logo

ముప్పేటా.. మోదీ బావుటా!

కన్నడనాట మూడు ప్రధాన ప్రాంతాలను ఏకకాలంలో చుట్టేసి.. సత్తా చాటే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ: విధానసభ ఎన్నికల తేదీ ప్రకటించేందుకు ముందుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు, పూర్తయిన పనులను ప్రారంభించేందుకు విచ్చేసిన వేళ.. పార్టీ నేతలు, కార్యకర్తలు సందడి చేశారు.

Published : 26 Mar 2023 03:35 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కన్నడనాట మూడు ప్రధాన ప్రాంతాలను ఏకకాలంలో చుట్టేసి.. సత్తా చాటే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ: విధానసభ ఎన్నికల తేదీ ప్రకటించేందుకు ముందుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు, పూర్తయిన పనులను ప్రారంభించేందుకు విచ్చేసిన వేళ.. పార్టీ నేతలు, కార్యకర్తలు సందడి చేశారు. బెంగళూరు హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బొమ్మై, మంత్రి సోమణ్ణ, మాజీ మంత్రి ఎస్‌.సురేశ్‌ కుమార్‌ తదితరులు ఉదయమే మోదీకి స్వాగతం పలికారు. చిక్కబళ్లాపుర జిల్లా ముద్దేనహళ్లి సమీపంలోని సత్యసాయిగామ్‌ వద్ద రూ400 కోట్లతో నిర్మించిన శ్రీమధుసూదన్‌ సాయి వైద్య విజ్ఞాన, పరిశోధన సంస్థను ప్రారంభించారు. ఇటువంటి పుణ్యభూమికి రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కర్ణాటకలోనూ చురుకుగా కొనసాగుతోందని చెప్పారు. అక్కడి నుంచి సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మ స్థలం, సమాధి, నివాసాలను మోదీ సందర్శించారు. చిక్కబళ్లాపుర నుంచి తిరిగి బెంగళూరు చేరుకుని కేఆర్‌పుర- వైట్ఫీల్డ్‌ మధ్య రైలు మార్గాన్ని ప్రారంభించిన వేళ.. వివిధ వర్గాల వారితో మాట్లాడేందుకు ప్రాధాన్యమిచ్చారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సూచనలను ఆలకించారు.

* దావణగెరెలో మోదీనగర సమీపంలోని జీఎంఐటీ కళాశాల సమావేశం మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర ‘మహాసంగమ’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కర్ణాటకలో పూర్తి మెజార్టీతో భాజపాకు మరోసారి అధికారాన్ని ఇవ్వాలని అక్కడి ప్రజలను కోరి.. వారి నుంచి స్పందన ఆహ్వానించిన వేళ చప్పట్లు మార్మోగాయి. ప్రధానికి ముఖ్యమంత్రి బొమ్మై వెండి గదను బహూకరించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ముఖ్యమంత్రి బొమ్మై, పార్టీ నాయకులు శ్రీరాములు, శెట్టర్‌, ప్రహ్లాద్‌ జోషి, సదానందగౌడ, ఈశ్వరప్ప, నళిన్‌ కుమార్‌ కటీల్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొని.. శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు శ్రమించారు.

అగ్రస్థానం.. మన లక్ష్యం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : రానున్న 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి సామాజిక, ధార్మిక సంస్థల సేవలు మహోన్నతమైనవని చెప్పారు. చిక్కబళ్లాపుర సమీపంలో నిర్మించిన శ్రీ మధుసూదన్‌ సాయి వైద్య విజ్ఞాన, పరిశోధన సంస్థ (వైద్య కళాశాల)ను శనివారం ప్రారంభించాక ఆయన ఈ విషయంపై మాట్లాడారు. ‘కర్ణాటకద నన్న ఎల్ల సహోదర, సహోదరియరిగె నమస్కార’ అంటూ కన్నడలో తన ప్రసంగాన్ని ప్రారంభించి.. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

మోదీ.. ఓ విశ్వగురువు

ప్రధాని మోదీ విశ్వ గురువు అని ముఖ్యమంత్రి బొమ్మై ప్రస్తుతించారు. ఆయన పాలనలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి సాధ్యమైందని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ వైద్య కళాశాలలో వంద మంది విద్యార్థులకు ఉచితంగా చదువుకునేందుకు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. వైద్య విద్య పూర్తయిన తర్వాత ఐదేళ్ల పాటు వారు ఇక్కడి ఆసుపత్రిలో పని చేయాలని సూచించారు. ఏడాదిలోగా వైద్య కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్న మంత్రి సుధాకర్‌ను ప్రశంసించారు. కార్యక్రమం అనంతరం ముద్దేనహళ్లిలోని విశ్వేశ్వరయ్య సమాధిని మోదీ, బొమ్మై సందర్శించారు. కార్యక్రమంలో సంస్థ సద్గురు మధుసూదన సాయి, సంస్థ ప్రతినిధి బీఎన్‌ నరసింహమూర్తి, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని