logo

నేతల కలయిక.. రాజకీయ కాక

జిల్లాలోని సండూరు తాలూకా బన్నిహట్టి గ్రామంలో ఓ పూజా కార్యక్రమంలో జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు, మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ బహిరంగ ప్రదేశంలో నిలబడిన ఓ వాహనంలో ఆలింగనం చేసుకోవడం...ఇద్దరూ  గుసగుసలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

Updated : 03 Feb 2023 05:35 IST

శ్రీరాములు- సంతోష్‌ లాడ్‌ చర్చలపై కలకలం

మంత్రి బి.శ్రీరాములుతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సంతోష్‌ ఎస్‌.లాడ్‌

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలోని సండూరు తాలూకా బన్నిహట్టి గ్రామంలో ఓ పూజా కార్యక్రమంలో జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు, మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ బహిరంగ ప్రదేశంలో నిలబడిన ఓ వాహనంలో ఆలింగనం చేసుకోవడం...ఇద్దరూ  గుసగుసలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. మంత్రి బి.శ్రీరాములు సండూరు విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేస్తారనే వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. కొన్ని రోజుల ముందు నుంచి మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ అనుచరులు భాజపా చేరుతున్నట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజమవుతున్నట్లు అనిపిస్తోందని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. మంత్రి బి.శ్రీరాములు మొలకాల్మూరు విధానసభ క్షేత్రం నుంచి ప్రస్తుత శాసనసభ్యుడు...ఈ క్షేత్రంలో నిర్వహించిన పలు సర్వేల నేపథ్యంలో సొంత జిల్లాలో ఏదైనా క్షేత్రం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని వినికిడి. గ్రామీణ విధానసభ క్షేత్రం నుంచి మొదటి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి వ్యక్తిగతంగా చేయించుకున్న రెండు సర్వేల్లో స్పష్టత లేదని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌ శాసనసభ్యుడు బి.నాగేంద్ర బలమైన నేతగా ఉండటం, క్షేత్రం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మంత్రికి సండూరు క్షేత్రంపై కన్ను పడింది. సండూరు విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేయడానికి తెరువెనక ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో సండూరు తాలూకా నేతలు, కార్యకర్తలతో మంత్రి సమావేశం నిర్వహించి, పలు అభివృద్ధి పనులకు భూమిపూజ కూడా చేశారు. వారం రోజులు కిందట కుడతినిలో 46 రోజులుగా నిరవధిక సత్యాగ్రహం చేస్తున్న రైతులతో చర్చించారు. బుధవారం తాలూకా బన్నిహట్టిలో జరిగే ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అదే సందర్భంలో మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ కనిపించడంతో ఇద్దరూ చర్చిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.  సండూరు తాలూకాలో బలమైన నేత, మాజీ మంత్రి సంతోష్‌ లాడ్‌ కలిస్తే గెలుపు సులభమవుతుందని అంచనా. సంతోష్‌ ఎస్‌.లాడ్‌ అనుచరుడు ఇ.తుకారం ఇప్పటికే 2008, 2013, 2018 విధానసభ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఓ సారి మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్షేత్రం నుంచైతే గెలుపు సులభంగా ఉంటుందని బి.శ్రీరాములు ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న మంత్రి శ్రీరాములుతో మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ కలవడం పెద్ద చర్చగా మారింది.

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌, చిత్రంలో ముండ్రగి నాగరాజు వివేక్‌, గుర్రం వెంకటరమణ, ముల్లంగి నందీశ్‌, పద్మావతి, తదితరులు

‘రాజకీయ కోణంలో చూడటం సరికాదు’

బళ్లారి: జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములుతో తనకు మొదటి నుంచి పార్టీలకు అతీతంగా స్నేహ సంబంధం ఉంది. బుధవారం సండూరు తాలూకా బన్నిహట్టి గ్రామంలో మేమిద్దరం కలిసి మాట్లాడిన విషయంలో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బి.శ్రీరాములు, సోదరి జె.శాంతలు లోక్‌సభకు పోటీ చేశారు. ఆ సందర్భంలో వారికి వ్యతిరేకంగా ప్రచారం చేశాం. సండూరు క్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధిక ఓట్లు వచ్చాయి. 2008 విధానసభ ఎన్నికల్లో జిల్లాలో అన్ని క్షేత్రాల్లో భాజపా అభ్యర్థులు గెలుపొందినా సండూరు క్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. రాబోయే విధానసభ ఎన్నికల్లో బి.శ్రీరాములు సండూరు విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేసినా..నిజాయితీగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపునకు శ్రమిస్తాను. ఈ విషయంలో రాజీ ప్రసక్తే లేదన్నారు. స్నేహం, రాజకీయం వేర్వేరు అన్నారు. తమ సోదరుడు అనిల్‌ హెచ్‌.లాడ్‌ బళ్లారి నగర విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేసిన సందర్భంలో కూడా తమ సోదరుడు వాహనాలపై దాడి చేసి కాల్చివేసిన విషయం తెలిసిందే..మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, బి.శ్రీరాములుతో నేటికి సంబంధం కొనసాగుతోందన్నారు. నేను మంత్రిగా ఉన్న సందర్భంలో కూడా బి.శ్రీరాములుతో పలుమార్లు కలిశాను. చాలా రోజులు తర్వాత ఇద్దరం కలవడంతో ఆప్యాయంగా కౌగిలించుకుని చెవిలో మాట్లాడామే తప్ప...దీన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. నేను భాజపాకు వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. నేను విధానసభ ఎన్నికల్లో కల్లఘటికి విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేస్తాను. దీనిపై ఎలాంటి అనుమానం లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.సి.కొండయ్య పార్టీలో సీనియర్‌ నేత, పార్టీకి పెద్ద దిక్కు కూడా, కె.సి.కొండయ్య 1992లో నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి పరిచయం. హూవినహడగలి విధానసభ క్షేత్రం నుంచి రెండుసార్లు, హరపనహళ్లి విధానసభ క్షేత్రం నుంచి రెండు సార్లు శాసనసభ్యుడుగా గెలుపొందిన పి.టి.పరమేశ్వర్‌నాయక్‌ సీనియర్‌ నేత, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఏ సందర్భంలో కె.సి.కొండయ్య మాట్లాడారో తెలియదు. పార్టీ అధిష్ఠానం కె.సి.కొండయ్యకు నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. దానికి ఆయన సరైన సమాదానం ఇస్తారని తెలిపారు. చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌ బళ్లారికి రావడంతో పలువురు నేతలు, కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు