logo

కొప్పళ జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధం

కొప్పళ జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సకల సన్నాహాలు చేసినట్లు  పాలధికారి సుందరేశ్‌బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated : 31 Mar 2023 05:33 IST

కొప్పళ మాట్లాడుతున్న పాలనాధికారి సుందరేశ్‌బాబు

గంగావతి,న్యూస్‌టుడే: కొప్పళ జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సకల సన్నాహాలు చేసినట్లు  పాలధికారి సుందరేశ్‌బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలు 5,66,341, పురషులు 5,62,376, ఇతరులు 47 మొత్తం 11,28,764 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు చెప్పారు. 26,867 మంది యువత తొలిసారి ఓటు వేస్తున్నారన్నారు. 14,030 మంది దివ్యాంగ ఓటర్లు, 80 ఏళ్లు పైబడ్డ ఓటర్లు 18,301 మంది ఉన్నారన్నారు. వీరి కోసం 1,322 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐదు నియోజవర్గాలకు రిటర్నింగ్‌ అధికారులను నియమించామన్నారు. కొప్పళకు ఆహార శాఖ ఉప సంచాలకుడు, గంగావతికి సహాయక కమిషనర్‌, కనకగిరికి జడ్పీ ఉప కార్యదర్శి, కుష్ఠగికి సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు, యలబుర్గాకు జిల్లా నగరాభివృద్ధి శాఖ యోజనా సంచాలకుడిని నియమించినట్లు చెప్పారు. 29 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, నోడల్‌ అధికారులుగా జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవో, తాలూకాల్లో టీపీఈవోలను నియమించామని పేర్కొన్నారు. జిల్లాలో 14 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు 1950 టోల్‌ప్రీ సహాయవాణిని ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లకు పోలింగ్‌ చీటీలు, ఓటర్ల గైడ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మహిళలు, దివ్యాంగుల కోసం కొన్ని ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్పీ యశోధా వంటగోడి మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, చెక్‌పోస్టుల వద్ద భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా’ పెట్టినట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో రాహుల్‌రత్నం పాండే, అదనపు పాలనాధికారి సావిత్రి కడి పాల్గొన్నారు.  

ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న తాలూకా అధికారులు

దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటేయవచ్చు

మాన్వి, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు సహకరించాలని తాలూకా ఎన్నికల అధికారి ప్రకాష్‌ సూచించారు. గురువారం ఆయన తాలూకా అధికారులు, పార్టీల నాయకులతో తహసీల్దార్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. తాలూకాలో 1,12,956మంది పురుష, 1,17,703మంది మహిళా, 64మంది ఇతరులు కలిపి మొత్తం 2,30,723మంది ఓటర్లున్నారని తెలిపారు. 2,573మంది దివ్యాంగ ఓటర్లు, 2,724మంది 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులు ఉన్నారని ఎన్నికల అధికారులు వారి వద్దకే వెళ్లి ఓట్లు వేయించుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. నామినేషన్‌ చివరి రోజు వరకు ఓటర్లు పేర్లు నమోదు చేసుకోవటం, మార్చుకోవటం, తీసివేయటం చేసుకోవచ్చునని తెలిపారు. మాన్వి, సిరివారల్లో 276 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 47కేంద్రాలను సమస్యాత్మక(సూక్ష్మ) కేంద్రాలుగా గుర్తించినట్లు ప్రకటించారు.

అనుమతులను ఏకగవాక్ష(సింగల్‌విండో) పద్ధతిలో ఒకే చోట ఇస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థి రూ. 40లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని, వివరాలను రోజు వారీగా అందించాలన్నారు. ఎన్నికల పర్యవేక్షణకి ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. ఫిర్యాదులుంటే 08538 220239, 9480874002కి ఫోన్‌ చేయవచ్చునని సూచించారు. తహసీల్దార్లు చంద్రకాంత్‌, సురేష్‌వర్మ సిరివార, అబ్దుల్‌ వాహిద్‌ గ్రేడ్‌2, టీపీంవోఈ ఎం.డి.సయ్యద్‌ పటేల్‌, తదితరులు పాల్గొన్నారు.

 


నియమావళి తప్పకుండా పాటించాలి

రాజకీయ పార్టీల నాయకులకు పలు సూచనలు ఇస్తున్న డీసీ వెంకటేశ్‌, ఎస్పీ శ్రీహరిబాబు

హొసపేటె, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీ వారు తప్పకుండా పాటించాలని జిల్లా పాలనాధికారి టి.వెంకటేశ్‌ పేర్కొన్నారు. రాజకీయ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లా వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. పారదర్శకం, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి రాజకీయ పార్టీలవారు యంత్రాంగానికి సహకారం అందివ్వాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో పార్టీ సమావేశాలకు ముందు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. కల్యాణ మంటపాలు, ధర్మసత్రాల్లో సమావేశం నిర్వహించాలంటే ఎవరు ముందు వచ్చి దరఖాస్తు వేసుకుంటారో వారిని మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇందులో ఎలాంటి వివక్షధోరణికి అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. బరిలో ఉన్న అభ్యర్థి రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయటానికి వీల్లేదు. ర్యాలీలు, ప్రచార సభలు నిర్వహించడం, ఫ్లెక్సీ, బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించి అభ్యర్థి ఖర్చులో కలుపుతామని హెచ్చరించారు. ఓటర్లకు నగదు, ఇతర వస్తువులను కానుకగా ఇస్తే, సంబంధించిన అభ్యర్థిపైనే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్పీ శ్రీహరిబాబు, జడ్పీ సీఈవో సదాశివ ప్రభు, అదనపు పాలనాధికారి డాక్టర్‌ అనురాధ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని