logo

అక్రమార్కుల దర్జా.. లోకాయుక్త పంజా

ఆదాయానికి మంచి ఆస్తులు కూడగట్టుకున్న అధికారులు, ప్రభుత్వ సిబ్బంది నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

Published : 01 Jun 2023 03:51 IST

తుమకూరులోని కేఐఏడీబీ అధికారి సీఎన్‌ మూర్తికి చెందిన ఈ భవంతిలోనూ సోదాలు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ఆదాయానికి మంచి ఆస్తులు కూడగట్టుకున్న అధికారులు, ప్రభుత్వ సిబ్బంది నివాసాలు, కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శివమొగ్గ, తుమకూరు, హావేరి, కలబురగిలలో వీరికి ఉన్న నివాసాలు, కార్యాలయాలు, ఫారంహౌస్‌లపై దాడి, చేసి, సోదాలు నిర్వహించారు. శివమొగ్గలోని తుంగా ఎగువ ప్రాజెక్టు ప్రధాన ఇంజినీరుకు నివాసంలో కిలోల కొద్దీ వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన కార్లు లభించాయి. కేహెచ్‌బీ కాలనీతో పాటు భద్రావతి తాలూకా శెట్టిహళ్లిలో రెండు ఫారంహౌస్‌లు, ఎనిమిది ఎకరాల్లో వక్కతోట ఉందని గుర్తించారు. శరావతినగర బి-బ్లాక్‌లో ప్రశాంత్‌ బావమరిది నాగేశ్‌ నివాసం, తుంగా ఎగువ ప్రాజెక్టు కార్యాలయంతో కలిపి మొత్తం ఐదు చోట్ల దాడి చేసి సోదాలు కొనసాగించారు. శివమొగ్గ జిల్లా పంచాయతీ ఇంజినీరు శంకర్‌ నాయక్‌కు సంబంధించి శికారిపురలో మూడు చోట్ల సోదాలు నిర్వహించి, పలు దస్త్రాలను జప్తు చేసుకున్నారు. చిత్రదుర్గ లోకాయుక్త ఎస్పీ వాసుదేవరామ్‌ నేతృత్వంలోని అధికారులు శివమొగ్గ జిల్లాలో ఎనిమిది చోట్ల దాడులు చేశారు. ఆర్‌టీనగర సమీపంలోని శంకరపురం డి- బ్లాక్‌లో మైసూరు కేఐఏడీబీ కార్యాలయంలో ఇంజినీరుగా ఉన్న ఎస్‌.నరసింహమూర్తి నివాసంపై లోకాయుక్త ఎస్పీ వలీబాషా నేతృత్వంలో సిబ్బంది ఐదు వాహనాల్లో వచ్చి దాడి చేశారు. ఆయన నివాసంతో పాటు, సమీపంలో ఉన్న మరదలు, మామల నివాసాల్లోనూ గాలించారు. ఆయన నివాసంలో రూ.8 లక్షల నగదు, స్థిర, చరాస్తులు, పలు దాఖలాలు లభించాయని వలీబాషా తెలిపారు. తుమకూరు నగరంలో ఆయనకు పలు చోట్ల ఇంటి స్థలాలు ఉన్నాయని గుర్తించారు. మైసూరు నగర పాలికె అధికారి మహేశ్‌ కుమార్‌ నివాసం కార్యాలయాలుపై 56 మంది సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు.


ప్రశాంత్‌ నివాసంలోజప్తు చేసుకున్న నగదు, ఆభరణాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని