logo

ప్రైవేటు ఫీజుల పెంపు

రానున్న విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలూ 30-40 శాతం ఫీజులు పెంచేశాయి. ఫీజుల నియంత్రణ అధికారం తమ చేతిలో లేదని విద్యాశాఖ కమిషనర్‌ ఆర్‌.విశాల్‌ చేతులెత్తేశారు.

Published : 31 Mar 2023 02:54 IST

బెంగళూరు (శివాజీనగర) : రానున్న విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలూ 30-40 శాతం ఫీజులు పెంచేశాయి. ఫీజుల నియంత్రణ అధికారం తమ చేతిలో లేదని విద్యాశాఖ కమిషనర్‌ ఆర్‌.విశాల్‌ చేతులెత్తేశారు. వీటి నియంత్రణకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో ఒక అర్జీని దాఖలు చేసి, న్యాయపోరాటం ద్వారా విద్యార్థులకు న్యాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజానికి వాటి నియంత్రణ ప్రభుత్వం పని కాదని, ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన సదుపాయాలను కల్పించి, ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునేలా చేయాలని ఈ ఏడాది జనవరి 5న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెంపు, జీవన శైలి ప్రమాణాల పెంపుతో ఫీజుల పెంపు అనివార్యమైందని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని 15 శాతం వరకు పెంచుకోవాలని సంఘం సూచించినా, పలు విద్యా సంస్థలు 30-40 శాతం వరకు పెంచాయి. నగరంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసేందుకు సగటున రూ.1.75 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. పేరున్న ప్రైవేటు విద్యా సంస్థలు గత విద్యా సంవత్సరం రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల ఫీజు వసూలు చేస్తుండగా, ఇతర విద్యా సంస్థలు ఏటా రూ.60 వేలు వసూలు చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఫీజును 30 నుంచి 40 శాతం వరకు పెంచితే, దాన్ని అడ్డుకునేందుకు సంఘం తరఫున చర్యలు తీసుకుంటామని ప్రైవేటు పాఠశాలల సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి.శివకుమార్‌ తెలిపారు. అన్ని సదుపాయాలూ ఉన్న విద్యా సంస్థ గరిష్ఠంగా ఏడాదికి రూ.98 వేల ఫీజు మాత్రమే వసూలు చేయాలన్న నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్కువ గుంజే వారిపై తాము పోరాటాన్ని చేస్తామని వాయిస్‌ ఆఫ్‌ పేరెంట్్స అసోసియేషన్‌ కార్యదర్శి సిజో సెబాస్టియన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని