logo

కర్మయోగికి కన్నీటి వీడ్కోలు

శ్రవణ బెళగొళ జైన మఠం మూగబోయింది. మఠాధిపతి చారుకీర్తి భట్టారక స్వామి (75) ఇక లేరన్న చేదు నిజంతో ఆయన అనుచరులు విషణ్ణవదనులయ్యారు.

Updated : 24 Mar 2023 05:41 IST

ప్రధాని మోదీతో చారుకీర్తి స్వామి (పాతచిత్రం)

హాసన, న్యూస్‌టుడే : శ్రవణ బెళగొళ జైన మఠం మూగబోయింది. మఠాధిపతి చారుకీర్తి భట్టారక స్వామి (75) ఇక లేరన్న చేదు నిజంతో ఆయన అనుచరులు విషణ్ణవదనులయ్యారు. స్వామీజీకి సంబంధించిన చేదువార్త చెవినపడగానే గురువారం ఉదయమే శ్రీమఠానికి భక్తుల తాకిడి మొదలైంది. శ్రవణబెలగొళ పట్టణ శివార్లలోని చంద్రగిరి పర్వత సానువుల్లో గురువారం సాయంత్ర అంత్యక్రియల వేళ జైన భక్తులు, స్వామీజీ అనుచరులు కిటకిటలాడారు. జైన మఠాధిపతి మరణానికి ఆదిచుంచనగిరి మఠాధిపతి డాక్టర్‌ నిర్మలానందనాథ స్వామి, సిద్ధగంగ మఠాధిపతి సిద్ధలింగ స్వామి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ప్రధాని దేవేగౌడ, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, యడియూరప్ప, కుమారస్వామి, సదానందగౌడ, జగదీశ్‌ శెట్టర్‌ తదితరులు వేర్వేరుగా తమ సంతాప సందేశాలను విడుదల చేశారు.

* ‘శ్రీ క్షేత్రం శ్రవణ బెళగొళలోని జైన మఠాధిపతి, కర్మయోగి చారుకీర్తి భట్టారక పట్టాచార్య మహాస్వామి కన్నుమూసిన విషయం విని అత్యంత దుఖం కలిగింది. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవడం భక్తులందరినీ కలచి వేసే విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అని ముఖ్యమంత్రి బొమ్మై తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ‘దేశ వ్యాప్తంగా భక్తులను సొంతం చేసుకున్న చారుకీర్తి భట్టారక స్వామి మరణం చాలా బాధిస్తోంది. పలు సందర్భాలలో ఆయనను కలిసి మాట్లాడాను. ఆయన మరణం ధార్మిక రంగానికి తీరని నష్టం’ అని మాజీ ప్రధాని దేవేగౌడ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

ఘన చరిత..

భట్టారక స్వామి అసలు పేరు రత్నాకర. స్వస్తిశ్రీ చారుకీర్తి అనే బిరుదును భక్తులు ప్రదానం చేశారు. దక్షిణ కన్నడ జిల్లా కార్కళ తాలూకా వరంగలో 1949 మే 3న ఆయన జన్మించారు. శ్రవణ బెళగొళ దిగంబర జైన మఠానికి 1970లో ధర్మాచార్యగా బాధ్యతలు చేపట్టారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చరిత్ర, బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తత్వశాస్త్రాన్ని, పీజీ పట్టాను అందుకున్నారు. కన్నడ, సంస్కృతం, ప్రాకృత భాషలలోనూ పీజీ పట్టాలు అందుకున్నారు. జైనం పట్ల ఆసక్తితో 1963 డిసెంబరు 12న క్షుళ్లక దీక్షను స్వీకరించారు. శ్రవణబెళగొళలో 1981లో భట్టారక స్వామి నేతృత్వంలో మహా మస్తకాభిషేకాలు జరిగాయి. ముఖ్య అతిథిగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరగాంధీ హాజరయ్యారు. ఆయనకు ‘కర్మయోగి’ అని బిరుదును ప్రదానం చేశారు. 1993, 2006, 2018లలోనూ మస్తకాభిషేకాలకు ఆయనే నేతృత్వం వహించారు. ఆయన 40కు పైగా జైన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయించారు. శ్రవణ బెళగొళ చుట్టుపక్కల ఉన్న 10కి పైగా గ్రామాలను దత్తత తీసుకున్నారు. విద్యా సంస్థలను మఠం తరపున నెలకొల్పారు. ప్రాకృత భాష అభివృద్ధికి బెంగళూరులో ప్రాకృత జ్ఞాన భారత ట్రస్టును ఏర్పాటు చేశారు. సంచారి ఆసుపత్రి, ఆయుర్వేదిక్‌ ఆసుపత్రి, బాలల ఆసుపత్రులను శ్రవణ బెళగొళలో నిర్మించారు. జాతీయ ప్రాకృత అధ్యయన, పరిశోధన సంస్థలలో తాళపత్రాలను రక్షించే ప్రక్రియ, కన్నడ అనువాద ప్రక్రియలను స్వామీజీ నేతృత్వంలో కొనసాగాయి. దవల, జయదవల, మహాదవల గ్రంథాల 42 సంపుటాలను కన్నడకు అనువాదం చేసి, ప్రచురించారు. జైన ధర్మ సంరక్షణ కోసం 16కు పైగా విదేశాలలో చర్చాగోష్ఠులు, సదస్సులలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని