logo

గెలిచి సత్తా చాటుతాం

ఎవరినో ఓడించాలని కాక ఎన్నికల్లో గెలిచి సత్తా చూపేందుకే తాను ప్రాంతీయ పార్టీని స్థాపించినట్లు కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ సంస్థాపకుడు గాలి జనార్దన్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

Published : 01 Feb 2023 01:02 IST

పంపాసరోవరంలో పూజలు చేస్తున్న జనార్దన్‌రెడ్డి కుటుంబం

గంగావతి, న్యూస్‌టుడే: ఎవరినో ఓడించాలని కాక ఎన్నికల్లో గెలిచి సత్తా చూపేందుకే తాను ప్రాంతీయ పార్టీని స్థాపించినట్లు కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ సంస్థాపకుడు గాలి జనార్దన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆయన మంగళవారం ఆనెగుందిలో కల్యాణ రథయాత్రకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. తన పార్టీ నెలరోజుల పసికందు అన్నారు. చులకనగా మాట్లాడే వారందరికీ ఎన్నికల అనంతరం తన శక్తి తెలిసి వస్తుందన్నారు. సుమారు 30 నుంచి 40 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో తప్పక గెలిచే నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని అభ్యర్థులను బరిలోకి దించుతామన్నారు. ఇతర పార్టీలు, నేతలను విమర్శించనంటూ అభివృద్ధి మంత్రం జపిస్తానన్నారు. ప్రాంతీయ పార్టీకి మనుగడ లేదంటున్న వారు ఆంధ్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు అనుభవాలను గుర్తుకు తెస్తామన్నారు. రథయాత్ర ప్రారంభానికి ముందు జనార్దన్‌రెడ్డి కుటుంబం సభ్యులు పంపాసరోవరంలో పూజలు చేశారు. అనంతరం ఆనెగుంది చేరుకుని ప్రచార రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లక్ష్మీ అరుణ, బ్రాహ్మణి రాజీవ్‌రెడ్డి, యమనూర్‌ చైడ్కి, మనోహరగౌడ పాల్గొన్నారు.

ఆనెగుందిలో ప్రచార వాహనం కల్యాణ రథానికి పూజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని