logo

ఎత్తిపోతల పథకంతో 18 గ్రామాలు సస్యశ్యామలం

తాలూకాలోని పాపినాయకనహళ్లిలో చేపట్టిన ఎత్తిపోతల పథకంతో విజయనగర నియోజకవర్గంలోని 18 గ్రామాలు, సుమారు 44వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమవుతాయని పర్యాటకశాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు.

Published : 24 Mar 2023 04:04 IST

జ్యోతి వెలిగించి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఆనంద్‌సింగ్‌

హొసపేటె, న్యూస్‌టుడే : తాలూకాలోని పాపినాయకనహళ్లిలో చేపట్టిన ఎత్తిపోతల పథకంతో విజయనగర నియోజకవర్గంలోని 18 గ్రామాలు, సుమారు 44వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలమవుతాయని పర్యాటకశాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు. కర్ణాటక నీటిపారుదల నిగమ ఆధ్వర్యంలో పాపినాయకనహళ్లి సమీపంలో తుంగభద్ర నది నుంచి చేపట్టిన చెరువులు నింపే ఎత్తిపోతల పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తాలూకాలోని సుమారు 18 గ్రామాల బీడు భూముల రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.243కోట్లతో పాపినాయకనహళ్లి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని గుర్తు చేశారు. తుంగభద్ర నదిలో ఏటా జూన్‌ నుంచి ఆగస్టు వరకు నదిలోని నీటిని పంప్‌ల ద్వారా సుమారు 22 చెరువులు నింపుతామన్నారు. చెరువులు నింపడంతో ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు మెరుగుపడతాయన్నారు. తుంగభద్ర నదిలో పుష్కలంగా నీరు పారుతున్న సమయంలో రోజుకు కేవలం 1.6 క్యూసెక్కుల నీటిని గొట్టాల ద్వారా తరలించి చెరువులు నింపుతామన్నారు. దీని కోసం ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు పూర్తి సహకారం అందించారన్నారు. మరో సారి భాజపా ప్రభుత్వం ఏర్పడి, తాను మంత్రి అయితే 22 కాలువలు తవ్వి 22 చెరువుల ద్వారా పొలాలకు నీరు మళ్లించే ఏర్పాట్లు చేస్తానని భరోసా ఇచ్చారు. దీని కోసం మరో రూ.300 కోట్లు అవసరమన్నారు. రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసిన గుత్తేదారులకు కృతజ్ఞతలు తెలిపారు. చెరువులకు నీరుపారించే విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, వెంటనే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రిని రైతులు సత్కరించారు. కార్యక్రమంలో ఉపవిభాగం అధికారి సిద్ధరామేశ్వర, నీటిపారుదల నిగమ పర్యవేక్షక ఇంజినీరు ఎల్‌.బసవరాజ్‌, సహాయక కార్యనిర్వాహక ఇంజినీరు శివశంకర్‌, తహసీల్దార్‌ విశ్వజిత్‌ మెహతా, కమలాపుర పురసభ అధ్యక్షుడు సయ్యద్‌ అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని