logo

అమాత్యులకు శాఖల భాగ్యం

మూడు రోజుల కసరత్తు తర్వాత ఎట్టకేలకు రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన శాఖ కేటాయింపు జాబితా కాస్త అటుఇటుగా మార్చి గవర్నర్‌ కార్యాలయానికి చేరవేశారు.

Published : 30 May 2023 07:14 IST

ముఖ్యమంత్రి వద్ద విత్తం
ఉప ముఖ్యమంత్రి వద్ద నగర పగ్గాలు-అసంతృప్తులకు తాయిలాలు

ఈనాడు, బెంగళూరు: మూడు రోజుల కసరత్తు తర్వాత ఎట్టకేలకు రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన శాఖ కేటాయింపు జాబితా కాస్త అటుఇటుగా మార్చి గవర్నర్‌ కార్యాలయానికి చేరవేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ అధికారిక ఆదేశాల ద్వారా శాఖల పంపకాలు వెల్లడించింది. మంత్రులందరికీ రెండు రోజులుగా ఫోను ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి ఇచ్చిన శాఖలను స్వీకరించాలని సర్దిపుచ్చే ప్రయత్నం చేశారు. ఒకరిద్దరు మినహా అందరూ తమకు దక్కిన శాఖలతో సంతృప్తి చెందినట్లే. అమాత్యగిరిని అందిపుచ్చుకోలేనివారు అక్కడక్కడా తమ అసంతృప్తిని వ్యక్తం చేసినా అది సర్కారుపై ప్రభావితమయ్యే అవకాశాలు దాదాపు లేవు. మొత్తం 34 మందికీ కేబినెట్‌ హోదాతోనే పదవులు కేటాయించారు.

మంత్రులకు దక్కిన శాఖలివిగో

* సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి- ఆర్థిక, మంత్రివర్గ వ్యవహారాలు, వ్యక్తిగత, పాలన సంస్కరణలు, గూఢాచార, సమాచార, ఐటీబీటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేటాయించని శాఖలు

* డీకే శివకుమార్‌, ఉపముఖ్యమంత్రి - భారీ, మధ్యతరహా నీటిపారుదల, బెంగళూరు నగరాభివృద్ధి, బీబీఎంపీ, బీడీఏ, బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ, బీఎంఆర్‌డీఏ, బీఎంఆర్‌సీఎల్‌(నగర ప్రణాళిక)

* డా.జి.పరమేశ్వర్‌ -హోం(గూఢాచారవిభాగం కాకుండా)

* హెచ్‌.కె.పాటిల్‌-న్యాయ, శాసననసభ వ్యవహారాలు, పర్యాటకం

* కె.హెచ్‌.మునియప్ప-ఆహార, పౌరసరఫరా, వినియోగదారుల వ్యవహారాలు

* రామలింగారెడ్డి-రవాణా, దేవాదాయ

* ఎం.బి.పాటిల్‌ -భారీ, మధ్యతరహా పరిశ్రమలు

*  కె.జె.జార్జ్‌ -ఇంధనం

* దినేశ్‌గుండూరావ్‌ -ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

* హెచ్‌.సి.మహదేవప్ప -సాంఘీక సంక్షేమం

* సతీశ్‌ జార్ఖిహొళి -ప్రజాపనులు

* ​​​​​​​కృష్ణభైరేగౌడ -రెవెన్యూ(దేవాదాయ కాకుండా)

* ప్రియాంక్‌ ఖర్గే -గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌

* ​​​​​​​ శివానందపాటిల్‌ -జౌళి, చక్కెర, వ్యవసాయ మార్కెటింగ్‌(సహకార సంఘ నుంచి)

* జమీర్‌ అహ్మద్‌ -వసతి, వక్ఫ్‌, అల్పసంఖ్యాక

*  శరణబసప్ప దర్శనాపూర్‌ -చిన్నతరహా పరిశ్రమలు, ప్రభుత్వరంగం

* ​​​​​​​ఈశ్వర ఖండ్రే -అటవీ, జీవావరణ, పర్యావరణం

* ఎన్‌.చెలువరాజస్వామి -వ్యవసాయం

* ​​​​​​​ ఎస్‌.ఎస్‌.మల్లికార్జున -గనులు, భూగర్భ, ఉద్యానం

* రహీంఖాన్‌ -మున్సిపల్‌ పాలన, హజ్‌

*  సంతోశ్‌ లాడ్‌ -కార్మిక

* డా.శరణప్రకాశ్‌ పాటిల్‌ -వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి

* ​​​​​​​తిమ్మాపూర్‌ రామప్ప బాలప్ప -అబ్కారి

*  కె.వెంకటేశ్‌ -పశు సంవర్ధక, పట్టు

* శివరాజ్‌ తంగడగి -వెనుకబడిన వర్గాలు, కన్నడ, సంస్కృతి

* డి.సుధాకర్‌ -ప్రణాళిక, సాంఖ్యాక

* బి.నాగేంద్ర -యువజన సేవలు, క్రీడలు, గిరిజన సంక్షేమం

* కె.ఎన్‌.రాజణ్ణ -సహకార(వ్యవసాయ మార్కెటింగ్‌ మినహాయించి)

*  భైరతి సురేశ్‌ -నగరాభివృద్ధి, పట్టణ ప్రణాళిక(కేయూడబ్ల్యూఎస్‌డీబీ సహా, బెంగళూరు మినహాయించి)

* లక్ష్మీ హెబ్బాళ్కర్‌ -మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం

* మంకాళ్‌ వైద్య -మత్స్య, రేవులు, భూగర్భ రవాణా

* మధు బంగారప్ప -ప్రాథమిక, మాధ్యమిక విద్య

* డా.ఎం.సి.సుధాకర్‌ -ఉన్నత విద్య

* ఎన్‌.ఎస్‌.బోసురాజు -చిన్నతరహా నీటిపారుదల, శాస్త్ర సాంకేతిక

అసమ్మతి అంతంతే

తనకు రవాణా శాఖ కేటాయించటంతో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన రామలింగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బుజ్జగించిన విషయం తెలిసిందే. ఇచ్చిన రవాణాను సవరించకుండా అదనంగా దేవాదాయ శాఖను ఇచ్చిన కాస్త నెమ్మదించేలా చేశారు. ఆహార, పౌరసరఫరాల కంటే మరింత మెరుగైన శాఖను ఇవ్వాలని నేరుగా అధిష్ఠానంతో తేల్చుకునేందుకు దిల్లీకి వెళ్లిన కేహెచ్‌.మునియప్ప రిక్తహస్తాలతో తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి లేదంటే ఎమ్మెల్యేగానే ఉండిపోతాయన్న సీహెచ్‌.పుట్టరంగ శెట్టి తనకు వచ్చిన ఉపసభాపతి స్థానాన్ని బహిరంగంగానే తిరస్కరించారు. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో నేరుగా సిద్ధరామయ్యనే అడగాలని సోమవారం కూడా ఆశావహులు లక్ష్మణ సవది అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తాను మళ్లీ మంత్రి కాగలన్న ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పదవి కంటే ఎమ్మెల్యేగా ఉంటేనే అన్ని శాఖల నుంచి నిధులు రాబట్టుకోగలనని మంత్రి పదవి కోసం శతవిధాలా యత్నించి భంగపడిన మాగడి ఎమ్మెల్యే హెచ్‌.సి.బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని