logo

కుటుంబం ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు విషం తాగి బలవన్మరణానికి యత్నించారు.

Published : 04 Feb 2023 01:39 IST

ఒకరు మృతి - ఆరుగురు ఆస్పత్రిపాలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు విషం తాగి బలవన్మరణానికి యత్నించారు. చికిత్స అందించేలోగా మంగళమ్మ (28) అనే యువతి మరణించింది. ఆసుపత్రిలో చేరిన మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రామనగర తాలూకా దొడ్డ మణ్ణగుడ్డె గ్రామానికి చెందిన మంగళమ్మ, ఆమె భర్త రాజు (31), అత్త సొల్లాపురదమ్మ (48), పిల్లలు ఆకాశ్‌ (9), కృష్ణ (13), మంగళమ్మ చెల్లెలు సవిత (24), సవిత కుమార్తె దర్శిని (4) బెంగళూరు శివారు ప్రాంతం కుంబళగూడు సమీపంలోని సుబ్బరాయనపాళ్యలో ఉంటున్నారు. పిల్లలు బడికి వెళుతుండగా, పెద్దలందరూ కూలిపనులు చేసేవారు. కరోనా మహమ్మారి అనంతరం కుటుంబ నిర్వహణకు వారు ఇతరుల నుంచి తీసుకున్న రుణం వడ్డీతో కలిపి రూ.10 లక్షలకు చేరుకుంది. అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో సామూహికంగా ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానించారు. ఎలుకల మందులో చక్కెర, అరటి పండు గుజ్జు కలుపుకొని తమ పూర్వీకుల సమాధి వద్దకు వెళ్లి గురువారం సాయంత్రం దాన్ని తిన్నారు. వారు విషాన్ని తిన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మండ్యలోని మిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళమ్మ శుక్రవారం ఉదయం మరణించింది. రామనగర గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని