logo

అక్షర వనం.. శుభారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గ్రాంట్లు అందుకుంటున్న, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు నోటు, అచ్చుపుస్తకాలు, సమవస్త్రాలు, బూట్లు వితరణ చేశారు.

Updated : 01 Jun 2023 04:48 IST

పాఠశాలకు వస్తూ ప్రవేశద్వారం వద్ద విద్యార్థుల సందడి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గ్రాంట్లు అందుకుంటున్న, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు నోటు, అచ్చుపుస్తకాలు, సమవస్త్రాలు, బూట్లు వితరణ చేశారు. మొదటి రెండు రోజుల్లో వాటిని అందుకోని విద్యార్థులకు బుధవారం సమకూర్చారు. రెండు నెలల అనంతరం బడికి తిరిగి వచ్చిన విద్యార్థులు తమ పాత స్నేహితులను కలుసుకుని ముచ్చట్లు పెట్టుకున్నారు. విద్యార్థులను స్వాగతించేందుకు ఉపాధ్యాయులే స్వాగత తోరణాలు కట్టారు. కొన్ని చోట్ల రంగుల ముగ్గులు వేయగా, మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పూలు, మిఠాయిలు, చాక్‌లెట్లను అందించారు. ఉదయం నుంచి ఆటలు ఆడించారు. ఇస్కాన్‌ సంస్థ నిర్వహణలోని అక్షయ పాత్ర ప్రతినిధులు మధ్యాహ్నానికి వేడి భోజనాన్ని తీసుకు వచ్చారు. బెంగళూరు, చుట్టుపక్కల ఉన్న 1272 పాఠశాలల్లో 70 వేల మంది విద్యార్థులకు రాజాజీనగర, వసంతపుర, గుణి అగ్రహార, జిగణిలలోని నాలుగుచోట్ల ఉన్న అధునాతన వంటగదులలో అక్షయ పాత్ర సిబ్బంది ఆహారాన్ని సిద్ధం చేశారు. క్యారెట్, బీన్స్‌, క్యాబేజీ, నవ్‌కోల్‌, బీట్రూట్, పుదీనా తదితరాలను ఉపయోగించి తయారు చేసిన వెజిటబుల్‌ పలావ్‌, రవ్వ పాయసం, పెరుగు, అన్నం తదితరాలను మొదటి రోజు విద్యార్థులకు పంపిణీ చేశారు. కర్ణాటకలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 62,229 ఉండగా, వాటిలో 25,278 ప్రాథమిక, 36,951 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. వీటికి అదనంగా 15,867 మిడిల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. విద్యార్థుల్లో అభ్యాస అంతరాలను తగ్గించేందుకు ‘సేతుబంధ’ పేరిట కొత్త బోధన ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. ఒకటి నుంచి మూడో తరగతి విద్యార్థులకు 30 రోజులు, నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థులకు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎల్‌కేజీ, ఒకటో తరగతి విద్యార్థులను చేర్చుకునే ప్రక్రియ కొనసాగించారు.


బాలల కోసం ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్న సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని