logo

బళ్లారి నగర పాలికె పీఠంపై త్రివేణి

బళ్లారి నగర పాలికె 21వ మేయర్‌గా డి.త్రివేణి, ఉప మేయర్‌గా బి.జానకీ ఎన్నికయ్యారని కలబురిగి ప్రాదేశిక కమిషనర్‌ కృష్ణబాజపేయి బుధవారం ప్రకటించారు.

Updated : 30 Mar 2023 06:35 IST

24వ మేయర్‌గా ఎన్నిక
ఉపమేయర్‌గా బి.జానకీ ఏకగ్రీవం

ఎన్నికల్లో పాల్గొన్న శాసనసభ్యులు

బళ్లారి, న్యూస్‌టుడే : బళ్లారి నగర పాలికె 21వ మేయర్‌గా డి.త్రివేణి, ఉప మేయర్‌గా బి.జానకీ ఎన్నికయ్యారని కలబురిగి ప్రాదేశిక కమిషనర్‌ కృష్ణబాజపేయి బుధవారం ప్రకటించారు. బళ్లారి నగర పాలికె మొదటి విడత (20వ అవధి) 2022 మార్చి 18న జరిగిన మేయర్‌ ఎన్నికల్లో మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, ఉపమేయర్‌గా మాలన్‌బీ ఎన్నికైన విషయం తెలిసిందే. వారి పదవీ కాలం ఈ నెల 18న ముగిసింది. 21న మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఇదివరకే ప్రాదేశిక కమిషనర్‌ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌కు ఎన్నికల ప్రకటన అందక పోవడంతో ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. మేయర్‌గా ఎస్సీ జనరల్‌, ఉపమేయర్‌గా ఎస్టీ మహిళ రిజర్వేషన్‌ కాగా, మేయర్‌కు 4వ వార్డు కార్పొరేటర్‌ డి.త్రివేణి, 7వ వార్డు కార్పొరేటర్‌ ఉమాదేవి శివరాజు, 38వ వార్డు కార్పొరేటర్‌ వి.కుబేరా కాంగ్రెస్‌ పార్టీ నుంచి నామపత్రాలు సమర్పించారు. భాజపా నుంచి నాగరత్నప్రసాద్‌ నామపత్రాలు ఉదయం 10.30లకు నగర పాలికె కమిషనర్‌ రుద్రేశ్‌కు సమర్పించారు. ఉపమేయర్‌ 33వ వార్డు కార్పొరేటర్‌ బి.జానకీలు నామపత్రం సమర్పించారు. మధ్యాహ్నం 12గంటలకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి నామపత్రాలు సమర్పించిన ఉమాదేవి శివరాజు, వి.కుబేరా వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి డి.త్రివేణి, భాజపా నుంచి 16వ వార్డు నాగరత్నలు పోటీలో నిలిచారు. 39 మంది కార్పొరేటర్లు, రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్‌ నాసీర్‌ హుసేన్‌, లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, శాసనసభ్యులు గాలి సోమశేఖర్‌రెడ్డి, బి.నాగేంద్ర  ఎన్నికల్లో పాల్గొన్నారు.

డి.త్రివేణి,  బి.జానకీ


28 కార్పొరేటర్ల మద్దతు

కార్పొరేటర్లలో 44 మందికి గాను....కాంగ్రెస్‌ అభ్యర్థి డి.త్రివేణికి 28, భాజపా అభ్యర్థి నాగరత్నకి 16 ఓట్లు పడ్డాయి. పరిశీలించిన కలబురిగి ప్రాదేశిక కమిషనర్‌ కృష్ణ బాజపేయి మేయర్‌గా డి.త్రివేణి ఎన్నికైనట్లు ప్రకటించారు. ఉపమేయర్‌గా కాంగ్రెస్‌ పార్టీ బి.జానకీ మాత్రమే నామపత్రం సమర్పించగా, ఆమె  ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.


ఎన్నికపై సుదీర్ఘ చర్చలు

బళ్లారి నగర మేయర్‌, ఉపమేయర్‌గా రెండు రోజులుగా సుదీర్ఘంగా చర్చించారు. మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నిక కమిటీ సభ్యులు మాజీ లోక్‌సభ సభ్యుడు చంద్రయ్య, రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్‌ నాసీర్‌ హుసేన్‌, గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీక్‌, ఏఐసీసీ సభ్యుడు అల్లం వీరభద్రప్ప, మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి మంగళవారం రాత్రి పొద్దు పోయే వరకు కార్పొరేటర్లతో చర్చించారు. 16 మంది కార్పొరేటర్లు 4వ వార్డు కార్పొరేటర్‌ డి.త్రివేణికి మద్దతు ప్రకటించారు. మిగిలిన కార్పొరేటర్లు వి.కుబేరా, శిల్పలకు మద్దతు ప్రకటించారు. దీనిపై కమిటీ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం ఉదయం 9గంటలకు మరోసారి నక్షత్ర హోటల్‌లో సమావేశం నిర్వహించి కార్పొరేటర్లు అభిప్రాయాలు తీసుకున్నారు. చివరికి మేయర్‌ అభ్యర్థిగా డి.త్రివేణి, ఉపమేయర్‌ అభ్యర్థిగా బి.జానకీలు పేర్లు ప్రకటించారు. మేయర్‌ పోటీలో ఉన్న వి.కుబేరా, ఉమాదేవి శివరాజు కూడా నామపత్రాలు సమర్పించారు. చివరికి వారు నామపత్రాలు వెనక్కి తీసుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.


* ఒకే ఇంటి నుంచి ఇద్దరు మేయర్లు : బళ్లారి నగర పాలికెలో ఒకే ఇంటి నుంచి గతంలో తల్లి సుశీలబాయి, ప్రస్తుతం కుమార్తె త్రివేణి మేయర్‌ కావడంతో పాటు అతిచిన్న వయస్సు 23 ఏళ్లకే డి.త్రివేణి మేయర్‌గా ఎంపికై నగర పాలికెలో రికార్డు సృష్టించారు.


నగరాభివృద్ధికి పాటుపడతా : త్రివేణి

అతి చిన్న వయస్సులో మేయర్‌గా ఎంపిక కావడంతో సంతోషంగా ఉంది. 2018-19లో మా అమ్మ సుశీలబాయి మేయర్‌గా పని చేశారు. 2022-23 ఏడాదికి నేను మేయర్‌గా ఎంపికయ్యాను. నేను కలలో కూడా అనుకోలేదు. మా తండ్రి సూరికి నన్ను మేయర్‌ చేయాలని కల ఉండేది. ఇప్పుడు ఆ కల నేరవేరింది. కార్పొరేటర్ల సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికకు హాజరైన లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్‌ నాసీర్‌ హుసేన్‌, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్‌, ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్‌రెడ్డి, బి.నాగేంద్ర, కాంగ్రెస్‌, భాజపా కార్పొరేటర్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని