logo

కేసరి దళానికి సారథులు సిద్ధం

 అధికార పక్షం భాజపా..ఎన్నికల ప్రచారానికి సారథులను నియమించింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ రెండు నెలల క్రితమే ప్రచార సమితిని ఏర్పాటు చేసి దూకుడు ప్రదర్శించింది.

Published : 11 Mar 2023 02:46 IST

ప్రచారానికి ముఖ్యమంత్రి, నిర్వహణ సమితికి శోభాకరంద్లాజె
యడియూరప్ప, విజయేంద్రకూ చోటు

గురువా..సారథ్యం నాది.. నడిపించేది మీరే..!

ఈనాడు, బెంగళూరు: అధికార పక్షం భాజపా..ఎన్నికల ప్రచారానికి సారథులను నియమించింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ రెండు నెలల క్రితమే ప్రచార సమితిని ఏర్పాటు చేసి దూకుడు ప్రదర్శించింది. కాస్త ఆలస్యమైనా భాజపా..సమర్థులైన నేతలకు పగ్గాలు అందించి ఎన్నికల బరిలో దిగింది. ఎన్నికల ప్రచార సమితి, ఎన్నికల నిర్వహణ సమితి సారథులు, సభ్యుల జాబితాను శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వెల్లడించారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర సహాయ మంత్రి శోభాకరంద్లాజె రెండు సమితులకు బాధ్యత వహిస్తుండగా, మరో 23మంది నేతలు ఈ రెండు సమితుల్లో సభ్యులుగా నియమితులయ్యారు.

ముఖ్యమంత్రికే ప్రచార సమితి బాధ్యతలు

ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నాయకత్వంలోనే ఎదుర్కోవాలని అధిష్ఠానం ఇప్పటికే స్పష్టపరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ అంశాన్ని బహిరంగ సభల్లో స్పష్టం చేశారు. తాజాగా వెల్లడించిన ఎన్నికల ప్రచార సమితికి కూడా ముఖ్యమంత్రిని అధ్యక్షుడిగా నియమించారు. ఈ సమితిలో మరో కీలక నేత, పార్లమెంటరీ మండలి సభ్యుడు బి.ఎస్‌.యడియూరప్ప సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ సమితిలోని ఇతర సభ్యులు..నళిన్‌ కుమార్‌ కటీల్‌, డి.వి.సదానందగౌడ, జగదీశ్‌ శెట్టర్‌, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, శోభా కరంద్లాజె, ఎ.నారాయణస్వామి, మంత్రులు గోవింద కారజోళ, బి.శ్రీరాములు, ఆర్‌.అశోక్‌, శశికళా జొల్లె, సి.సి.పాటిల్‌, ఎస్‌.టి.సోమశేఖర్‌, డా.కె.సుధాకర్‌, ప్రభు చౌహాణ్ణ్‌, అశ్వత్థనారాయణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, ఎంపీలు శ్రీనివాస ప్రసాద్‌, పి.సి.మోహన్‌, మాజీ మంత్రులు కేఎస్‌.ఈశ్వరప్ప, అరవింద లింబావళి, లక్ష్మణ సవది, రమేశ్‌ జార్ఖిహొళి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వై.విజయేంద్ర, ఎస్‌సీ మోర్చా అధ్యక్షులు చలవాది నారాయణస్వామి

శోభా నాయకత్వంలో నిర్వహణ సమితి

కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజెకు ఈ ఎన్నికల్లో కీలక బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల నిర్వహణ సమితికి ఆమెను సంచాలకురాలిగా నియమించారు. ఈ సమితిలో ఇతర సభ్యులుగా కేంద్ర మంత్రి భగవంత ఖూబా, రాష్ట్ర మంత్రి కోటా శ్రీనివాస పూజారి, మాజీ మంత్రి అరవింద లింబావళి, మాజీ విధానపరిషత్తు స్పీకర్‌ రఘునాథరావ్‌ మల్కాపురె, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్మల్‌ కుమార్‌ సురానా, తేజస్విని అనంతకుమార్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.రవికుమార్‌, సిద్ధరాజు, మంత్రి అశ్వత్థనారాయణ, మహేశ్‌ టెంగిన కాయ, కేశవ ప్రసాద్‌, చలవాది నారాయణస్వామి, మహిళా మోర్చా అధ్యక్షులు గీతా వివేకానంద.

శోభాకరంద్లాజె

రెండింటా సభ్యత్వం

ప్రచార, నిర్వహణ సమితుల్లోనూ సభ్యులుగా వ్యవహరిస్తారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె, రాష్ట్ర మంత్రి అశ్వత్థనారాయణ, అరవింద లింబావళి, చలవాది నారాయణస్వామిలు ఇరు సమితిల్లో బాధ్యతలు వహిస్తారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుమారుడు బి.వై.విజయేంద్రలు ఇద్దరూ ప్రచార సమితిలో చోటు దక్కించుకోవటం విశేషం. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప.. జాతీయ పార్లమెంటరీ బోర్డు, రాష్ట్ర ప్రచార సమితిలోనూ సభ్యులుగా వ్యవహరిస్తూ..తన కుమారుడికి తగిన ప్రాతినిధ్యం దక్కించటంలోనూ విజయం సాధించారు.

విజయేంద్ర

ఇన్‌ఛార్జిలు వీరే

రెండు వారాల క్రితం ఎన్నికల కోసం జాతీయ నేతలకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. వీరిలో రాష్ట్ర ఎన్నికల బాధ్యులుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, సహ బాధ్యులుగా కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, తమిళనాడు భాజపా అధ్యక్షుడిగా అణ్ణామలైలను నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు