logo

జన సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజల జీవితాల్లో మార్పులు సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పేర్కొన్నారు. కుణిగల్‌ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాధ్వని యాత్రలో ఆయన పాల్గొన్నారు.

Published : 22 Mar 2023 02:49 IST

కుణిగల్‌ పట్టణంలో డీకే శివకుమార్‌ వాహనంపై పూలవాన

తుమకూరు, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజల జీవితాల్లో మార్పులు సాధ్యమని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పేర్కొన్నారు. కుణిగల్‌ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాధ్వని యాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడారు. ప్రజల కష్టాలు, బాధలు, సమస్యలు ఆలకించడం కోసమే మీ దగ్గరికి వచ్చామని పేర్కొన్నారు. ప్రజల కష్టాలకు స్పందించడంతో పాటు వారికి పరిహార మార్గాలు చూపడానికి నాల్గు గ్యారెంటీ పథకాలు ప్రకటించామన్నారు. గృహజ్యోతి కింద ప్రతి ఇంటికీ 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, గృహలక్ష్మీ ద్వారా ఇంటి మహిళకు నెలకు రూ.2వేలు, పేద కుటుంబ సభ్యుడికి నెలకు 10 కిలోల బియ్యం, డిగ్రీ పూర్తయిన యువతకు యువనిధి పథకం కింద రెండేళ్ల పాటు నెలకు రూ.3వేలు, డిప్లొమా నిరుద్యోగులకు రూ.1500 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని వివరించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం శ్రమించిందని, భాజపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. కుమారసామికి మద్దతిచ్చి అధికారం ఇచ్చాం దాన్ని నిలబెట్టుకోలేదని జేడీఎస్‌పై మండిపడ్డారు. యాత్రలో బెంగళూరు రూరల్‌ లోకసభ సభ్యుడు డి.కె.శివకుమార్‌, రాజ్యసభ సభ్యుడు చంద్రశేఖర్‌, కుణిగల్‌ ఎమ్మెల్యే డా.రంగనాథ్‌, మాజీ మంత్రి ఉమాశ్రీ, మహిళా ప్రతినిధి అనసూయమ్మ వై.కె.రామయ్య, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని