logo

తుంగభద్ర జలాశయం ప్రాంతవాసులకు ఉపశమనం

తుంగభద్ర జలాశయం పరిసర ప్రాంతాల వారికి ఎట్టకేలకు మండలి ఆంక్షల నుంచి విముక్తి కలిగిందని తుంగభద్ర సంయుక్త పోరాట క్రియా సమితి ప్రధాన కార్యదర్శి టి.గోపాలకృష్ణ తెలిపారు. గు

Published : 24 Mar 2023 04:04 IST

కేంద్ర జలవనరుల శాఖ ఆదేశ ప్రతులను చూపిస్తున్న టీబీడ్యాం నగరసభ సభ్యుడు హనుమంతప్ప

హొసపేటె, న్యూస్‌టుడే : తుంగభద్ర జలాశయం పరిసర ప్రాంతాల వారికి ఎట్టకేలకు మండలి ఆంక్షల నుంచి విముక్తి కలిగిందని తుంగభద్ర సంయుక్త పోరాట క్రియా సమితి ప్రధాన కార్యదర్శి టి.గోపాలకృష్ణ తెలిపారు. గురువారం టీబీ డ్యాం నగరసభ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టీబీ డ్యాం, కమలాపుర ప్రాంతాల్లోని సుమారు 1502 ఇళ్లల్లో నివాసం ఉన్నవారు ఇన్నేళ్లు తుంగభద్ర మండలి ఆంక్షలతో నలిగిపోయారన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా, చేసేవారికి అనుమతి ఇవ్వకపోవడంతో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఆనంద్‌సింగ్‌ చొరవతో ప్రస్తుతం టీబీ డ్యాం, కమలాపుర వాసులు నివసిస్తున్న సుమారు 70.87 ఎకరాల స్థలాన్ని కర్ణాటక రెవెన్యూ శాఖకు అప్పజెప్పాలని మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కూడా తుంగభద్ర మండలికి ఉత్తరం రాసి, 70.87 ఎకరాల స్థలాన్ని కర్ణాటక రెవెన్యూశాఖకు అప్పగించాలని సూచించారు. రెవెన్యూశాఖ నుంచి, ఆ స్థలం స్థానిక నగరసభ పరిధిలోకి వెళితే, ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయటానికి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ఇన్నేళ్లు రోడ్డు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో టీబీడ్యాం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. 20 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. సమావేశంలో టీబీ డ్యాం వార్డుల నగరసభ సభ్యులు హనుమంతప్ప(బుజ్జి), శరవణన్‌, కమలాపుర సభ్యుడు ముక్తియాస్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని