logo

దళపతుల మహాసభకు సన్నాహాలు

జనతాదళ్‌ నేతృత్వంలో పంచరత్న రథయాత్ర ముగింపు సమావేశాలకు రాచనగరి ముస్తాబవుతోంది. చాముండి బెట్ట సానువులలో వంద ఎకరాలలో ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.

Published : 26 Mar 2023 03:35 IST

మైసూరులో మైదానం వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న కుమార తదితరులు

మైసూరు : జనతాదళ్‌ నేతృత్వంలో పంచరత్న రథయాత్ర ముగింపు సమావేశాలకు రాచనగరి ముస్తాబవుతోంది. చాముండి బెట్ట సానువులలో వంద ఎకరాలలో ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ పాల్గొనే ఈ సమావేశాలకు కనీసం పది లక్షల మంది హాజరవుతారని దళపతుల అంచనా. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. వలయ వర్తుల రహదారి నుంచి మైదానం వరకు నిర్వహించే రోడ్‌షోలో దేవేగౌడ, సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్యేలు, పార్టీ ఇప్పటికే ప్రకటించిన వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొంటారని కుమార ప్రకటించారు. మైదానంలో ఆసనాల వ్యవస్థ, భోజనాలు, తాగునీటి సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తున్నారు. ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదిక నిర్మించారు. మైదానంలో, చుట్టుపక్కల ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఎటువంటి లోపాలు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

అదో పెద్ద నాటకం

మంత్రివర్గ సమావేశంలో శుక్రవారం తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని కుమారస్వామి దుయ్యబట్టారు. రిజర్వేషన్లను కల్పిస్తామని అణగారిన వర్గాలకు ఆశపెట్టేందుకే మంత్రివర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తప్పుపట్టారు. వారు చేసిన పాపాలు ఇప్పుడు భాజపాను వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు, ప్రతి చోటా హడావిడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు అనే చదరంగంలో భాజపా వెర్రి గుర్రంపై సవారీ చేస్తోందని ఎద్దేవా చేశారు. క్రూరమైన పులిపై కూర్చుని సవారీ, గుడ్డిగా సర్కస్‌ చేస్తున్న నాయకులు తగిన ఫలితాన్ని త్వరలో అనుభవిస్తారని హెచ్చరించారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలను శాశ్వతంగా సమాధి చేసేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారని వరుస ట్వీట్లలో కుమారస్వామి దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని