logo

ఉచితాలకు మెలిక?

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ‘గ్యారెంటీ’ హామీలపై మేధోమథనం మొదలైంది. ఆ పథకాలను అమలు చేయటానికి కాంగ్రెస్‌ సర్కారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ఈ ఏడాది డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లు తేలితేనే ‘యువ నిధి’ ద్వారా నిరుద్యోగ భృతికి అర్హులను చేయాలని సర్కారు యోచిస్తోంది. కొందరు పట్టభద్రులై ఉండి కూడా సొంత వ్యాపారమో, సొంత ఊర్లో స్థిరపడి ఉంటే వారికి ఈ భృతి వర్తించదు.

Updated : 01 Jun 2023 04:43 IST

నిబంధనలచట్రంలో ‘గ్యారెంటీ’లు
మంత్రివర్గ సమావేశం శుక్రవారమే


వివిధ శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఉద్యోగం చేస్తుంటేనే..

ఈ ఏడాది డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లు తేలితేనే ‘యువ నిధి’ ద్వారా నిరుద్యోగ భృతికి అర్హులను చేయాలని సర్కారు యోచిస్తోంది. కొందరు పట్టభద్రులై ఉండి కూడా సొంత వ్యాపారమో, సొంత ఊర్లో స్థిరపడి ఉంటే వారికి ఈ భృతి వర్తించదు. వారు ఈ ఏడాదిలో ఏదో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉండాలి, లేదా ఏదో ఒక ప్రైవేటు సంస్థలోనైనా పని చేసి ఉండాలి. ఈ మెలిక ద్వారా 2022-23 ఏడాది ఉత్తీర్ణులైన అందరూ పట్టభద్రులకు ఈ భృతి చెల్లించాల్సిన అవసరం లేదు. వీరిలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తించే అవకాశాలు దాదాపు లేనట్లే.

ఈనాడు, బెంగళూరు : ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ‘గ్యారెంటీ’ హామీలపై మేధోమథనం మొదలైంది. ఆ పథకాలను అమలు చేయటానికి కాంగ్రెస్‌ సర్కారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజే ఈ పథకాలు అమలు చేస్తామన్న సిద్ధరామయ్య సర్కారు- ఆర్థిక వ్యవహారాల కారణంగా అందుకు సాహసించలేకపోయింది. ఆపై తొలి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినా అప్పటికి పూర్తిస్థాయి మంత్రివర్గం రూపుదిద్దుకోలేదు. ఓ వైపు విపక్షాల విమర్శలు, ప్రజల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సర్కారు ఆ ప్రకటన చేసే ముందు లోతైన విశ్లేషణ చేస్తోంది. జూన్‌ నుంచే ఉచిత పథకాలు పట్టాలెక్కుతాయని రాష్ట్ర ప్రజలు ఆశించినా ఆ శుభముహూర్తం ఇంకా కలిసి రాలేదు. ఇప్పటికే ఐదు పథకాలను అమలు చేసే శాఖల సమీక్ష చేపట్టినా తుది నిర్ణయం ఇంకా వెల్లడికాలేదు. తదుపరి మంత్రివర్గంలో ఈ కబురందిస్తామని ఊరిస్తూ వచ్చిన సర్కారు అందుకు మరో రోజు వేచి ఉండేలా చేసింది. గురువారం నిర్వహించాల్సిన మంత్రివర్గాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

నిబంధనలు ఉండాల్సిందేనా?


సమీక్ష సమావేశానికి విచ్చేసిన మంత్రులు రాజణ్ణ, చెలువరాయస్వామితో మధుబంగారప్పమాటామంతీ

ఎంచుకున్న ఐదు ఉచిత (గ్యారెంటీ) పథకాల్లో ఒక్క ‘బస్సు ప్రయాణం’ మినహా మిగిలిన ఏ పథకాన్నీ షరతులు లేకుండా అమలు చేసేందుకు సర్కారు సాహసించలేకపోతోంది. మంగళవారం రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి చేసిన ప్రకటన రాష్ట్రంలోని మహిళలకు గొప్ప ఊరట అందించినట్లే. ఆదాయ పరిమితులు లేకుండా రాష్ట్ర చిరునామాతో ఉన్న బీపీఎల్‌, ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డు చూపే మహిళలెవరైనా నాలుగు సంస్థల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మెలిక ఏంటంటే.. సాధారణ బస్సులు తప్ప ఏసీలు, డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించే వీలులేదు. పైగా ఉచిత బస్సు పాసులు ముద్రించే అవసరం లేకుండా మహిళలు వెంట తెచ్చుకునే ఏదేని కార్డులతోనే ప్రయాణించే వీలు కల్పించారు. రాష్ట్రంలో కనీసం 25 లక్షల వలస కుటుంబాలకు చెందిన మహిళల్లో దాదాపు 90శాతం మందికి ఈ మూడు గుర్తింపు కార్డులు లేవని ఓ అంచనా. ఈ కారణంగా అనవసర వ్యయాన్ని నివారించే వీలు కలుగుతుంది.

ఉచిత విద్యుత్తుపై..

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెల్లించే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఇప్పటికే దిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల ఉచిత విద్యుత్తు విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని రాష్ట్రం యోచిస్తోంది. అక్కడ లబ్ధిదారులతో సంబంధం లేకుండా 200 యూనిట్ల కంటే తక్కువ రీడింగ్‌ నమోదైన ఇంటికి అసలు బిల్లులే పంపరు. రాష్ట్రంలో అందుకు భిన్నంగా డీబీటీ ద్వారా బిల్లు మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. డీబీటీ దరఖాస్తులో బ్యాంకు వివరాలు నమోదు చేస్తే బిల్లును తిరిగి లబ్ధిదారుడి ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ సందర్భంగా ఎవరైనా ఉచిత పథకాన్ని వద్దనుకుంటే బ్యాంకు వివరాలు పంపాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్రాథమిక అంచనా ప్రకారం 2.1 కోట్ల గృహాలకు ఎస్కాముల ద్వారా విద్యుత్తు అందుతుండగా ఇందులో 1.7 కోట్ల గృహాలకు ప్రతినెలా 200 యూనిట్ల కంటే తక్కువ రీడింగ్‌ నమోదవుతోంది. వీటిల్లోనూ డీబీటీ ఐచ్ఛికాన్ని కనీసం ఐదు నుంచి 10లక్షల మంది వద్దనుకున్నా ఆ సొమ్ము సర్కారుకు మిగిలినట్లే. ఈ మెలికతో రాష్ట్రంపై ఏటా పడే రూ.12వేల కోట్ల వ్యయంలో కాస్త మిగిలినట్లే.

గృహలక్ష్మి.. కసరత్తు

ఇప్పటికే బీపీఎల్‌ మహిళలకు నెలా రూ.2 వేల సాయాన్ని అందించే గృహలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయటం కత్తిమీద సామే. ఇంటి పెద్ద అంటే ఆ ఇంట్లో అత్త లేదా కోడలు ఇద్దరికీ పెత్తనం ఉంటే ఎవరికి ఈ రూ.2 వేలు ఇవ్వాలన్నదే అసలైన సమస్య. కేవలం ఈ పథకం కోసమే అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం బీపీఎల్‌ మహిళలు రాష్ట్రంలో కనీసం కోటిన్నర మంది ఉన్నారు. వీరిలో ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటే వారికి ఈ సాయం అందనట్లే. అంటే ఈ కోటిలోనూ కొందరు తగ్గినట్లే. ఇలాంటి షరతులను తయారు చేసేందుకు సర్కారు యత్నిస్తోంది.

పన్ను పోటు..


బోసురాజు మాటల్ని ఆలకిస్తున్న మంత్రులు

ఉచిత పథకాలంటేనే ఓ చోట ఇచ్చి మరో చోట లాక్కోవటమే. ఆ కనీస ఆర్థిక సూత్రాన్ని అమలు చేస్తే ఇకపై రాష్ట్రంలో ధరలు కొండెక్కినట్లే. త్వరలో రాష్ట్రంలో ఇంధన ధరలను కనీసం రూ.5 నుంచి రూ.7 వరకు పెంచాలని ప్రభుత్వం యత్నిస్తున్నట్లు సమాచారం. జీఎస్‌టీయేతర పన్నులు పెంచే దిశగా చిన్నతరహా పరిశ్రమలు మొదలు అన్ని స్థాయిల్లోనూ పవర్‌ టారిఫ్‌ను పెంచాలని చూస్తున్నారు. మే 15 నుంచే పరిశ్రమలకు ఒక యూనిట్‌కు రూ.7ల నుంచి రూ.9వరకు టారిఫ్‌ను పెంచారు. ఈ ప్రమాణం రానున్న రోజుల్లో పెరిగితే కరోనా కారణంగా ఇక్కట్లలో ఉన్న పరిశ్రమలు మరింత కుదేలయ్యే ప్రమాదం ఉందని కాసియా అధ్యక్షుడు కె.ఎన్‌.నరసింహమూర్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాలు అమలు చేసే శాఖలకు ఇకపై నిధుల ప్రమాణాన్ని పరిమితం చేయాలన్న అధికారుల ప్రతిపాదన అభివృద్ధికి గంటికొట్టే అంశమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని