logo

కాంగ్రెస్‌కు కామెర్ల వ్యాధి

 ప్రతిసారీ జనతాదళ్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య చేస్తున్న విమర్శలను గమనిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హెచ్చరించారు.

Published : 31 Mar 2023 03:29 IST

కుమారస్వామి నిప్పులు

దళ్‌లో చేరిన రాజునాయక్‌ ఆధ్వర్యంలో కుమారకు సత్కారం

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే:  ప్రతిసారీ జనతాదళ్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య చేస్తున్న విమర్శలను గమనిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హెచ్చరించారు. ప్రజలతోనే ఆయనకు సరైన సమాధానాన్ని చెప్పిస్తానని సవాల్‌ విసిరారు. జనతాదళ్‌కు ఉనికి లేకుండా చేసేందుకు కాంగ్రెస్‌, భాజపా చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని తేల్చిచెప్పారు. ఎన్నికల అనంతరం అవసరమైతే జాతీయ పార్టీలు రెండూ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్నారు. దళ్‌ను భాజపాకు ఏ టీమ్‌, బీ టీమ్‌ అంటూ కించపరిస్తే కార్యకర్తలు సహించరని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయం జేపీ భవన్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సారి దళ్‌ అధికారంలోకి వస్తుందన్న భయంతోనే జాతీయ పార్టీలు ఇటువంటి ప్రచారాన్ని ప్రారంభించాయని ఆరోపించారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి బొమ్మై ఇప్పటికైనా విమర్శలు ఆపకపోతే ఇబ్బంది పడతారని హితవు పలికారు. జనతా పర్వ, జనతా సంగమ, జనతా జలధార, జనతా మిత్ర, పంచరత్న యాత్రలకు చక్కని స్పందన లభించిందన్నారు. ఎన్నికల్లో 123 నియోజకవర్గాలలో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి 120 సీట్లు వస్తాయని సీ ఓటర్‌ సంస్థ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కామెర్ల వ్యాధి వచ్చిందని ఎద్దేవా చేశారు. మద్దూరులో క్రికెట్ బెట్టింగ్‌ కేసులు ఎదుర్కొంటున్న రవికి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్టు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, అతను భాజపాతో చర్చలు జరుపుతున్నాడని వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ గౌడను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. మాది తండ్రీ కొడుకుల పార్టీ అంటున్న సిద్ధరామయ్య ఈ ప్రపంచంలో ఎనిమిదో అద్భుతమా అని నిలదీశారు. ముఖ్యమంత్రి సహాయ నిధిపై ఎన్నికల కమిషన్‌ నిఘా వహించాలని కోరతామని తెలిపారు. కంప్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాజూ నాయక్‌ ఇదే సందర్భంలో తన అనుచరులతో కలిసి దళ్‌లో చేరారు. పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్సీ కేఎన్‌ తిప్పేస్వామి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


పెరుగు పొట్లాలపై హిందీనా?

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ‘నందిని పాల సంస్థ కన్నడిగుల ఆస్తి. ఆ బ్రాండు పెరుగు పొట్లాలపై -దహీ- అని తప్పనిసరిగా ముద్రించాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదు’ అని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం తప్పుపట్టారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. నందిని కన్నడిగుల స్వాభిమానపు బ్రాండని, అమూల్‌కి తొత్తు కాదని వ్యాఖ్యానించారు. పెరుగు, ప్రొబయాటిక్‌ పెరుగు పొట్లాలపై ‘దహీ’ అని ముద్రించాలని ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని ఆయన డిమాండు చేశారు. మండ్యలో కొద్ది నెలల కిందట నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుజరాత్‌కు చెందిన అమూల్‌తో నందిని బ్రాండ్‌ను విలీనం చేస్తామని ప్రకటించారని తప్పుపట్టారు. దీనిపై ప్రజాగ్రహం పెల్లుబకడంతో.. అటువంటిది ఏమీ లేదని భాజపా రాష్ట్ర నాయకులు వివరణ ఇవ్వవలసి వచ్చింది. కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా ఆరోపించారు. కేంద్రం తన ఆదేశాలను వెనక్కు తీసుకోకపోతే, దీనిపై పోరాటం చేస్తామని కుమారస్వామి హెచ్చరించారు. దీనిపై కేంద్రం తరపున భారతీయ ఆహార సురక్షత, నాణ్యత ప్రాధికార (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదేశాలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.

ఆదేశాలు.. వెనక్కి

పెరుగు పొట్లాలపై ప్రాంతీయ భాషలతో పాటు హిందీలోనూ సమాచారం ఉండేలా ముద్రించాలని ఇచ్చిన ఆదేశాలను భారతీయ ఆహార సురక్షత, నాణ్యత ప్రాధికార (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ ఫుడ్‌ అడిటివిస్‌) ఉపసంహరించుకుంది. దీనిపై తమిళనాడు, కర్ణాటకలలో విమర్శలు రావడంతో తన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని