logo

21న అమిత్‌ షా బళ్లారి రాక

రాబోయే విధానసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భాజపాను మరింత పటిష్ఠం చేయడానికి ఈ నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బళ్లారి నగరానికి రానున్నట్లు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 01:48 IST

వివరాలు వెల్లడిస్తున్న మంత్రి బి.శ్రీరాములు, చిత్రంలో శాసనసభ్యుడు

గాలి సోమశేఖర్‌రెడ్డి, లోక్‌సభ మాజీ సభ్యురాలు శాంత, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: రాబోయే విధానసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భాజపాను మరింత పటిష్ఠం చేయడానికి ఈ నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బళ్లారి నగరానికి రానున్నట్లు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. స్థానిక నల్లచెరువులో నూతనంగా నిర్మించిన డా.బాబు జగ్జీవన్‌రాం నూతన భవనం, విగ్రహం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. విధానసభ ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి భాజపా అధికారంలోకి తీసుకుని రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. భాజపా నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి మాట్లాడటం సరికాదన్నారు. ప్రహ్లాద్‌ జోషి ప్రస్తుతం పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటున్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి ప్రకటనలు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వంలో తాము ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని మరోసారి భాజపాను అధికారంలోకి తెస్తామని చెప్పారు. తాను, మాజీ మంత్రి సంతోష్‌లాడ్‌ పార్టీలకు అతీతంగా మంచి స్నేహితులం. ఈ మధ్యలో బన్నిహట్టిలో ఓ జాతరలో ఇద్దరు చాలా రోజుల తర్వాత కలవడం వల్ల ఆప్యాయంగా మాట్లాడినట్లు తెలిపారు. దీని వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. మంత్రి బి.శ్రీరాములు సండూరు విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేస్తే ఇద్దరు కలిసినట్లు సామాజిక మాధ్యల్లో వార్తలు రావడం సరికాదు. పార్టీ అధిష్ఠానం ఎక్కడ పోటీ చేయాలని చెబితే అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని