logo

వేసవి ముంగిట రాజకీయ వేడి

కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కసరత్తుపై గురువారం చర్చించనున్న క్రమంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది.

Updated : 09 Mar 2023 05:32 IST

ఫిరాయింపు రాజకీయం షురూ

పెత్తనం కోసం అధికారపక్ష పోరు

పార్టీకి.. ముందు వెనుక బొమ్మై- అప్ప నాయకత్వం

ఈనాడు, బెంగళూరు : కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కసరత్తుపై గురువారం చర్చించనున్న క్రమంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. ఈ చర్చల అనంతరం ఏ క్షణంలోనైనా ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశముంది. అనధికారికంగా ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు.. పార్టీ కార్యాలయాలన్నీ వలస నేతలతో సందడిగా కనిపిస్తున్నాయి. పాత జెండాలు పక్కనపెట్టి- కొత్త బావుటాలు మోసేందుకు ద్వితీయ శ్రేణి నేతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. పార్టీల అంతర్గత సమాచారంతో తమకు, లేదా తమ అభిమాన నేతలకు టికెట్‌ రాదని తెలుసుకున్న జిల్లా స్థాయి నేతలు మూకుమ్మడిగా పార్టీలను ఫిరాయిస్తున్నారు. జాతీయ పార్టీల్లో ఈ రాకపోకలు మరింత అధికంగా ఉన్నాయి. మరోవారంలో ఈ రెండు పార్టీల్లో ప్రథమ శ్రేణి నేతలు కూడా తమకు ఇష్టమైన పార్టీ గూటికి ఎగిరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

భాజపా.. సమీకరణాలు

ఫిరాయింపు పర్వంతోనే అధికార పగ్గాలు చేపట్టిన అధికార పక్షం భాజపా.. గత మూడున్నరేళ్ల పాలన కాలంలో విధేయులను ఏమాత్రం పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. చివరి విడత మంత్రివర్గ విస్తరణ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన సీనియర్లు, పార్టీ విధేయులు చివరకు భంగపడ్డారు. సీనియర్‌ ఎమ్మెల్యేలు రేణుకాచార్య మొదలు తిప్పారెడ్డి, పూర్ణిమ శ్రీనివాస్‌, కేఎస్‌ ఈశ్వరప్ప, రమేశ్‌ జార్ఖిహొళి, సి.పి.యోగేశ్వర్‌ వంటి 20 మంది నేతలు చివరికంటా తమ ఆశలు నెరవేర్చుకోలేకపోయారు. మంత్రివర్గంలో వలస నేతల హవా చివరి వరకు కొనసాగింది. మలివిడత విస్తరణలో ప్రక్షాళనకు అవకాశం ఉందని భావించిన సినీయర్లు- ఎన్నికల ముంగిట నిలుచున్నారు. ఈ పార్టీలో ప్రత్యక్ష రాజకీయానికి వయసు పరిమితులు సీనియర్ల అవకాశాలకు గండికొడుతున్నాయి. తిప్పారెడ్డి, వి.సోమణ్ణ తదితరులు 70 ఏళ్ల పైబడిన వారు కావటంతో వీరికి రానున్న ఎన్నికల్లో సీటు కష్టమన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేఎస్‌ ఈశ్వరప్పకు సైతం ఇదే సమస్య తలెత్తుతోంది. రానున్న ఎన్నికల్లో గెలుపు సత్తా కంటే ఎన్నికలు ఎదుర్కొనే యువ నాయకత్వాన్ని ముందుకు తేవాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ కారణంగా పార్టీలో భవిష్యత్తు కష్టమనుకున్న నేతలంతా ప్రత్యామ్నయాల వైపు దృష్టి సారిస్తున్నారు.

కాంగ్రెస్‌కు ఖర్గే నాయకత్వ బలం ఉపకరించేనా?

పెత్తనమెవరిది?

అధికార పక్షంలో నిర్ణయాధికారం అతి పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన యడియూరప్ప వచ్చే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తారని పార్టీ త్రిమూర్తులు- ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగంగా ప్రకటించి వెళ్లారు. సీట్ల పంపిణీల్లోనూ ఆయన పాత్ర కీలకం కానుండటంతో పార్టీలో ఆధిపత్య పోరు జోరందుకుంది. మరోవైపు పార్టీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోశ్‌ కూడా యడియూరప్పకు అధిష్ఠానం ఇస్తున్న మద్దతు చూసి కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా తన వారసుల కోసం యడియూరప్ప చేస్తున్న ప్రయత్నాలు ద్వితీయ శ్రేణి నేతలకు కంటగింపుగా మారినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి బొమ్మై నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినా ఎన్నికల తర్వాత సమీకరణాలు ఎవరి నాయకత్వాన్ని సూచిస్తాయో అంతుచిక్కని వ్యవహారం.

కాంగ్రెస్‌కు ఎవరో

ప్రస్తుతం కాంగ్రెస్‌లో నాయకత్వ పోరు పైకి కనిపించకున్నా నివురుగప్పిన నిప్పులానే ఉంది. కీలక నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తమదైన స్థాయిలో ప్రచార రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో సోనియాగాంధీ నిర్ణయాధికారం నుంచి పక్కకు తప్పుకోవటం, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు రాష్ట్ర సీనియర్‌ నాయకులకు సలహాలు ఇచ్చేంత అనుభవం లేకపోవటం పార్టీని వెన్నాడుతున్న ప్రధాన సమస్య. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం రాష్ట్ర వ్యవహారాల్లో అంత చురుకుగా కనిపించకపోవటం కూడా పార్టీ ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా పార్టీలోనికి వలస నేతలకు రాష్ట్ర నేతలే కీలకంగా మారారు. ప్రస్తుతం భాజపా నుంచి మంత్రివర్గంలో పని చేసిన ముగ్గురు నేతలు, జేడీఎస్‌ సీనియర్‌ నేత శివలింగేగౌడ, కోలారు శ్రీనివాసగౌడ కాంగ్రెస్‌లో చేరటం దాదాపు ఖరారైంది. మరోవారం పాత మైసూరు నుంచి మరో ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు 30 మందికిపైగా భాజపా, జేడీఎస్‌ల నుంచి కాంగ్రెస్‌ జెండాను అందుకున్నారు. వీరి సంఖ్య వచ్చే వారంలో మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

జనతాదళ్‌లో తండ్రీ కుమారులే కీలకం

జేడీఎస్‌ దారెటు?

మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ అనారోగ్యం, కుటుంబ కలహాలతో జేడీఎస్‌లో అంతా సవ్యంగా లేదన్నది కొట్టిపారేయలేని వాస్తవం. కేవలం కుమారస్వామి మాత్రమే పార్టీని ఒంటి చేత్తో మోస్తున్నారు. ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం లేని నేతలు ఒక్కొక్కరుగా ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తుండటం ఆ పార్టీని వెన్నాడే కీలక ఇబ్బంది. ఇప్పటికే 75 శాతం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జేడీఎస్‌లో భవిష్యత్తు కోసం ఎదురు చూసేవారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. జాతీయ స్థాయి ఎన్నికల పూర్వ విశ్లేషణలు రాష్ట్రంలో మళ్లీ సంకీర్ణం అన్న సమీక్షలు మాత్రమే జేడీఎస్‌కు బలంగా మారాయి. కనీసం 30 స్థానాలు సాధించినా ఆ పార్టీ కింగ్‌ మేకర్‌ కాగలదన్న ధీమా ఎక్కువగా ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు