించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

జాతీయ పార్టీలది కుటుంబ రాజకీయం

కాంగ్రెస్‌, భాజపాలోనూ కుటుంబ రాజకీయాలు ఉన్నాయని కుమార తెలిపారు. జేడీఎస్‌పై మాట్లాడే నైతికత వారికి లేదన్నారు. సిద్ధరామయ్య తన కుమారుడు కోసం వరుణ విధానసభ క్షేత్రం వదిలిపెట్టారు. మల్లికార్జున ఖర్గే, బీఎస్‌.యడియూరప్ప, కె.ఎస్‌.ఈశ్వరప్ప తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్నారు. వారు విమర్శించడం సరికాదన్నారు. వారు చేయడం కుటుంబ రాజకీయం కాదా? అని ప్రశ్నించారు.

రెడ్డి పార్టీ నుంచి తమకు అనుకూలం

అక్రమ గనుల తవ్వకాల ఆరోపణలతో జైలు నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్‌రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించారని కుమార వ్యాఖ్యానించారు. ఆ పార్టీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. అనుకూలంగా మారుతుందన్నారు. ఉత్తమ కర్ణాటకలోని క్షేత్రాల్లో కె.ఆర్‌.పి. పార్టీ అభ్యర్థులను పోటీ చేయించి ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మైసూరు ప్రాంతంలో తమ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపడం లేదన్నారు.

10న రెండో విడత అభ్యర్థుల ప్రకటన

రాబోయే విధానసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొదటి విడతగా అభ్యర్థులు పేర్లను అప్పటికే ప్రకటించాం. రెండో విడత అభ్యర్థుల పేర్లును ఈ నెల 10న ప్రకటిస్తామన్నారు. హాసన జిల్లాలోని ఏడు విధానసభ స్థానాల్లో ఎలాంటి సమస్యలేదు. ఈ దీనిపై 3న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి కోల్డ్‌వార్‌, హాట్‌ వార్‌ జరగలేదన్నారు. తమ పార్టీలో ఉన్న సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎం.పి.ప్రకాష్‌కు కూడా పలు పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు. పార్టీకి సీనియర్‌ నేతలు అవసరం లేదు. కొత్త నాయకత్వంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు సోమలింగనగౌడ, సోమప్ప పాల్గొన్నారు. కుడతిని పట్టణంలో భూ పోరాట సమితి 44 రోజులుగా చేస్తున్న ఆందోళన ప్రదేశానికి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి సోమవారం రాత్రి 10గంటలకు చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులు కూడా పలు సమస్యలను వివరించారు. ఓ మహిళా రైతు కన్నీరు పెట్టుకోవడంతో కుమార ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

సండూరు పట్టణంలో పంచరత్న రథయాత్రలో హెచ్‌.డి.కుమారస్వామి, తదితరులు

కుమారస్వామితో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా రైతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని