logo

చక్కని విద్యతో ఉన్నత శిఖరాలు సాధ్యం

విద్య లేకుంటే దేనికీ పనికిరాం, విద్యతో ఏదైనా సాధ్యమే..చక్కని విద్యావంతులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు.

Published : 01 Feb 2023 01:02 IST

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ

సంస్మరణ సభలో మాట్లాడుతున్న డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ

సింధనూరు, న్యూస్‌టుడే: విద్య లేకుంటే దేనికీ పనికిరాం, విద్యతో ఏదైనా సాధ్యమే..చక్కని విద్యావంతులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం సింధనూరు తాలూకా స్థానిక ఈజే.హొసళ్లిక్యాంపులోని శ్రీకృష్ణదేవరాయ విద్యాసంస్థ సంస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ రైతు కె.పాపారావు సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాదు నుంచి కె.పాపారావు కుటుంబ సభ్యులంతా విచ్చేశారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ..మా మామగారు కె.పాపారావు విద్యకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేవారని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మనం నివసించే ప్రాంతానికి, అక్కడి భాషకు విలువ ఇవ్వాలని కోరారు. వ్యవసాయం అంటూ ఇక్కడకు వచ్చిన మామగారు ఎంతో మంది ఆప్యాయతలు సంపాదించారని కొనియాడారు. అప్పట్లో ఆయనతో కలసి సమాన భావాలు గల పెద్దలంతా స్థాపించిన ఈ కృష్ణదేవరాయ సంస్థ ఇంతలా ఎదగడం హర్షణీయమని కొనియాడారు. కె.పాపారావు తనయురాలు, తెలంగాణ తపాలాశాఖ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ సంధ్యారాణి మాట్లాడుతూ..విద్యతో సమూల మార్పులకు నాంది పలకొచ్చు అన్నారు. నాన్నగారు కె.పాపారావు కర్ణాటకలో చేసిన సేవలు తెలుసుకుంటే గర్వంగా ఉందన్నారు. ఆయన పేరిట ఈ విద్యాసంస్థలో ఏటా అయిదుగురు టాపరు విద్యార్థులకు పురస్కారాలను అందజేసి ఒక్కొక్కరికీ మా కుటుంబం రూ.25 వేల నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వదలచిందని ప్రకటించారు. కృష్ణదేవరాయ సంస్థ కార్యదర్శి డాక్టర్‌.సుబ్బారావు మాట్లాడుతూ కె.పాపారావుతో ఆయన అనుభవాలు పంచుకున్నారు. యువతకు ఆయన ధైర్యాన్ని నూరిపోసేవారని తెలిపారు. కార్యక్రమంలో పెద్దలు..పారిశ్రామికవేత్త పీవీ.రావు, డాక్టర్‌.రాధాకృష్ణ, కోడూరి సత్యనారాయణ, కాడా అధ్యక్షుడు కొల్లా శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత పెద్దలంతా కె.పాపారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఉపాధ్యాయులూ..పిల్లలకు విలువలు నేర్పండి!

సింధనూరు: నేటి ఉపాధ్యాయులు విద్యార్థులకు చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్యను బోధిస్తే..అది దేశ అభివృద్ధికి, రక్షణకు దోహదపడుతుందని లోక్‌సత్తా నాయకుడు జేపీ, తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారిణి సంధ్యారాణి హితవు పలికారు. మంగళవారం మధ్యాహ్నం వారు స్థానిక శ్రీకృష్ణదేవరాయ విద్యాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పరస్పర చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు అందించారు. జేపీ జాతీయ విద్యా విధానాన్ని వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు ఎలా బోధించాలి, ఎలాంటి విద్యను అందించాలో తెలిపారు. మునుపటి కంటే ఇప్పుడు సాంకేతికత అందుబాటులో ఉన్నందున అంతర్జాలంలో అనేక పుస్తకాలు లభ్యమవుతాయి..వాటిని ఆశ్రయించాలని కోరారు. నేడు దేశంలో 72 లక్షల మంది ఉపాధ్యాయులు సేవలందిస్తుండగా అందులో 52 లక్షల మంది మహిళా ఉపాధ్యాయులే ఉండటం హర్షణీయమని ఉన్నతాధికారిణి సంధ్యారాణి పేర్కొన్నారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులు రోజూ కష్టం..అనుకోకుండా రెండు, మూడు గంటలు తామూ అభ్యాసం చేస్తే..వారికీ విషయంపై పట్టు దొరుకుతుంది, విద్యార్థులకూ ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. మల్టీ లెవెల్‌ గురించివివరించారు. క్రమశిక్షణ తదితర కఠోర శ్రమను జేపీ వివరిస్తూ బాపు ముళ్లపూడి వెంకటరమణ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌లను ఉదహరించారు. నేటి ఉపాధ్యాయుల్లోని కొందరు తీరు మారాలి..ముందు మనం క్రమశిక్షణలో ఉన్నామో లేదో చూసుకుని..విద్యార్థులకు దాని గురించి బోధిస్తే విలువలు కాపాడిన వారమవుతామని చెప్పారు. మాతృభాష గురించి మాట్లాడుతూ..పిల్లలకు ఏ భాష ఇష్టమో అందులో బోధిస్తేనే విషయం అర్థమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సంస్థ కార్యదర్శి డాక్టర్‌.కె.సుబ్బారావు, ఉప ప్రాచార్యురాలు చంద్రకళ పాల్గొన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులతో పరస్పర సంవాదంలో మాట్లాడుతున్న లోక్‌సత్తా అధినేత జేపీ,

తెలంగాణ ఉన్నతాధికారిణి సంధ్యారాణి చిత్రంలో డాక్టర్‌.సుబ్బారావు ఉన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని