logo

యడియూరప్పే మా నాయకుడు

కర్ణాటక ఎన్నికలలో గెలుపు గుర్రాన్ని ఎక్కాలని కమలనాథులు కసితో పని చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కావలసిన 113 సీట్ల మ్యాజిక్‌ మార్కుకు మూడు నుంచి ఆరడుగుల దూరంలోనే కాషాయ పార్టీ నిలిచిపోయింది

Published : 05 Feb 2023 06:50 IST

గెలుపు పాఠాలు నేర్పిన బీఎల్‌ సంతోశ్‌

యడియూరప్పతో ఆత్మీయంగా మాట్లాడుతున్న బీఎల్‌ సంతోశ్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కర్ణాటక ఎన్నికలలో గెలుపు గుర్రాన్ని ఎక్కాలని కమలనాథులు కసితో పని చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కావలసిన 113 సీట్ల మ్యాజిక్‌ మార్కుకు మూడు నుంచి ఆరడుగుల దూరంలోనే కాషాయ పార్టీ నిలిచిపోయింది. స్వతంత్ర అభ్యర్థులు, ఆపరేషన్‌ కమలతోనే అధికారంలోకి రావలసి వచ్చింది. ఈసారి కనీసం 150 సీట్లు దక్కించుకునేందుకు భాజపా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ప్యాలెస్‌ మైదానంలో నిర్వహించిన భాజపా శనివారం నిర్వహించిన కార్యవర్గం సమావేశాలను మాజీ ముఖ్యమంత్రి, పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప ప్రారంభించారు. యడియూరప్పను పక్కన పెట్టి కర్ణాటకలో ప్రచారం చేసినా ప్రయోజనం లేదని పార్టీ అధిష్టానం ఇప్పటికే గుర్తించింది. ఈ సమావేశంలో ఆయనకే పెద్ద పీట వేసింది. పాత మైసూరు జిల్లాలపై ఎక్కువ దృష్టి పెడితే, ఈసారి గెలుపు నల్లేరుపై నడక అవుతుందని పార్టీ జాతీయ సంఘటన కార్యదర్శి బీఎల్‌ సంతోశ్‌ పార్టీ నేతలకు సూచించారు. తమ పరిధిలో చేపడుతున్న పనులు, కార్యక్రమాలతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పథకాలను ఓటర్లకు తెలిపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రులు సదానందగౌడ, జగదీశ్‌ శెట్టర్‌, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటీల్‌, పార్టీ వ్యవహారాల బాధ్యులు అరుణ్‌సింగ్‌, డీకే అరుణలు పార్టీ నేతలు, కార్యకర్తలు, మోర్చా ప్రతినిధులను ఉత్సాహ పరిచారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాధ్వని, జనతాదళ్‌ పంచరత్న యాత్రలను ప్రహ్లాద్‌ జోషీ విఫలయాత్రలుగా అభివర్ణించారు. దళ్‌ యాత్రను నవగ్రహ యాత్రగా పేర్కొన్నారు.

అధికారం సాధిస్తాం: గోయల్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఈసారి కర్ణాటకలో భాజపా భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప భాజపాలో తిరుగులేని నాయకుడని ప్రశంసించారు. ఆయన మార్గదర్శనంలోనే తాము ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. పీయూష్‌ శనివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు 40 శాతం కమీషన్ల ఆరోపణలను విపక్షాలు తెరపైకి తీసుకు వచ్చాయని ఆరోపించారు. అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పథకాలను అందిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతితో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వివరించారు. ప్రపంచంలో ఆర్థికాభివృద్ధిలో 10 నుంచి ఐదవ స్థానానికి వచ్చిన భారతదేశం.. త్వరలో మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికీ విద్యుత్తు, నీటిని అందించేందుకు జారీ చేస్తున్న పథకాలకు పౌరుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ అశ్వత్థ నారాయణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


ఉదయం ధర్మేంద్ర.. ఆపై మాండవియా!

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : విధానసభ ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా, భాజపా తమిళనాడు శాఖ అధ్యక్షుడు అణ్ణామలైకు కర్ణాటక బాధ్యతలు కట్టబెట్టారు. మన్‌సుఖ్‌ మాండవియాను పార్టీ ఎన్నికల వ్యవహారాల బాధ్యునిగా, కె.అణ్ణామలై సహ బాధ్యునిగా వ్యవహరిస్తారని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఉదయం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఎన్నికల వ్యవహారాల బాధ్యునిగా వ్యవహరిస్తారని నడ్డా ప్రకటించారు. రాత్రికి రాత్రే ఆయన స్థానంలో మాండవియాను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక భాజపాకు ధర్మేంద్ర ప్రధాన్‌ గతంలో ఒకసారి ఎన్నికల వ్యవహార బాధ్యునిగా వ్యవహరించగా, మాండవియాకు మొదటిసారిగా ఇక్కడి బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని