logo

హద్దుమీరితే రద్దులే : పరమేశ్వర్‌

బజరంగదళ్‌ వంటి సంస్థలపై నిషేధాన్ని విధించే అంశంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని మంత్రి జి.పరమేశ్వర్‌ స్పష్టం చేశారు.

Published : 26 May 2023 03:42 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : బజరంగదళ్‌ వంటి సంస్థలపై నిషేధాన్ని విధించే అంశంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని మంత్రి జి.పరమేశ్వర్‌ స్పష్టం చేశారు. నైతిక పోలీసుగిరి చేస్తూ.. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. బజరంగదళ్‌, పీఎఫ్‌ఐ సంస్థలు తమ హద్దుల్లో లేకపోతే రద్దు చేస్తామని చెప్పిన మాటకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినా భాజపా, హిందూ సంస్థలు దానిపై తప్పుడు ప్రచారాన్ని చేశాయని ఆరోపించారు. తన మంత్రివర్గ సహచరుడు ప్రియాంక్‌ ఖర్గే కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళపైనా నిషేధాన్ని విధిస్తామని ప్రియాంక్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, కొందరు మంత్రులు, పార్టీ నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, దానికి పార్టీ బాధ్యత వహించదని చెప్పారు. పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉంటే, ఏ సంస్థపైన అయినా ప్రభుత్వం నిషేధాన్ని విధిస్తుందని స్పష్టం చేశారు. మతమార్పిడి చట్టం, గోహత్య నిషేధ చట్టాలను ఉపసంహరించుకునే విషయమై మంత్రివర్గంలో, శాసనసభలో చర్చించి, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తీసుకుంటారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు