logo

ప్రగతి కోసం నిధుల వెల్లువ

కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు ఎక్కువ నిధులను కేటాయించారని భాజపా కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌సింగ్‌ పేర్కొన్నారు.

Published : 04 Feb 2023 01:39 IST

భాజపా వేదికపై యడియూరప్ప, బొమ్మై, కటీల్‌, అరుణ్‌ సింగ్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు ఎక్కువ నిధులను కేటాయించారని భాజపా కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఎగువ భద్రా ప్రాజెక్టుకు రూ.5300 కోట్లతో పాటు వివిధ పథకాలను అమలు చేసేందుకు కేంద్రం మొదటి నుంచి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథభవన్‌లో శుక్రవారం నిర్వహించిన కేంద్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో పాల్గొనేందుకు ముందుగా తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. జలజీవన్‌ మిషన్‌కు రూ.70 వేల కోట్లు, రైల్వే పథకాలకు, నగరాభివృద్ధికి నిధులను కేటాయిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు. కర్ణాటకలో పలు జిల్లాలలో నీటి సమస్య ఉందని, దాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. కర్ణాటకలో ఈసారి భాజపా కనీసం 150 సీట్లు గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, పార్టీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ తదితరులు పాల్గొన్నారు.


సేద్యం.. విలువలు ఘనం

‘కాసిన సర’ ఆడియో విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి బొమ్మై తదితరులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : అన్నదాతను కేంద్రంగా చేసుకుని సేద్యాన్ని ప్రోత్సహించే పథకాలు అత్యవసరమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. సేద్యం ఎప్పుడూ విలువలతో కూడిన పవిత్ర కార్యమని అన్నారు. అనిశ్చితి మధ్యలోనూ భూమి తల్లి తనను నమ్ముకున్న వారికి జీవనాధారంగా ఉంటుందని తెలిపారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన సేద్యం చేస్తుంటారని వివరించారు. కాసినసర (కాసులపేరు) సినిమా ఆడియో సీడీని శుక్రవారం ఆయన బెంగళూరులో విడుదల చేసి మాట్లాడారు. ఒక గింజను విత్తితే.. వందలాది ధాన్యం గింజలు లభిస్తాయని తెలిపారు. గ్రామాలలో ఆడపిల్లలు, గృహిణులు ఎంతో ఇష్టపడే కాసులపేరును చేయించుకోవాలని ఆశపడుతుంటారని, దాన్ని ఇతివృత్తంగా చేసుకుని సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నంజుండేగౌడను సీఎం అభినందించారు. దర్శకుడు ఎస్‌టీ సోమశేఖర్‌, అటవీ అభివృద్ధి మండలి అధ్యక్షురాలు తారా అనూరాధ, నిర్మాత దొడ్డనాగేగౌడ, నటులు విజయ్‌ రాఘవేంద్ర, హర్షికా పుణచ్చ, నీనాసం సతీశ్‌, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు భా.మా.హరీశ్‌, నిర్మాత సంఘం అధ్యక్షుడు ఉమేశ్‌ బణకార్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని