logo

ఎన్నికల వేళ.. పరిశ్రమల జోరు!

కేవలం రెండు నెలల వ్యవధిలో ఎన్నికలుండగా భారీ ప్రాజెక్టులకు వడివడిగా అనుమతులు లభిస్తున్నాయి. జనవరి నుంచి మార్చి వరకు రూ.వేలాది కోట్ల విలువైన ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి ఏకగవాక్ష అనుమతుల సమితి (ఎస్‌ఎల్‌ఎస్‌డబ్ల్యుసీసీ) పచ్చజెండా ఊపింది.

Published : 22 Mar 2023 02:49 IST

కన్నడనాట పరిశ్రమల్లో ఆటోమేషన్‌ విప్లవం

ఈనాడు, బెంగళూరు : కేవలం రెండు నెలల వ్యవధిలో ఎన్నికలుండగా భారీ ప్రాజెక్టులకు వడివడిగా అనుమతులు లభిస్తున్నాయి. జనవరి నుంచి మార్చి వరకు రూ.వేలాది కోట్ల విలువైన ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి ఏకగవాక్ష అనుమతుల సమితి (ఎస్‌ఎల్‌ఎస్‌డబ్ల్యుసీసీ) పచ్చజెండా ఊపింది. మరో కీలకమైన విదేశీ పెట్టుబడి ప్రాజెక్టు కూడా రాష్ట్రంలో ఏర్పాటు కావటం విశేషం. భారీ పెట్టుబడులు, అంతే స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే ఈ ప్రాజెక్టులకు తొలి విడత నిధులు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఉత్సాహాన్ని చూపుతోంది.

* తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీ సంస్థ ‘ఫాక్స్‌కాన్‌’ రాష్ట్రంలో ఐఫోన్‌ యూనిట్‌ను స్థాపించాలన్న ప్రతిపాదన పెద్ద వివాదమే సృష్టించింది. మార్చి 3న ముఖ్యమంత్రితో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైన విషయం రాజకీయ పరంగా వివాదాలు సృష్టించింది. ఆ సమావేశంలో చర్చించింది, వినియమం చేసుకున్న అంశం కేవలం ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌’కు సంబంధించినదేనని ఫాక్స్‌కాన్‌ సంస్థ స్పష్టం చేసింది. ఈ చర్చలు కంపెనీ స్థాపనను నిర్ధరించలేదని ఆ సంస్థ రెండు పుటల ఉత్తరం ద్వారా వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించటంతో రాజకీయ ప్రాధాన్యమేర్పడింది. ఈ వివాదాల నడుమ గతవారం ఇదే సంస్థ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తూ.. కర్ణాటకలో ఐఫోన్‌ తయారీ యూనిట్‌- ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌కు మేము సిద్ధమని ధ్రువీకరించింది. సోమవారం రాత్రి ఆ ప్రాజెక్టుకు అనుమతి కూడా లభించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ‘ఐఫోన్‌’ చేతికి దక్కేలా చేశాయి.

* ఐఫోన్‌ ఒప్పందం ప్రకారం దేవనహళ్లి తాలూకా, దొడ్డబళ్లాపురలో 300 ఎకరాల్లో ఫోన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. ఐటీ పెట్టుబడుల వలయం (ఐటీఐఆర్‌) పారిశ్రామిక వాడ.. పథకంలో భాగంగా ఏర్పాటు చేసే ఈ కేంద్రానికి రూ.8 వేల కోట్లను ఐదేళ్ల కాలపరిమితిలో వ్యయం చేస్తారు. ఐదేళ్లలో 50 వేల మందికి, పదేళ్లలో లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తారు.

* రాష్ట్రవ్యాప్తంగా 78 పరిశ్రమలకు కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ పరిశ్రమల్లో 32 వేల మందికి ఉపాధి కల్పిస్తారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.5,298 కోట్లుగా నిర్ధరించినట్లు పరిశ్రమల శాఖ ప్రకటించింది. మొత్తం రూ.3,552.66 కోట్లను వ్యయం చేస్తారు. రూ.50 కోట్ల కంటే తక్కువ మొత్తంతో 59 ప్రాజెక్టులకు గాను రూ.1,542 కోట్లను వ్యయం చేస్తారు. మరో రెండు ప్రాజెక్టులకు అదనంగా రూ.203 కోట్లను వెచ్చిస్తారు. మొత్తం 32 వేల మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నట్లు పరిశ్రమల శాఖ వెల్లడించింది. వీటిల్లో మైసూరు స్టీల్‌ లిమిటెడ్‌, ఎన్‌ఐడీఈసీ ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, సిలోన్‌ బెవరేజ్‌ క్యాన్‌, బాలాజీ వేఫర్స్‌, మంజుశ్రీ టెక్నోపార్క్‌, కాసిరోడా ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మహామానవ్‌ ఇస్పాట్‌, ఏసీఆర్‌ ప్రాజెక్టు, నియోబీ సొల్యూషన్‌, అభయ్‌ ఆగ్రోఫుడ్స్‌ ప్రాజెక్టులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని