logo

అంతు చిక్కని లెక్కలు

రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌ నేడో.. రేపో అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నా.. జాతీయ పార్టీలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.

Published : 24 Mar 2023 04:04 IST

అభ్యర్థుల ఎంపికలో ఇక్కట్లు
ఆలస్యమవుతున్న జాబితాలు

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌ నేడో.. రేపో అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నా.. జాతీయ పార్టీలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఉగాది పండుగ రోజు కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల తొలిజాబితాను వెల్లడిస్తామని ప్రకటించింది. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ ను వాయిదా వేసింది. ఇక అధికార పక్షం భాజపాలో అభ్యర్థుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అసలు తొలి జాబితాలో ఎందరికి టికెట్‌ ప్రకటిస్తారో.. ఏరోజు ప్రకటిస్తారో ఇంత వరకు తెలియరాలేదు. దిల్లీ నుంచి కీలక నేతలంతా వచ్చి పోతూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. జాబితా ఆ కబురు మాత్రం వెల్లడించలేకపోతున్నారు.

* కాంగ్రెస్‌ పార్టీ గతవారం దిల్లీలో టికెట్ల విషయంపై ఎన్నికల సమితిలో సుదీర్ఘంగా చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో రాష్ట్ర నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ సమావేశమయ్యారు. అభ్యర్థుల తొలి జాబితా దాదాపు ముగిసినట్లే భావించారు. హస్తిన నుంచే హస్తవాసుల భవిష్యత్తు బయటపడుతుందని ఊహించినా అలాంటిదేమీ జరగలేదు. ఈనెల 22న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించినా అదీ సంభవించలేదు. మరో రెండు రోజుల్లో ఆ కబురు అందిస్తామని డీకే శివకుమార్‌ వెల్లడించి ఉత్కంఠను మరింత కాలం పొడిగించారు. సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితా చివరి క్షణంలో తారుమారయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భాజపా ఏ క్షణంలోనైనా అభ్యర్థులను ప్రకటించే వీలుంది. ఆలోగా కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించేందుకు వెనకాడుతున్నారు.

వారి కోసమేనా?

కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి, కీలక నేత సిద్ధరామయ్య పోటీ చేసే స్థానం అంతు చిక్కని వ్యవహారంగా మారింది. తనకు తానుగానే కోలార నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఉన్నపళంగా తన మాట మార్చి సొంత పార్టీనే కాదు.. ప్రత్యర్థులను డోలాయమానంలో పడేశారు. సిద్ధరామయ్య స్థానంలో పోటీదారుడిగా అభ్యర్థిని ఎన్నుకోవటంలో భాజపా, జేడీఎస్‌లు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. 2018లోనే తాను పోటీ చేసిన చాముండేశ్వరిలో బయటి పార్టీలతో పాటు అంతర్గత శక్తులన్నీ పని చేశాయని స్వయంగా సిద్ధరామయ్య ప్రకటించారు. ఈసారి పోటీ చేసే స్థానాన్ని చివరి వరకు వెల్లడించరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోలార, వరుణ, బాదామి.. ఇలా ఎక్కడి నుంచైనా సిద్ధరామయ్య పోటీ చేసే వీలుంది. మరో వైపు పార్టీలో కొత్తగా చేరిన పుట్టణ్ణయ్య, మోహన లింగేకాయి, బాబూరావు చించనసూరు, త్వరలో చేరబోయే శివలింగేగౌడ తదితరుల కోసం టికెట్‌ లెక్కలు తారుమారయ్యే వీలుంది. ఇందు కోసం అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు మరింత సమయం తీసుకుంటున్నారు.

భాజపాలోనూ అంతే..

భాజపాలోనూ పైకి కనిపించకున్నా లోలోపల టికెట్లపై అంతర్గత సమీక్షలు కొనసాగుతున్నాయి. గెలుపు సత్తా, యువకులు, పార్టీ విధేయులు.. ఇలా విభిన్న సమీకరణాలతో జాబితా సిద్ధం చేయటం పార్టీకి తలకు మించిన భారంగా మారింది. ఈ జాబితా బాధ్యత అధిష్ఠానానికి చేరవేసినా స్థానిక నేతల నుంచి వచ్చే ఒత్తిడిని రాష్ట్ర నేతలు తట్టుకోలేని స్థితికి చేరారు. పార్టీలో ప్రస్తుతం 70వ పడిలో ఉన్నవారికి టికెట్‌ తప్పే ప్రమాదం ఉండటంతో ఆ వయసు వారంతా ప్రత్యామ్నయం కోసం చూస్తున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇప్పటికే తాను శిగ్గావి నుంచి పోటీ చేస్తానని ప్రకటించటమే కాదు.. మళ్లీ సీఎంగా వస్తానని తేల్చి చెప్పారు. మరోవైపు శికారిపుర క్షేత్రంలో బి.వై.విజయేంద్ర, శివమొగ్గ నుంచి కేఎస్‌ ఈశ్వరప్ప, హుబ్బళ్లి ధార్వాడ పశ్చిమ క్షేత్రం నుంచి అరవింద బెల్లద్‌, సోమణ్ణ, 2019లో బయటి నుంచి వచ్చిన 17 మందిలోనే 10 మంది భవిష్యత్తు డోలాయమానంలో ఉండటంతో అభ్యర్థుల జాబితాపై లెక్కలు తేలని పరిస్థితి. ఈనెల 26న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పర్యటన సందర్భంగా నిర్వహించే కోర్‌ కమిటీ సమావేశంలో అభ్యర్థుల వివరాలు ప్రకటించే వీలుందని సమాచారం.

ఆ పార్టీల జోరు..

ఇప్పటికే తొలి జాబితాలో 123 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జేడీఎస్‌ ఈనెల 26న మైసూరులో రెండో  జాబితాను వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. పంచరత్న రథయాత్రను ఒంటి చేత్తో చుట్టేసిన కుమారస్వామి ఈ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని మైసూరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరోజున కనీసం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని స్వయంగా కుమారస్వామి వెల్లడించారు. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ 80 మందితో తొలి జాబితాను ఇటీవల వెల్లడించింది. ఎన్నికల ముందు సమీక్షల ప్రకారం ఈసారి విధానసభలో అత్యధిక సంఖ్యలో సభ్యులు అడుగుపెడతారని ఆప్‌ ధీమాగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని