logo

కోలారులో రాహుల్‌ రణభేరీ

ఎంపీగా బహిష్కరణ వేటు, రెండేళ్ల జైలు శిక్ష తీర్పు వంటి వివాదాస్పద సంఘటనల తర్వాత ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు.

Published : 30 Mar 2023 01:33 IST

నిరసన ప్రదర్శన చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

ఈనాడు, బెంగళూరు: ఎంపీగా బహిష్కరణ వేటు, రెండేళ్ల జైలు శిక్ష తీర్పు వంటి వివాదాస్పద సంఘటనల తర్వాత ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇటీవల బెళగావిలో పర్యటించిన రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినా..ఆ మరుసటి రోజే ప్రధానిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగా ఊహించని పరిణామాలను ఎదుర్కొన్నారు. రాహుల్‌పై వేటును నిరసిస్తూ ఏప్రిల్‌ 5న కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ, నిరసన ర్యాలీలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.


వివాద స్థలిలోనే సభ

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలారుకు వచ్చిన రాహుల్‌ గాంధీ ‘మోదీ’ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావా కేసు విచారణలో రాహుల్‌ గాంధీ ఎంపీ పదవిని త్యజించాల్సి వచ్చింది. ఇది ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు అని రాష్ట్ర కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇప్పటికే బెంగళూరు, ఇతర జిల్లాల్లో పార్టీ నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 5న కోలారులో భారీ ర్యాలీని నిర్వహించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఆ సమావేశంలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార సమితి వెల్లడించింది. తనపై కఠిన చర్యలకు వేదికగా మారిన కోలారులోనే ఆ వివాదంపై వివరణ ఇస్తూ భాజపాకు సమాధానం ఇచ్చేందుకు రాహుల్‌గాంధీ సిద్ధమవుతున్నారు. సత్యాగ్రహ పేరిట నిర్వహించే ఈ ర్యాలీ, బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు కూడా పాల్గొంటారు.


సత్యమేవ జయతే

తార ప్రచారకులు, జాతీయ నేతల రాక కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీపై వేటు ఎదురు దెబ్బే. ఆ సంఘటనను సానుకూలంగా మార్చుకునేందుకు పార్టీ యత్నిస్తోంది. విపక్షాలపై అధికార పక్షం వేధింపులను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని ఏఐసీసీ రాష్ట్ర నేతలకు సూచించింది. సత్యమేవ జయతే పేరిట కోలారులో నిర్వహించే ర్యాలీలో భాజపా అవినీతి భాగోతాన్ని తిరగదోయడం, ఆ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్‌, ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకత అంశాలను ఈ ర్యాలీలో మరింత విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. కీలక నేత రాకకోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌కు రాష్ట్ర నేతల ప్రతి విమర్శలే ప్రధాన ప్రచార బలం కానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు..రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీకి మరింత బలాన్ని అందిస్తుంది. వేళ్లపై లెక్కించే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు దక్షిణాదిలో కర్ణాటక ఆయువు పట్టు. అధికార పక్షంలో ఉన్న నాయకత్వ లోపాలను సద్వినియోగం చేసుకుని ఈ ఎన్నికల్లో గెలుపు సాధించాలని, ఎవరితో పొత్తు అవసరం లేకుండా అధికారంలో రాగలిగితే జాతీయ స్థాయిలో భాజపాపై వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించాలని యోచిస్తోంది.


కాంగ్రెస్‌ నిరసన

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం రేస్‌కోర్స్‌ రోడ్డులో ఉన్న కాంగ్రెస్‌ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నల్లరిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. భాజపా పాలకులు ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేతల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడిందని, దాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు