logo

5 పథకాలకు పచ్చజెండా

కాంగ్రెస్‌ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 5 గ్యారెంటీ పథకాల అమలుకు సిద్ధమైనట్లే. అన్నీ అనుకూలిస్తే వచ్చే మంత్రివర్గ సమావేశంలోనే ఈ గ్యారెంటీలకు సర్కారు పచ్చజెండా ఊపనుంది.

Published : 30 May 2023 07:14 IST

అమలుపై జూన్‌ 1న తుదినిర్ణయం
శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు
అధికార, ప్రతిపక్షాల మిశ్రమ స్పందన

శాఖల అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఈనాడు, బెంగళూరు: కాంగ్రెస్‌ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 5 గ్యారెంటీ పథకాల అమలుకు సిద్ధమైనట్లే. అన్నీ అనుకూలిస్తే వచ్చే మంత్రివర్గ సమావేశంలోనే ఈ గ్యారెంటీలకు సర్కారు పచ్చజెండా ఊపనుంది. ఈ పథకాల అమలు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం అధికారులతో సుదీర్ఘ మంతనాలు సాగించారు.  ఐదు పథకాలను అమలు చేసే శాఖల అధికారులు, మంత్రులతో వేర్వేరుగా సమావేశమైన ముఖ్యమంత్రి ఏమాత్రం ఆలస్యం కాకుండా విధి విధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

బీపీఎల్‌ కార్డుదారులకే?

తొలి మంత్రివర్గ సమావేశంలో తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిన సర్కారు ఆపై మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించింది. శనివారం మంత్రుల ప్రమాణ స్వీకారం, ఆపై మంత్రుల కేటాయింపులతో తలమునకలైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తమ కీలకమైన హామీపై కసరత్తు మొదలు పెట్టారు. అధికార నివాసం కృష్ణ, ఇంధన శాఖ కార్యాలయం శక్తి భవన్‌లో పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఓ వైపు ప్రజలు, మరోవైపు విపక్షాలు గ్యారెంటీ పథకాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుండగా, వీటి అమలు ఆలస్యమైనా సమగ్రమైన వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి తీర్మానించారు. ఈ పథకాల అమలుకు అయ్యే వ్యయంపై ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఐఎస్‌ఎన్‌ ప్రసాద్‌తో ప్రత్యేకంగా చర్చించారు. శాఖల వారీగా ఉచిత విద్యుత్తు అందించే ఇంధనం, ఉచిత బస్సు ప్రయాణం కోసం రవాణా, ఉచిత బియ్యం అందించే ఆహార పౌరసరఫరాలు, మహిళలకు గృహలక్ష్మి పథకం కోసం మహిళా శిశు సంక్షేమం, నిరుద్యోగ భృతి కోసం విద్యాశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి త్వరలో ఈ పథకాల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రాథమిక అంచనా ప్రకారం గృహజ్యోతి పథకాన్ని అందరికీ కాకుండా బీపీఎల్‌ కార్డుదారులకు అందించినా రాష్ట్రంలో 1.27కోట్ల బీపీఎల్‌ కుటుంబాలున్నాయి. ప్రతి నెలా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తును వినియోగించే వారికి రాయితీ ఇవ్వాలంటే ఏటా రూ.12,038కోట్లు వ్యయం చేయాల్సి ఉందని ఆర్థికశాఖ అంచనా వేసింది. ఇతర శాఖల వివరాలను కూడా రెండు రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు.

గురువారం ఆ తీపి కబురు?

తొలి మంత్రివర్గంలో అధికారిక ఆదేశాలివ్వలేని ప్రభుత్వం ఆ తీపి కబురును రానున్న మంత్రివర్గ సమావేశంలో అందించేందుకు సకలం సిద్ధం చేసినట్లే. జూన్‌ 1న ఏర్పాటయ్యే పూర్తిస్థాయి మంత్రివర్గ సమావేశంలో కీలకమైన చర్చ 5గ్యారెంటీ పథకాలపైనే. వీటి అమలుపై ఏకాభిప్రాయాన్ని సేకరించటం సులువైన పనే. ఆరోజున శాఖల వారీగా వ్యయాలు, నిబంధనలను వెల్లడించి వాటిని ఐదేళ్ల పాటు సక్రమంగా అమలు చేసే ప్రణాళికను ప్రకటిస్తారు. పైగా ఈ పథకాలకు అయ్యే వ్యయం కోసం త్వరలో నిర్వహించే విధానసభ సమావేశాల్లో ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ ద్వారా ప్రత్యేక నిధుల బిల్లును ప్రవేశపెట్టే నిర్ణయాన్ని కూడా ఇదే మంత్రివర్గ సమావేశంలో తీసుకుంటారు.

కేంద్రం అన్నీ అమలు చేసిందా?

సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి

గ్యారెంటీ పథకాలపై పదే పదే విమర్శలు గుప్పించే భాజపా..కేంద్రంలో ఉండి ఏం చేసింది. పేదల ఖాతాకు రూ.15లక్షలు, ఏటా 2కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం ద్విగుణీకృతం వంటి హామీలిచ్చిన భాజపా ఇప్పటి వరకు వాటిని అటక నుంచి దించలేదు. హామీలను ఇవ్వాలన్నా, వాటిని నెరవేర్చాలన్నా కాంగ్రెస్‌కే సాధ్యం. భాజపా నుంచి నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు.

గ్యారెంటీ తప్పక జారీ

డీకే శివకుమార్‌, ఉపముఖ్యమంత్రి

కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారెంటీ పథకాలు తప్పకుండా అమలు చేస్తాం. ఇచ్చిన హామీలను ఎవరో చెప్పినట్లు కాకుండా మేము ప్రకటించినట్లు, శాఖలవారీ సమీక్షలకు అనుగుణంగా అమలు చేస్తాం. ఇందులో ఎవరి సలహాలు, విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థికశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఈ పథకాలపై కసరత్తు చేస్తున్నారు. జూన్‌ 1న మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ రోజున ఈ పథకాలపై చర్చిస్తాం. యువకులు, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.

బొమ్మై కూడా ఆలస్యం చేసేవారే

డా.జి.పరమేశ్వర్‌, హోంమంత్రి

బొమ్మై ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి పథకాల అమలుపై సమయం తీసుకునే వారే. పథకాల అమలంటేనే ఓ సమగ్రమైన సమీక్ష, విధి విధానాల తయారీ ముఖ్యం. ప్రజలను తప్పుదోవ పట్టించటమే పనిగా పెట్టుకున్న విపక్షాలు బాధ్యతను మరచి ప్రవర్తిస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పథకాలపై సమగ్ర చర్చలు చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటుంది.

ఇదే అంశంపై శాసనసభా వ్యవహారాల మంత్రి హెచ్‌.కె.పాటిల్‌ స్పందిస్తూ జూన్‌ 1న విపక్షాలకు గట్టి జవాబిచ్చే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటాం. వారం రోజులుగా వారు చేసే ఆరోపణలకు సరైన జవాబు దొరుకుతుందన్నారు.

ప్రజలను మోసగించే పథకాలు

బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి

కాంగ్రెస్‌ చెప్పేదొకటి, చేసేదొకటని ఈ గ్యారెంటీ పథకాల ద్వారా మరోసారి రుజువైంది. ప్రజలను మోసగించేందుకే ఈ పథకాలను ప్రకటించారు. ఎన్నికల వేళ ఎలాంటి నిబంధనలు లేవని ప్రకటించిన కాంగ్రెస్‌..తాత్కాలిక ఆదేశాల్లోనూ ఇదే ప్రస్తావన చేశారు. ఇప్పుడు అందరికీ ఈ పథకాలు వర్తించవని చెబుతున్నారు. కొందరికీ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రజలను మరోమారు మోసగించినట్లే.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని