logo

కన్నడనాట కాషాయపతాక రెపరెపలాడిస్తాం

కర్ణాటక సమగ్రాభివృద్ధికి విధానసభ ఎన్నికల్లో భాజపాకు పూర్తి ఆధిక్యతను కట్టబెట్టాలని కేంద్ర హోం శాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘2018 ఎన్నికల్లో భాజపాకు 104 సీట్లు ఇచ్చి అస్పష్టతమైన తీర్పు ఇచ్చారు.

Updated : 27 Mar 2023 06:38 IST

గత ఎన్నికల తీర్పును పునరావృతం కానీయొద్దు
కేంద్ర మంత్రి అమిత్‌ షా

రిమోట్‌ నొక్కి అభివృద్ధి పనులను  ప్రారంభిస్తున్న హోం మంత్రి

రాయచూరు, న్యూస్‌టుడే: కర్ణాటక సమగ్రాభివృద్ధికి విధానసభ ఎన్నికల్లో భాజపాకు పూర్తి ఆధిక్యతను కట్టబెట్టాలని కేంద్ర హోం శాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘2018 ఎన్నికల్లో భాజపాకు 104 సీట్లు ఇచ్చి అస్పష్టతమైన తీర్పు ఇచ్చారు. 30 సీట్లలోపు ఉన్న దళ్‌తో కలిసి కాంగ్రెస్‌ అధికారాన్ని చేపట్టింది. సంకీర్ణ పాలన ఎలా కొనసాగిందో ప్రజలకు ఎరుకే. ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్థితిని పునారవృతం చేయవద్దని’ కోరారు. అమిత్‌ షా ఆదివారం జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరులో దేవదుర్గ, రాయచూరు నియోజకవర్గాలకు సంబంధించి రూ.4,223.02 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రిమోట్‌ ద్వారా శంకుస్థానలు చేశారు. అనంతరం హోం శాఖ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అవినీతికి పాల్పడుతోంది. ప్రజలు అప్పగించే అధికారాన్ని ఏటీఎంగా వాడుకుని, ఆ డబ్బును దిల్లీకి పంపుతోందని ఆరోపించారు. ప్రజలు ఆ పార్టీ వాగ్దానాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ ప్రజలకు ఏమి చేయదన్నారు. రాహుల్‌ గాంధీనే ఆ పార్టీని అంతం చేస్తారని జోస్యం చెప్పారు. ఇదే నెలలో వెలువడిన మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క చోట ఐదు సీట్లను కాంగ్రెస్‌ గెలవకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో పాక్‌ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి తరచూ వస్తూ అలజడి సృష్టించే వారని, మోదీ ప్రధాని అయ్యాక ఉగ్రవాదుల ఆటకట్టించిన విషయం దేశ ప్రజలకు తెలుసన్నారు. 2019లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి పొరుగుదేశం మెడలు వంచడంతో భారత్‌ వైపు చూడాలంటే దడ పుట్టే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. భారత్‌ సురక్షితంగా, సుభద్రంగా ఉండాలంటే మోదీ పాలన ఈ దేశానికి అవసరమన్నారు.
కరోనా సమయంలో 130 కోట్ల ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వడం మోదీ ప్రభుత్వం ఘనతగా పేర్కొన్నారు. 80 కోట్ల మంది పేదలకు గరీబ్‌ కల్యాణ పథకంలో బియ్యం పంపిణీ, అత్యధికంగా మరుగుదొడ్ల నిర్మాణం, పేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడం కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని వివరించారు. ప్రపంచంలో భారత్‌ ఐదో ఆర్థిక దేశంగా ఎదగటానికి, అంకుర పరిశ్రమల స్థాపనలో అగ్రస్థానంలో ఉండేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. దేశం అయిదు బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మోదీ వల్లనే అవుతుందన్నారు.

వీఐపీ గ్యాలరీలో పార్టీ నాయకులు

కర్ణాటకకు ఎంతో చేశాం

అప్పర్‌ భద్రా ప్రాజెక్టు విస్తరణకు, ఎగువ కృష్ణాలో కాలువల నిర్మాణాలకు కేంద్రం అత్యధికంగా నిధులు ఇచ్చిందని తెలిపారు.మహదాయి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించామని చెప్పారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేయడం, వక్కలిగులు, పంచమశాలిలకు రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని, దళిత వర్గీకరణ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసి సీఎం బొమ్మై చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు కల్యాణ కర్ణాటక మండలికి రూ.5 వేలకోట్లు కేటాయించడంతోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఊపందుకుందన్నారు. గిణిగేరా-మహబూబ్‌నగర్‌ రైల్వే మార్గం పనులు, రాయచూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం నిధులను విడుదల చేసిందని వివరించారు. ఈ జిల్లాలో ప్రగతి పనులు మరింత వేగంగా జరగాలంటే ఏడు నియోజవర్గాల్లో భాజపాను గెలిపించాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.

సభకు హాజరైన ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని