logo

కావేరి జలాలు వృథా కానివ్వొద్దు: డీకేశి

కావేరి నదీ జలాలలో కన్నడిగులకు ఉన్న హక్కును విడిచి పెట్టకూడదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. నీటిని విడిచి పెడితే వృథాగా సముద్రంలో కలిసి పోతుందని గుర్తు చేశారు.

Published : 06 Feb 2023 01:32 IST

శివకుమార్‌కు శాలువా కప్పి సత్కరిస్తున్న అర్చకుడు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: కావేరి నదీ జలాలలో కన్నడిగులకు ఉన్న హక్కును విడిచి పెట్టకూడదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. నీటిని విడిచి పెడితే వృథాగా సముద్రంలో కలిసి పోతుందని గుర్తు చేశారు. కనకపురలో ఆదివారం తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. నీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటే మండ్య, చామరాజనగర, హాసనలలో సాగుకు, బెంగళూరుకు తాగునీటికి కొరత పూర్తిగా తొలగిపోతుందని చెప్పారు. తమిళనాడుకు అదనంగా వెళ్తున్న నీటిని వినియోగించుకునేందుకు వారు ఆయా ప్రాంతాలలో కుంటలు, చెరువులు, మినీ ప్రాజెక్టులు నిర్మించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇంత చేసినా 400 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాల్ని లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. మేకెదాటుతో పాటు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి న్యాయపోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రజాధ్వని యాత్ర సమయంలో ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. తమ పార్టీ పోరాటం తర్వాత మేకెదాటు కోసం కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినా, ఇప్పటికీ కేంద్రం అనుమతులు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అని చెప్పుకొంటున్న భాజపా ప్రజలకు చేసిన మేలేమీ లేదని దుయ్యబట్టారు. ఎగువ కృష్ణా ప్రాజెక్టు, మహదాయి, మేకెదాటు పథకాలకు సంబంధించిన పథకాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, ఇప్పటి వరకు లోక్‌సభలో ఆ పార్టీ నాయకులు చేష్టలుడిగి పోయినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భాజపాకు పూర్తి మెజార్టీ వస్తే బ్రాహ్మణ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని కుమారస్వామి చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ ‘నాకు భవిష్యత్తు తెలియదు. కాంగ్రెస్‌ పార్టీ విషయం మాత్రమే తెలుసు. సామూహిక నాయకత్వంలోనే ఎన్నికలలో విజయం సాధిస్తాం. సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం’ అని తెలిపారు. ప్రజాధ్వని యాత్ర సగంలోనే ఆగిపోతుందని భాజపా నాయకుల విమర్శలకు బదులిస్తూ దక్షిణ కన్నడ, ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో మా యాత్రకు వచ్చిన స్పందన టీవీలలో ప్రతి ఒక్కరూ చూశారు. వారి వ్యాఖ్యలకు తాను సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదన్నారు.

జాతరలో శివకుమార్‌ దంపతులు

ప్రజాధ్వని యాత్రకు ఆదివారం విరామం ఇవ్వడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తన భార్య ఉషతో కలిసి తన నియోజకవర్గం కనకపురకు వెళ్లారు. కనకపుర దేగులమఠం శ్రీఆది నిర్వాణ మహా శివయోగి జాతరలో పాల్గొన్నారు. రథంపైకి పూలను విసిరి తమ మొక్కు తీర్చాలని కోరుకున్నారు. ఉషతో కలిసి కొంత దూరం రథాన్ని లాగారు. ఆలయంలో పూజ, అర్చన చేయించుకున్నారు. జాతరలో తిరుగుతూ బొరుగులు, మరికొన్ని తినుబండారాలు కొనుగోలు చేసుకున్నారు. తనతో వచ్చిన కార్యకర్తలు, భద్రత సిబ్బంది, స్థానికులకు వాటిని వితరణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని