logo

లోక్‌సభ దిశగా అడుగులు

లోక్‌సభ ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని- దిల్లీ దిశగా అడుగులు మన నేతలు అడుగులు వేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పిలుపునిచ్చారు.

Published : 26 May 2023 03:42 IST

శ్రేణులకు కుమార పిలుపు

దేవేగౌడను వేదికపైకి తీసుకు వస్తున్న భద్రతా సిబ్బంది

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని- దిల్లీ దిశగా అడుగులు మన నేతలు అడుగులు వేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తేనే కర్ణాటకలో ప్రస్తుత ప్రభుత్వానికి మనుగడ ఉంటుందన్నారు. దళపతి దేవేగౌడతో కలిసి ఆత్మావలోకన సభను గురువారం బెంగళూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార మాట్లాడారు. పార్టీ అధ్యక్ష స్థానానికి సీఎం ఇబ్రహీం, యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్‌ కుమారస్వామి తమ పదవులకు రాజీనామా చేశారని, కొత్త అధ్యక్షులను త్వరలో ఎన్నుకుంటామని తెలిపారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అధైర్యపడవద్దని సూచించారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. గెలిస్తే కారణాలు విశ్లేషించరని, ఓడితేనే కారణాలను వెతుక్కుంటామని చెప్పారు. ఓటమికి దారితీసిన కారణాలను ఇప్పటికే విశ్లేషించుకున్నామని తెలిపారు. చివరి క్షణంలో అభ్యర్థులను ఎంపిక చేయడం, వారికి ఆర్థిక సహకారం అందించలేకపోవడంతో ఎక్కువ మంది ఓడిపోయారని అంచనాకు వచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌, భాజపా నాయకులు వ్యూహాత్మకంగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. భాజపా తాను చేసిన తప్పులకు, కులం, మతం ఆధారంగా ఓట్లను చీల్చేందుకు ప్రయత్నించి ఎదురుదెబ్బ తిన్నట్లు వివరించారు. కుమటలో కేవలం 600 ఓట్ల తేడాతో సూరజ్‌ నాయక్‌ సోని ఓడిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. దేవేగౌడ 1989లో రెండు చోట్లా ఓడిపోయారని, ఆ తర్వాత 1994లో పూర్తి మెజార్టీతో పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ ప్రధాని దేవేగౌడ, ఎమ్మెల్సీ శరవణ, మాజీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం తదితరులు ఆత్మావలోకన సభలో పాల్గొన్నారు.

కార్యక్రమ ప్రారంభ జ్యోతి వెలిగిస్తున్న దళపతి దేవేగౌడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని