logo

అక్రమాలపై ఉక్కుపాదం

భాజపా ఓటమికి కారణమైన ‘అవినీతి బండారం’ ఏ స్థాయిలో ఉన్నదీ బయటపెట్టేందుకు సిద్ధరామయ్య సర్కారు పావులు కదుపుతోంది. భాజపా అధికారంలో ఉండగా ఎంత ప్రయత్నించినా దాగని అక్రమాలే ఆ పార్టీ విజయానికి గండికొట్టిన విషయం తెలిసిందే.

Updated : 02 Jun 2023 05:55 IST

వరుస విచారణలకు ఆదేశాలు

ఈనాడు, బెంగళూరు : భాజపా ఓటమికి కారణమైన ‘అవినీతి బండారం’ ఏ స్థాయిలో ఉన్నదీ బయటపెట్టేందుకు సిద్ధరామయ్య సర్కారు పావులు కదుపుతోంది. భాజపా అధికారంలో ఉండగా ఎంత ప్రయత్నించినా దాగని అక్రమాలే ఆ పార్టీ విజయానికి గండికొట్టిన విషయం తెలిసిందే. జాతీయస్థాయిలో చర్చకు దారి తీసిన అవినీతి గుట్టు రట్టు చేసేందుకు ఒక్కొక్కటిగా ఆదేశాలు, విచారణలు కొనసాగించాలని సర్కారు యోచిస్తోంది. విపక్ష స్థానంలో ఉండి శాసనసభలో ఈ అక్రమాలపై భారీ ఎత్తున ఆక్షేపణ చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాటి నిగ్గు తేల్చాలని అధికారులకు సూచించారు. సీఐడీ విచారణ- లేదంటే మరింత విస్తృతమైన సంస్థలతో అక్రమాలను వెలికి తీయాలనేది ప్రస్తుత సర్కారు ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సవాలు చేయగా- ఆ సమయంలో అవినీతి ఉచ్చులో చిక్కుకున్న మాజీ మంత్రులకు భయం వెంటాడుతోంది.

కమీషన్ల గోల..

కేఎస్‌ ఈశ్వరప్ప

భాజపా మెడకు చుట్టుకున్న 40 శాతం అవినీతి ఆరోపణకు కేంద్ర బిందువైన 2022 జులై నాటి ఉడుపి వాసి సంతోశ్‌ పాటిల్‌ ఆత్మహత్య, అదే ఏడాది డిసెంబరులో తుమకూరుకు చెందిన పీడబ్ల్యుడీ గుత్తేదారుడు టి.ఎన్‌.ప్రసాద్‌ ఆత్మహత్యల వెనుక ఉన్న కమీషన్‌ ఒత్తిడిపైనా విచారణ చేపట్టనున్నారు. సంతోశ్‌ పాటిల్‌ కేసులో రాజీనామా చేసి తర్వాత క్లీన్‌చిట్‌ పొందిన మాజీ మంత్రి కేఎస్‌.ఈశ్వరప్పకు మరోమారు నోటీసులు రానున్నాయి. ఈ అక్రమాలపై అలుపెరుగక పోరాటం చేస్తున్న రాష్ట్ర గుత్తేదారుల సంఘం, ప్రైవేటు పాఠశాలల నుంచి వసూలు చేసే 30శాతం వసూళ్లపైనా సర్కారు విచారణ చేపట్టనుంది.

వైద్యానికి చికిత్స..

మాజీ మంత్రి సుధాకర్‌

ఓ వైపు రాష్ట్ర ప్రజలంతా కరోనాతో విలవిలలాడుతుంటే వైద్య, ఆరోగ్యశాఖలు కాసులతో కళకళలాడుతున్నాయని 2020లో విపక్ష నేతగా సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు. ఆక్సిజన్‌ యూనిట్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లను తమకు ఇష్టమొచ్చిన సంస్థకు గుత్తకు ఇవ్వటం, మార్కెట్‌ ధరల కంటే మూడు రెట్లు అదనంగా ఖర్చులు చూపటం వల్ల రూ.2,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు సిద్ధరామయ్య ఆరోపించారు. ఇదే సందర్భంగా కరోనా మృతులకు అందించే పరిహారంలోనూ ‘సేవా సింధు’ వెబ్‌సైట్‌, బీబీఎంపీ పరిధిలో పడకల బుకింగ్‌లోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు భాజపా ఎంపీ తేజస్విసూర్య స్వయంగా ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే అధికారికంగా గుర్తించిన మృతుల కుటుంబాలకు కూడా మూడేళ్లు గడచినా పరిహారం చెల్లించలేదన్న ఆరోపణ వినిపిస్తోంది. వీటిపై త్వరలో విచారణకు ఆదేశించనున్నారు. ఈ వ్యవహారం మాజీ మంత్రి సుధాకర్‌కు సంకటప్రాయమే.

పీఎస్‌ఐ  ఆక్రమాల పైనా

పోలీస్‌ ఎస్‌ఐ ఉద్యోగాల అక్రమాలదర్యాప్తు వ్యవహారం ఏమైంది?

మొన్నటి భాజపా ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిన పోలీస్‌ ఎస్‌ఐ ఉద్యోగ నియామకాల అక్రమాల కేసుపై ప్రస్తుత హోంమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ విచారణకు రంగం సిద్ధం చేశారు. ఆ కేసులో ఇప్పటికే ఏడీజీపీ అమృత్‌ పాల్‌ను సస్పెండ్‌ చేయటం, మరో 168 మందిని అరెస్ట్‌ చేసినా ఈ అక్రమాల వెనుక ఉన్న భాజపా నేతలను బయటకు లాగాలని కొత్త సర్కారు ఉవ్విళ్లూరుతోంది. ఈ కేసు వెనుక నేరుగా భాజపా మహిళా నేత దివ్యా హాగరగి ఇచ్చిన వాంగ్మూలాన్ని తిరగదోడి మరోమారు కేసును పునర్విచారణకు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలికి కేటాయించిన నిధుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు మంత్రి ప్రియాంక్‌ ఖర్గే గతంలో శాసనసభలో ఆరోపించగా వీటిపై మరోమారు విచారణ కొనసాగనుంది.

‘ఆక్సిజపీఎస్‌ఐ అక్రమాలపైనా..న్‌’ విషాదంపై..

2021 మే 12న చామరాజనగర ప్రభుత్వ ఆస్పత్రి శవాల దిబ్బగా మారిన సంఘటన దేశాన్ని కలవరానికి గురి చేసింది. కరోనా చికిత్స పొందుతున్నవారికి సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో 24 మంది మృత్యువాతపడ్డారు. ఈ సంఘటనకు బాధ్యులను సేవల నుంచి తొలగించినా ఆ దురంతం వెనుక ఉన్న పెద్ద హస్తాన్ని వెలికి తీసేందుకు సిద్ధు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సంఘటనపై విచారణ చేపడతామని ఆరోగ్యశాఖ మంత్రి  దినేష్‌ గుండూరావు తాజాగా ప్రకటించారు.

జనం కోసం పాంచ్‌పటాక్‌!

గ్యారెంటీ పథకాల పత్రంతో సిద్ధు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ‘ఐదు గ్యారెంటీ’ పథకాల అమలుపై కాంగ్రెస్‌ నాయకులు దృష్టిసారించారు. వాటి అమలుకు ఉపయుక్తమయ్యేలా శుక్రవారం మంత్రివర్గ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించానున్నారు. ఆ ఐదు ‘గ్యారెంటీ’లపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం.. ప్యాలెస్‌ మైదానంలో భారీ బహిరంగసభ సమావేశాన్ని నిర్వహించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ చేత ఆ పథకాలను ప్రజలకు అంకితం చేయాలనేది ఆలోచన. ఎన్నికల సమయంలో ఆ ఐదు పథకాలను రాహుల్‌, ప్రియాంక చేత ప్రకటింప చేసిన విషయం తెలిసిందే. వాటి అమలు ప్రకటనల బాధ్యత వారికే అప్పగించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించారు. గృహలక్ష్మీ పథకం కింద ఇంటి యజమానురాలికి నెలకు రూ.2 వేలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, నిరుద్యోగ భృతి కోసం యువనిధి పథకం, అన్నభాగ్య కింద బీపీఎల్‌ కార్డుదారులకు నెలకు పది కిలోల బియ్యం, రాగులు, జొన్నల పంపిణీ కీలకం. కె.ఎస్‌.ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. ఆయా లబ్ధిదారులకు వర్తించే నిబంధనలు, షరతులు ఖరారు చేయడం కత్తిమీద సాముతో సమానం. గృహలక్ష్మీ పథకం బీపీఎల్‌ కార్డుదారులకు, ఉచిత విద్యుత్తు పథకం మరిందరికి, బియ్యం, రాగులు, జొన్నలు పేదలకు, బస్సుల్లో మహిళలందరికీ 60 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించనున్నట్లు సమాచారం.

*గ్యారెంటీ పథకాల అమలుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖ అధికారులతో దశలవారిగా 15 సార్లు సమావేశమై చర్చించారు. ఇప్పటివరకు ఎదురయ్యే ఆర్థిక ఇక్కట్లకు పరిష్కార మార్గం దొరికిన దాఖలాలు లేవు. ఆ పథకాల అమలు కోసం ఏడాదికి రూ.70 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. అధికారులు కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రుసుంలు, పన్నులు, సెస్సులు పెంచడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసినట్లు వినికిడి. ప్రజలపై భారం మోపకుండా పరోక్ష పన్నులు, రుసుంలు, సెస్సులు పెంచే మార్గాలను అన్వేషించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ, పెట్రోల్‌పై సెస్సు, రహదారి పన్ను, ఆస్తి పన్నులూ పెంచే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఖజానా కోసం మద్యం ధరలు పెంచాలనేది మరో ప్రతిపాదన. ఇప్పటికిప్పుడు కొన్ని పథకాలకు కేటాయించిన నిధుల్లో కోత విధిస్తారు. కనీసం రూ.50 వేల కోట్ల నిధి సమకూరితే ఉత్సాహంగా అడుగు ముందుకు వేయవచ్చని సీఎం అంచనా వేస్తున్నారు.


సీఎం ప్రధాన సలహాదారుగా సునీల్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వ్యూహ రచనతో శ్రమించిన సునీల్‌ కనుగోలును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. తదుపరి ఆదేశాల వరకు ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పించి, మంత్రికి లభించే అన్ని సదుపాయాలను కల్పించాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్‌ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి తన సిబ్బందితో కలిసి సేవలు అందిస్తున్నారు. గత ఆరు నెలల కిందట కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించేందుకు ముందుకు వచ్చారు. ఎన్నికల హామీలలో ఐదు గ్యారెంటీలను ఆయనే రూపకల్పన చేశారు. కొన్ని ప్రకటనలతో పాటు, దశల వారీగా నేతల హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కొన్ని వాణిజ్య ప్రకటనలో, పేసీఎం, సే సీఎం క్యాంపెయిన్‌లను ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో విజయం సాధించారు. గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి పని చేసిన అనుభవం ఉంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో 2017లో భాజపా కోసం పని చేశారు. బళ్లారికి చెందిన సునీల్‌ ఏడు నెలల కిందటే కాంగ్రెస్‌ టాస్క్‌ ఫోర్స్‌లో చేరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని