logo

కన్నడ గడ్డపై మోగిన ఎన్నికల నగారా

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల తేదీలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి. బుధవారం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Published : 30 Mar 2023 01:33 IST

మే 10న పోలింగ్‌..13న ఫలితాలు
గెలుపుపై ఎవరి ధీమా వారిదే

కర్ణాటక పటాన్ని ప్రదర్శిస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్‌ కుమార్‌ మీనా

ఈనాడు, బెంగళూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల తేదీలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి. బుధవారం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటి వరకు అడపాదడపా ప్రచారంలో ఉన్న పార్టీలన్నీ మరింత చురుకుగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవటంతో కర్ణాటకలో ఒకే విడత ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధరించింది. ఈ కారణంగా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఎన్నికల నియామవళి బుధవారం నుంచి అమలు కావటంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి.


ఒకే విడత పోలింగ్‌తో వెసులుబాటు

ఒకే విడత ఎన్నికల నిర్వహణపై సర్వత్రా భిన్న స్వరాలు వినిపించాయి. రెండు వారాల క్రితం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ బృందం కర్ణాటకలో పర్యటించిన సందర్భంగా పోలింగ్‌ నిర్వహణలపై పలు ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఒకే విడత ఎన్నికలు నిర్వహించాలని మనవి చేసింది. ఎన్నికల నిర్వహణలో ఒకే విడత ఎన్నికల ప్రక్రియ భద్రతకు సంబంధించిన వ్యవహారమని ఇందులో పార్టీలకు సానుకూల, ప్రతికూలత ప్రశ్న ఉద్భవించదని బెంగళూరు విశ్వవిద్యాయానికి చెందిన రాజకీయ విశ్లేషకులు డా.రమణకాంత్‌ చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఈవీఎంలు, పోలీసు బలగాల ఏర్పాటు సమస్య తలెత్తుతుంది. ఈ కారణంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎలాంటి అక్రమాలకు అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార, విపక్షాలకు సంబంధించిన ఏ నేత అయినా పోలింగ్‌ నిర్వహించే నియోజకవర్గ పరిధి దాటి వెళ్లేందుకు వీలులేదు. ఈ కారణంగా అక్రమాలకు చోటు ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు.


స్వాగతించిన కాంగ్రెస్‌

ఒకే విడత ఎన్నికల నిర్వహణపై విపక్ష కాంగ్రెస్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. రెండు విడతల ఎన్నికల ద్వారా కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రణాళికలను మార్చుకునే వీలుందని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఉగ్రప్ప విశ్లేషించారు. 1985లో నిర్వహించిన ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌లో తమ పార్టీకి సరైన స్పందన రాలేదన్న సమీక్షతో అప్పటి ముఖ్యమంత్రి ఉన్నఫళంగా ఎన్నికల ప్రణాళికను మార్చి రెండు కిలోల బియ్యం వంటి పథకాలు ప్రకటించారు. ఆ కారణంగా ఆ పార్టీ 139 స్థానాలు గెలుచుకుని అధికారంలోనికి వచ్చినట్లు ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం కూడా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించిన ఆయన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించారు.


పర్యటనను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి

బెంగళూరు (శివాజీనగర): కర్ణాటక విధానసభకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికల తేదీని, నియమావళిని ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి బవసరాజ బొమ్మై బుధవారం చేపట్టవలసిన ధార్వాడ, కొప్పళ, హావేరి జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఆ జిల్లాల్లో ప్రకటించవలసిన పథకాలు, శంకుస్థాపన చేయవలసిన ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి. మరో వైపు విధానసౌధలోని మంత్రుల కార్యాలయాలకు అధికారులు తాళాలు వేయించారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు ఆ కార్యాలయాలలో ఉన్న తమ వ్యక్తిగత వస్తువులు, పరికరాలను తమతో తీసుకెళ్లారు.


పీఠం మళ్లీ మాదే

- ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

మే 13న ఫలితాల్లో మా విజయం తథ్యమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. బలీయమైన పార్టీ కార్యవర్గం ఉన్న భాజపా మే 10న నిర్వహించే ఎన్నికల కోసం సిద్ధంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రానికి వచ్చిన నిధులు, రైతులు, మహిళలు, యువకులు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన సదుపాయాలు మాకే సానుకూలత సృష్టించాయి. విపక్షం మాపై చేసే ఆరోపణలు వారికి ఓట్లు రాల్చలేవు. వారి సంప్రదాయ ఓట్లన్నీ పట్టుతప్పి పోయాయి. ఆ పార్టీ గ్యారెంటీ జిమ్మిక్కులతో ప్రజలను మోసగిస్తోంది.


కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

-మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమైంది. భాజపా ఓటమి భయం ఉందనే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులంతా పదే పదే రాష్ట్రానికి వస్తున్నారు. వారి ప్రలోభాలకు ప్రజలు లొంగిపోరు. త్వరలో రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు.


123 స్థానాలు సాధిస్తాం

-హెచ్‌.డి.కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి

జేడీఎస్‌ 123 స్థానాల్లో గెలుపు సాధిస్తుంది. ఈ మేరకు పార్టీ అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. జాతీయ పార్టీలు రెండూ ప్రజలకు అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చాయి. అయినా ప్రజలు వాటిని విశ్వసించరు. ఎన్నికల సంఘం అన్ని చోట్లా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఇది మంచి పరిణామం. ఇదే క్రమంలో ఈవీఎంల అక్రమాలపై వచ్చే సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని