logo

కన్నడనాడుపై కమలదళ ప్రగతి బావుటా

శంకుస్థాపన చేసిన నాలుగేళ్లలోనే సేవలకు సిద్ధమయ్యే రికార్డు ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు పచ్చజెండా ఊపనున్నారు.

Updated : 12 Mar 2023 07:23 IST

రికార్డుల ప్రాజెక్టులకు పచ్చజెండా
సిద్ధమైన బెంగళూరు-మైసూరు, ఐఐటీ ధార్వాడ, సిద్ధరూడ రైల్వే స్టేషన్లు
నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని

అనతికాలంలోనే పూర్తయిన ఐఐటీ ధార్వాడ విద్యాలయ భవనం

ఈనాడు, బెంగళూరు: శంకుస్థాపన చేసిన నాలుగేళ్లలోనే సేవలకు సిద్ధమయ్యే రికార్డు ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు పచ్చజెండా ఊపనున్నారు. వేల కోట్ల వ్యయమంటేనే దశాబ్దాల సమయం పడుతుందన్న అభిప్రాయాలకు తాజా ప్రాజెక్టులు చరమగీతం పాడాయి. ఓ ప్రాజెక్టు మూడేళ్లలో, మరో ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తి చేయగా, ఈ రెండు ప్రాజెక్టులు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టడం విశేషం. నేడు (ఆదివారం) ప్రధాని ప్రారంభించే ఈ అరుదైన ప్రాజెక్టుల్లో ఒకటి గిన్నిస్‌ బుక్‌ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు పుటల్లో చేరటం మరో విశేషం. ఈ ప్రాజెక్టుల వివరాలిలా ఉన్నాయి..

శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు

మైసూరు కుశాల్‌నగర 4 వరుసల జాతీయ రహదారి (రూ.4,130 కోట్లు), హుబ్బళ్లి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు (రూ.520 కోట్లు), జయదేవ హాస్పిటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (రూ.250 కోట్లు), ధార్వాడ బహుళ గ్రామ నీటి సరఫరా ప్రాజెక్టు (రూ.1,040 కోట్లు), తిప్పరహళ్లి వరద నియంత్రణ ప్రాజెక్టు (రూ.150 కోట్లు)

మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.16వేల కోట్లు పర్యటన వివరాలు

ప్రధాని మోదీ నేటి మధ్యాహ్నం 12 గంటలకు మండ్యకు చేరుకుంటారు. ఇక్కడ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం, మైసూరు-కుశాల్‌ నగర్‌ నాలుగు వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం 3.15 గంటలకు హుబ్బళ్లి-ధార్వాడలో ఐఐటీ ధార్వాడ, ఇదే వేదిక నుంచి సిద్ధరూఢ స్వామీజీ హుబ్బళ్లి స్టేషన్‌, హొసపేటె-తినైఘాట్‌ విద్యుత్తు రైల్వే మార్గాన్ని ప్రారంభిస్తారు. అనంతరం హుబ్బళ్లి- ధార్వాడ స్మార్ట్‌సిటీ, జయదేవ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ కేంద్రం, జల్‌జీవన్‌ మిషన్‌, వరద నియంత్రణ వ్యవస్థలకు శంకుస్థాపన చేశాక ప్రధాని మోదీ దిల్లీకి పయనమవుతారు.

సాంకేతిక, సాంస్కృతిక నగరాల అనుసంధానం

సాంకేతిక నగరి బెంగళూరు, సాంస్కృతిక నగరి మైసూరుల మధ్య అంతరాన్ని గంటల నుంచి నిమిషాలకు కుదించే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వే.. రాష్ట్ర ప్రజలకు కేంద్ర, రాష్ట్రాల పథకంలో భాగంగా అందించే ప్రాజెక్టు. 2018 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ మైసూరులో ఈ ప్రాజెక్టుపై హామీ ఇచ్చారు. ఆ మరుసటి రోజే మంత్రివర్గ సమావేశంలో తీర్మానించటం, నెల తర్వాత శంకుస్థాపన కూడా చేశారు. ఐదేళ్ల కాలంలో రెండు దశల్లో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టుకు తొలి దశలో 56 కిలోమీటర్లకు రూ.4,428 కోట్లు, రెండో దశలో 61 కిలోమీటర్లకు రూ.4,500కోట్లు వ్యయం చేశారు. మొత్తం 143 కి.మీల దూరమున్న ఈ మార్గం..ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా 118 కిలోమీటర్లకు, 3.15గంటల సమయం 75 నిమిషాలకు తగ్గనుంది. ఈ మార్గంలో ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌ హైవే, రెండు వైపులా రెండు వరుసల సేవా రహదారులున్నాయి. రైళ్లు, ఇతర వాహనాల రాకపోకలకు 44 చిన్న వంతెనలు, 13చోట్ల అండర్‌ పాస్‌, 8.7కిలోమీటర్ల ఎలివేటేటెడ్‌ మార్గం కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి యాక్సల్‌ కంట్రోల్డ్‌ హైవే వ్యవస్థ ఈ మార్గంలో ఏర్పాటు చేశారు. మైసూరు దసరా ఉత్సవాలు ప్రపంచ ఖ్యాతి పొందటంతో పర్యాటకుల రాక ఏటేటా పెరుగుతోంది.  ఈ హైవే మార్గంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, హోటళ్లు, పర్యాటక ప్రాంతల ద్వారా దాదాపు 7వేల మందికి ఉపాధి దొరుకుతుంది.

* హుబ్బళ్లిలోని రైల్వే స్టేషన్‌ను ఏడాదిన్నర కాలంలో ఉన్నతీకరించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫాం ఈ స్టేషన్‌లో ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫాంలో స్వచ్ఛత, కర్ణాటక సంస్కృతి, ఆధ్యాత్మిక చరిత్రను చెప్పే అరుదైన విగ్రహాలు, చిత్రాలతో రంగరించారు. ఈ స్టేషన్‌కు సిద్ధరూఢ స్వామీజీ స్టేషన్‌గా నామకరణం చేశారు.

* 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ఐఐటీ ధార్వాడ నేడు పూర్తిస్థాయి కట్టడాలతో ప్రారంభం కానుంది. ఇందులో 4 ఏళ్ల బీటెక్‌, 5 ఏళ్ల బీఎస్‌, ఎంఎస్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ, ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు నిర్వహిస్తారు.

* హొసపేటె-తినైఘాట్‌ సెక్షన్‌ విద్యుత్తు రైల్వే లైన్‌ ఉత్తర కర్ణాటక ప్రాంతీయ మార్గాలను కలిపే రైల్వే ప్రాజెక్టు. ఇందులోనూ ఆధునిక హంగులతో కూడిన సదుపాయాలు, హంపీ కట్టడాలతో చిత్రాలు కనువిందు చేస్తాయి.


ఆ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది

ఈనాడు, బెంగళూరు: బెంగళూరు-మైసూరు పది వరుసల ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుకు మేము ప్రతిపాదన, డీపీఆర్‌ చేస్తే ఆ పని తామే చేసినట్లు భాజపా గొప్పలకు పోతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. విపక్షాల ఆరోపణలకు శనివారం బదులిచ్చిన ముఖ్యమంత్రి ఇలా స్పందించారు. ఈ మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులు 2004లోనే ప్రారంభించారు. 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించింది. ఆపై దశాబ్దాలుగా ఈ రహదారి విస్తరణకు నోచుకోలేదు.  విస్తరణకు, ఉన్నతీకరణకు నోచుకోని ఇలాంటి రహదారులు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 2014లో డీపీఆర్‌ అయిన ఈ రహదారి పది వరుసల ప్రతిపాదనకు 2015లో అలైన్‌మెంట్‌ దక్కగా, అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ మార్గాన్ని జాతీయ రహదారి ప్రాధికారకు స్వాధీనం చేసింది. ఆపై పలుమార్లు టెండర్‌ ప్రక్రియలు పూర్తి చేసుకుంది. సివిల్‌ కేసులు, భూసేకరణకు రూ.2,190కోట్లు వ్యయం చేసిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 2018లో రూ.4,429కోట్ల సవరణ వ్యయంగా నిర్ధరించారు. 2018లో శంకుస్థాపన చేసిన ప్రధాని తన చేతులతోనే ప్రారంభించటం ఓ రికార్డని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైల్వే, జాతీయ రహదారులకు ప్రధానికి ఉన్న నిబద్ధతకు ఈ ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు 50 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలకు తెలుసు. డీపీఆర్‌, నిధులు విడుదల చేసినా ప్రాజెక్టులకు మోక్షం దొరకకపోవటం ఎవరి పుణ్యమో ప్రజలు గమనిస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని