logo

సింహభాగం.. మనకే సొంతం!

కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌.. అమృత కాలంలో దేశ ప్రగతికి గట్టి పునాది వేసేలా ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విశ్లేషించారు. ఆయన గురువారం విధానసౌధలో ఈ బడ్జెట్‌పై ప్రత్యేకంగా సమీక్షించారు.

Published : 03 Feb 2023 02:40 IST

రాష్ట్ర ప్రగతికి బడ్జెట్‌ ఊతం
ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి బొమ్మై

ఈనాడు, బెంగళూరు : కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌.. అమృత కాలంలో దేశ ప్రగతికి గట్టి పునాది వేసేలా ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విశ్లేషించారు. ఆయన గురువారం విధానసౌధలో ఈ బడ్జెట్‌పై ప్రత్యేకంగా సమీక్షించారు. వందేళ్ల స్వాతంత్య్ర భారతదేశం.. అభివృద్ధి చెందిన తొలి మూడు దేశాల్లో ఒకటిగా ఉండాలన్న లక్ష్యంతో బడ్జెట్‌ రూపుదాల్చిందని అభివర్ణించారు. భారత ప్రగతికి దోహదపడే ప్రతి కార్యక్రమంలో రాష్ట్రం వాటా ఉండనే ఉంటుందని విపక్షాల విమర్శలకు బదులిచ్చారు.

జాతీయ హోదానే..

అప్పర్‌ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించకున్నా.. ఏకకాలంలో భారీగా నిధులివ్వటం గొప్ప విషయంగా ముఖ్యమంత్రి బొమ్మై అభిప్రాయపడ్డారు. 1964 నుంచి ప్రతిపాదనలో ఉన్న ఈ ప్రాజెక్టు 2008 వరకు ఏమాత్రం ప్రగతి సాధించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనకు బడ్జెట్‌ రూపంలో చక్కని స్పందన దక్కింది. జలశక్తి, ఆర్థిక శాఖలు, సీడబ్ల్యూసీల అనుమతి తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం లభించటం, తాజాగా బడ్జెట్‌లోనూ రూ.5,300 కోట్లు ప్రకటించిన క్రమంలో దీన్ని పరోక్షంగా జాతీయ ప్రాజెక్టుగానే పరిగణించాలన్నారు. గతంలో నీటిపారుదల పనులకు ఏఐబీపీ కార్యక్రమం రూపంలో నిధులు దక్కేవన్నారు. ముందుగా విడుదల చేసిన నిధులను వ్యయం చేసిన తర్వాతనే కొత్త నిధులు మంజూరయ్యేవి. 2012లో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ఈ నిబంధనను సవరించిన ఎన్‌డీఏ నేరుగా నిధులు వచ్చే ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అప్పర్‌ భద్రకు రూ.13 వేల కోట్లను వ్యయం చేయగా, కొత్తగా రూ.5,300 కోట్లు దక్కాయని వివరించారు.

మేకెదాటు.. తప్పు చేశాం

మేకెదాటు డీపీఆర్‌ తయారీలోనే లోపాలున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ‘ఈ తప్పువల్లనే రాష్ట్రాల మధ్య పేచీలు మొదలయ్యాయి. గత ప్రభుత్వం మేకెదాటుపై ఎలాంటి వివాదం లేదని ప్రకటించినా విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఏ క్షణంలోనైనా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైతే ఆ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు వినియోగిస్తాం’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి పొందిన మేకెదాటుకు న్యాయ సంబంధ సమస్యలున్నాయన్నారు.

సత్కార గ్రహీతలతో సీఎం బొమ్మై, ఆచార్య చంద్రశేఖర కంబార తదితరులు

కీలక లబ్ధిదారు..

భద్ర ఎగువ ప్రాజెక్టు మినహా రాష్ట్రానికి మరేదీ దక్కలేదన్న ఆరోపణను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిలో రాష్ట్రం వాటా కింద నిధులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం కీలకమైన లబ్ధిదారుగా మారిందని పేర్కొన్నారు. ఐసీడీసీ, గ్రామీణ, నగరాభివృద్ధి, రైల్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ తదితర విభాగాల్లో కేంద్ర కార్యక్రమాలన్నీ ఇక్కడ లబ్ధి చేకూర్చుతాయన్నారు. మెట్రో రెండో దశ పనుల కోసం రూ.23 కోట్లు దక్కనున్నాయని తెలిపారు. 2024లో ఈ దశ పనులు ముగియనుండగా, అనంతరం 3వ, 4వ దశలకు నిధులు దక్కనున్నాయి. మూడో దశలో బెంగళూరు గ్రామీణ ప్రాంతాలు, 4వ దశలో మాగడి తదితర గ్రామాలు మెట్రో విస్తరణలో భాగమవుతాయన్నారు.

జీడీపీలో దూకుడు

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అత్యుత్తమంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రగతి కేవలం రెండు శాతం ఉందని ముఖ్యమంత్రి విశ్లేషించారు. వ్యవసాయం, సేవలు, ఉత్పాదన రంగాల్లో సాధిస్తున్న ప్రగతి జీడీపీకి దోహదకారిగా మారాయన్నారు. ఈ బడ్జెట్‌ ప్రభావం ప్రస్తుత జీడీపీ ప్రగతిని వేగవంతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. మూలధన వ్యయం కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించటం దేశ సమగ్రాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దార్శనికతకు నిదర్శనంగా వివరించారు. గత ప్రభుత్వాలు కేవలం రూ.2.5 లక్షల కోట్లను మాత్రమే మూలధన వ్యయానికి కేటాయించేవన్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్న దృక్ఫథంతో ఈ స్థాయి నిధులు విడుదల చేశారన్నారు.


కన్నడిగులకు చేయూత

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాష్ట్ర సరిహద్దు అభివృద్ధి ప్రాధికారకు రూ.100 కోట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. ఆ నిధులతో చేపట్టే పనులకు సంబంధించి నివేదికను మార్చి 31లోగా ఇవ్వాలని ప్రాధికార అధ్యక్షుడు సి.సోమశేఖర్‌కు సూచించారు. సరిహద్దు ప్రాంతాలలో ఉంటున్న కన్నడిగులకు విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, కన్నడ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. సరిహద్దు ప్రాంతాలలో కన్నడిగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సేవలందిస్తున్న వారికి ‘గడినాడ చేతన’ పురస్కారాలను ఆయన గురువారం ప్రదానం చేసి మాట్లాడారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని గుర్తు చేశారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, ప్రాధికార అధ్యక్షుడు సోమశేఖర్‌, మాజీ మంత్రులు లీలాదేవి ఆర్‌.ప్రసాద్‌, రాణి సతీశ్‌, ప్రాధికార ప్రతినిధులు ఎం.ఎస్‌.సింధూర, అశోక్‌ చందరగి పాల్గొన్నారు. డాక్టర్‌ చెన్నబసవ పట్టదేవరు, డాక్టర్‌ జయదేవి తాయి లిగాడె, డాక్టర్‌ కయ్యార కిఞణ్ణరైలకు ‘గడినాడ చేతన’ పురస్కారాలను ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని