logo

భారీ కాలువతో వరదలకు అడ్డుకట్ట

ఉద్యాననగరిలో 70 మి.మీ. వర్షపాతం నమోదైతే సుమారు 250కి పైగా ప్రాంతాలు జలమయమై ప్రజలను విలవిలలాడే స్థితి ఎదురవుతున్న చేదు అనుభవాలు రూపుమాపేందుకు నిపుణులు కొత్త ప్రణాళికతో సిద్ధమయ్యారు.

Published : 02 Jun 2023 02:36 IST

చెక్కబీరువా బోటుగా మార్చి మహిళను తరలిస్తున్న యువకులు (పాతచిత్రం)

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఉద్యాననగరిలో 70 మి.మీ. వర్షపాతం నమోదైతే సుమారు 250కి పైగా ప్రాంతాలు జలమయమై ప్రజలను విలవిలలాడే స్థితి ఎదురవుతున్న చేదు అనుభవాలు రూపుమాపేందుకు నిపుణులు కొత్త ప్రణాళికతో సిద్ధమయ్యారు. పాతిక మి.మీ. వర్షపాతానికి 18కు పైగా అండర్‌పాస్‌లలో ఐదు అడుగుల నీరు చేరుకుంటోందనే చేదు నిజాన్ని పరిగణలోనికి తీసుకుని- ఈ సమస్యను అధిగమించేందుకు రూ.2,800 కోట్ల ఖర్చుతో 658 కిలోమీటర్ల పొడవునా వాననీటి ప్రవాహ రాజకాలువను అదనంగా నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకాలువలో పూడిక తీత, మరమ్మతులకు రూ.2 వేల కోట్లను కేటాయించాలి. చెరువులను శుభ్రపరచి, పూడిక తీతకు రూ.800 కోట్లు అవసరం. ప్రసుత్త కాలువ చుట్టుపక్కల కబ్జాలను తొలగించడమూ కీలకమని నైట్ ఫ్రాంక్స్‌ సంస్థ తన ‘బెంగళూరు అర్బన్‌ ఫ్లడ్‌ రిపోర్ట్‌’లో విస్పష్టంగా పేర్కొనడంతో అధికారులు మేల్కొన్నారు. గత ఏడాది సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు బెంగళూరులోని ఎనిమిది వలయాలలో ప్రదాన ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలకు నరకం చూపాయి. ఇళ్లలోకి నీరు భారీగా ప్రవేశించిన చేదు జ్ఞాపకాన్ని జనం మరచిపోలేదు. కొన్ని చోట్ల దోణి, బోట్లను ఉపయోగించి ఇళ్లలో, నీళ్లలో చిక్కుకున్న వారిని అగ్నిమాపదకళ సిబ్బంది, ప్రకృతి విపత్తుల నిర్వహణ దళాలు రక్షించాయి. రూ.10 కోట్ల విలువైన విల్లాల ఆవరణలోకీ నీరు ప్రవేశించడం ఓ పీడకల. ‘బెంగళూరులో 842 కిలోమీటర్ల పొడవైన రాజకాలువ ఉంది. దీన్ని 1500 కి.మీ. వరకు విస్తరించాలి’ అని నిపుణుల అధ్యయనంలో గుర్తించామని నైట్ఫ్రాంక్‌ ఇండియా బెంగళూరులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శాంతను మంజుందార్‌ తెలిపారు. నగరంలో పర్యావరణ వ్యవస్థ దెబ్బతినకుండా, భూవ్యాపారాలను, మౌలిక సదుపాయాల వృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేయడం తప్పనిసరిగా పేర్కొన్నారు. చెట్లను కొట్టివేయకుండా, రహదారి విస్తరణ, మెట్రో పనులకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. చైనాలో వరద పరిస్థితుల నియంత్రణకు ‘స్పాంజ్‌ సిటీ’ పరికల్పనపై అధ్యయనం జరుగుతోందన్నారు. ఎంత వర్షం కురిసినా, భూమిలోకి నీరు ఇంకే వ్యవస్థ, అదనంగా ఉన్న నీరు రాజకాలువల ద్వారా చెరువులు, కుంటలకు మళ్లించే విధానంతో సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. బెంగళూరు నగరం గత రెండు దశాబ్దాలలో 93.3 శాతం అభివృద్ధి చెందింది. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు, రాజకాలువల నిర్మాణాలు చేపట్టకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. కోరమంగల పరిధిలో 1900 సంవత్సరంలో 113.2 కి.మీ. పొడవు ఉన్న రాజకాలువ 2016-17 నాటికి 62.8 కి.మీ.కు కుదించుకుపోయింది. వృషభావతి వ్యాలీలో 226.3 కి.మీ. ఉన్న రాజకాలువ 2016-17 నాటికి 111.7 కి.మీకు తగ్గిపోయింది. కబ్జాలను తొలగిస్తూ, అదనంగా రాజకాలువల నిర్మాణంతోనే వరద పరిస్థితుల నుంచి నగరాన్ని రక్షించవచ్చని తమ నివేదికకు స్పందించిన నిపుణులు పేర్కొన్నారని ఆయన వివరించారు.


దోణి విహారం కాదు... నిరుడు నీరు చేరుకున్న ప్రాంతాల్లో జన రక్షణ ఇలా

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని