logo

ఓటు శక్తితో సత్తా

రాష్ట్రంలో భాజపాకు సంపూర్ణ మెజార్జీ ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత్‌ బలోపేతమైన ప్రజా ప్రభుత్వ దేశమని ప్రపంచానికి చాటాలంటే ఓటు శక్తిని సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Published : 26 Mar 2023 03:35 IST

కన్నడనాట విజయమే లక్ష్యం
భాజపా శ్రేణులకు మోదీ పిలుపు

దావణగెరె సభలో నరేంద్రమోదీకి వెండిగద బహుమతిగా అందిస్తున్న బసవరాజ బొమ్మై

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలో భాజపాకు సంపూర్ణ మెజార్జీ ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత్‌ బలోపేతమైన ప్రజా ప్రభుత్వ దేశమని ప్రపంచానికి చాటాలంటే ఓటు శక్తిని సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన శనివారం బెంగళూరు, చిక్కబళ్లాపుర, దావణగెరెల్లో పర్యటించారు. బెంగళూరు నగర ప్రజలకు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించే కొత్త మెట్రో లైను, చిక్కబళ్లాపురలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే శ్రీమధుసూదన్‌ సాయి వైద్య, పరిశోధన సంస్థ, దావణగెరెలో భాజపా విజయ సంకల్ప యాత్ర ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో భారత్‌ సాధించిన ప్రగతి ప్రపంచ దేశాలను నివ్వెర పరుస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం భారత్‌ వైపు చూస్తుంటే.. భారత్‌ కర్ణాటక వైపు చూస్తోందన్నారు.

* దావణగెరెలో నిర్వహించిన సమావేశం విజయ సంకల్ప యాత్ర ముగింపు సమావేశం కాదని.. ఎన్నికల్లో భాజపా సాధించే విజయానికి సంకేతమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే కలబురగి కార్పొరేషన్‌కు మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికలు నిర్వహించగా భాజపా ఆ స్థానాలు దక్కించుకుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత క్షేత్రంలో భాజపా సాధించిన విజయం రానున్న ఎన్నికల్లో విజయానికి సంకేతమన్నారు. రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా భాజపా సుస్థిరమైన పాలన అందించిందన్నారు. అంతకు ముందు సంకీర్ణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే స్థిరమైన ప్రభుత్వం లాభాలేమిటో, డబల్‌ ఇంజిన్‌ సర్కారు ప్రయోజనం ఏమిటో తెలిసొచ్చిందని వివరించారు. మోదీ మీకు మరిన్ని సేవలందించాలంటే వచ్చే ఎన్నికల్లో భాజపాకు సంపూర్ణ మెజార్జీ అందించాలన్నారు.

వారితో సంక్షేమమా?

‘ఇటీవల మాజీ ముఖ్యమంత్రి ఒకరు కాంగ్రెస్‌ కార్యకర్తపై చేయి చేసుకుని సంబరపడిపోతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో చూశా. కార్యకర్తలను అభిమానంతో చూడలేని వారు ప్రజలకు ఎలా సేవ చేయగలరు?’ అని ప్రధాని మోదీ పరోక్షంగా సిద్ధరామయ్యను విమర్శించారు. ‘కార్యకర్తలు నాకు సోదరులతో సమానం. నేనెంతో- పార్టీలో కార్యకర్త కూడా అంతే. కార్యకర్తలకు భాజపాలో ఉన్న గౌరవం మరే పార్టీలోనే దక్కదు. రాష్ట్ర ప్రజలు ఎలాంటి పార్టీని ఎన్నుకోవాలో పోలింగ్‌ బూత్‌లో సంకల్పం చేయాలి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వ ఫలితంగా రాష్ట్రంలో 50 వేల మంది నర్సులకు శిక్షణ, పాలు, పశు పోషకులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, 40 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు, 70 లక్షల కుటుంబాలకు జల్‌జీవన్‌ ద్వారా తాగునీరు, శివమొగ్గ విమానాశ్రయం, అప్పర్‌ భద్రకు రూ.5,300 కోట్ల నిధుల వంటి పనులు అందరి సహకారంతోనే (సబ్‌కా ప్రయాస్‌) సాధ్యమైందన్నారు. అందరి సహకారంతో భారత్‌ ప్రపంచ దేశాల్లో సత్తా చాటుతోందన్నారు. ఏప్రిల్‌లో పర్యాటక క్షేత్ర అభివృద్ధి కార్యక్రమం కోసం మళ్లీ కర్ణాటకకు వస్తానని ప్రధాని ప్రకటించారు.

పాక్‌లోనూ అభిమానులు..

పాకిస్థాన్‌, చైనా, అమెరికా దేశాల్లోనూ నరేంద్ర మోదీని అనుసరించే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విదేశాల్లో భారత్‌ను అవమాన పరిచేలా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ఇది దేశద్రోహ చర్యగా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశం, ప్రజల పట్ల గౌరవం లేదన్నారు. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం సాధించే ప్రగతిని చూసి ఓర్వలేకనే విమర్శలకు దిగుతోందని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో దేశం అమృత కాలంలో మరింత వెలుగొందుతోందన్నారు. కిసాన్‌ సమ్మాన్‌, విద్యానిధి, జల్‌జీవన్‌ మిషన్‌, రైల్వే, హైవే, నీటిపారుదల పథకాలతో రాష్ట్రం చరిత్రలో లిఖించే ప్రగతిని నమోదు చేసుకుందన్నారు.

* మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప మాట్లాడుతూ మోదీ సర్కారు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రతిపక్షంలో నేతలకు పోటీ చేసేందుకు నియోజకవర్గాల కోసం వెతుకులాట.. వారి పతనానికి నిదర్శనమన్నారు. ‘నాకు 80 ఏళ్లు దాటాయి. నేను భాజపాను మరోమారు అధికారంలోనికి తెచ్చేంత వరకు విశ్రమించను. ప్రతి ఇంటా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసి ఘన విజయం సాధించేందుకు కృషి చేస్తా’నన్నారు.

విజయానికి సంకేతం

దావణగెరె, న్యూస్‌టుడే : దావణగెరెలో నిర్వహించిన మహాసంగమ సమావేశం విజయవంతం కావడంతో భాజపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సమావేశాలు భాజపా భవిష్యత్తులో దక్కించుకునే దిగ్విజయానికి సంకేతమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, పార్టీ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ తదితరులతో కలిసి దావణగెరెలో శనివారం నిర్వహించిన విజయసంకల్ప యాత్ర ముగింపు సమావేశం ‘మహాసంగమ’లో ఆయన మాట్లాడారు. అన్ని చోట్లా భాజపాకు భారీ మెజార్టీ అందించాలని ప్రజలను కోరారు. ప్రపంచంలో శ్రీమంత దేశంగా ఉన్న అమెరికా కన్నా భారతదేశంలోని కొవిడ్‌ నియంత్రణ ఉత్తమంగా కొనసాగిందని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆర్థిక సంక్షోభం ఎదురు కాకుండా ప్రధాని తీసుకున్న చర్యలను ప్రపంచ దేశాధినేతలు ప్రశంసించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి, భారతదేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వంకన్నా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కర్ణాటకకు ఐదు రెట్లు ఎక్కువ నిధులు విడుదల చేసిందని తెలిపారు. రూ.64 వేల కోట్ల ఖర్చుతో ఆరు వేల కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తయిందన్నారు. ఇక్కడి రైల్వేకు ఇప్పటికే రూ.7351 కోట్లు, ఎగువ భద్ర పథకానికి రూ.5300 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిన విషయాన్ని ప్రస్తావించారు. కళసా- బండూరి నీటి పథకం పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మోదీ భగీరథ ప్రయత్నాలతోనే జలజీవన్‌ మిషన్‌ పథకం సాకారమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాధనలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, కొత్తగా ప్రకటించిన పథకాలను సీఎం వివరించారు. పార్టీ నాయకులు భైరతి బసవరాజు, జీఎం సిద్ధేశ్వర్‌, ఈశ్వరప్ప, గోవింద కారజోళ, జగదీశ్‌ శెట్టర్‌, బి.శ్రీరాములు, సదానందగౌడ, ప్రహ్లాద్‌ జోషి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ర్యాలీకి అడ్డుపడిన వ్యక్తి

దావణగెరె హెలిప్యాడ్‌ నుంచి మోదీ మైదానం వైపు ర్యాలీగా వస్తున్న సమయంలో ఒక వ్యక్తి రహదారికి అడ్డుగా వచ్చేందుకు ప్రయత్నించాడు. తక్షణమే అప్రమత్తమైన ఏడీజీపీ అలోక్‌ కుమార్‌, భద్రత సిబ్బంది, ఎస్‌పీజీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అడ్డుగా వచ్చిన వ్యక్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఇది భద్రతా లోపం కాదని అలోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

‘చిక్క’లో వైద్యకళాశాల ప్రారంభించిన మోదీకి జ్ఞాపిక అందజేత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని