logo

సంక్షేమ సామ్రాజ్యం!

ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలు గడుస్తున్నా ఉచిత గ్యారెంటీ పథకాలు అమలు చేయలేదన్న ఆరోపణలు, ఆక్షేపణలు, ప్రతిపక్షాల విమర్శలకు సిద్ధరామయ్య సర్కారు ఏకకాలంలో జవాబిచ్చింది.

Published : 03 Jun 2023 01:06 IST

ఉచితాల కేక పెట్టించిన సర్కారు
అయోమయంగా విద్యుత్తు పథకం
షరతులు లేవంటూనే నిబంధనల కొరడా

మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌, మంత్రులు, తదితరులు

ఈనాడు, బెంగళూరు : ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలు గడుస్తున్నా ఉచిత గ్యారెంటీ పథకాలు అమలు చేయలేదన్న ఆరోపణలు, ఆక్షేపణలు, ప్రతిపక్షాల విమర్శలకు సిద్ధరామయ్య సర్కారు ఏకకాలంలో జవాబిచ్చింది. ఈనెల 20న ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజునే ఏర్పాటు చేసిన మంత్రివర్గ తీర్మానంలో సాంకేతిక ఆదేశాలు జారీ చేసిన సర్కారు సరిగ్గా 12 రోజుల తర్వాత స్పష్టమైన ఆదేశాలు వెల్లడించింది. మధ్యలో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా ఈ గ్యారెంటీ పథకాలపై చర్చ మాత్రమే నిర్వహించారు. గత వారం రోజులుగా శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి బుధవారం ఉచిత పథకాల అమలు తప్పకుండా చేపడతామన్నారు. ఈ పథకాలపై నిబంధనలను రూపొందించే క్రమంలో గురువారం నిర్వహించాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని కూడా శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం నాటి సమావేశంలో దాదాపు నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఐదు గ్యారెంటీ పథకాలపై ఏకగ్రీవంగా తీర్మానించారు.

అన్నీ ఆసక్తికరమే..

పార్టీ అధిష్ఠానమే దగ్గరుండి రూపొందించిన ‘ఐదు గ్యారెంటీ’లపై రాష్ట్ర కార్యవర్గం మొదలు జాతీయ నేతలంతా ఎంతో సమగ్రంగా చర్చించారు. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రా ఈ పథకాల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని రాష్ట్ర నాయకత్వానికి సూచనలు జారీ చేశారు. ఓ వైపు విపక్షాలు ఈ పథకాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటం, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణులు అప్పుడే ఉచితాలకు లబ్ధిదారులమైనట్లు చేస్తున్న వాదోపవాదాలు ఎదురైనా ఏమాత్రం కంగారుపడని సర్కారు తాము ఈ పథకాల అమలులో రూపొందించాల్సిన నిబంధనలను తుచ తప్పక తయారు చేసింది. ఓ వైపు ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకుంటూ, మరోవైపు ఉచితాల మాటునే వ్యయాన్ని తగ్గించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రతి పథకంలోనూ షరతులను సిద్ధం చేసింది. ఈ షరతులు విధించినా పథకాలు మాత్రం రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉండటం కొసమెరుపు. శుక్రవారం  మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పథకాలపై సమగ్రంగా విశ్లేషణ ఇచ్చారు.

‘శక్తి’తో ఆరంభం..

గ్యారెంటీ పథకాలపై స్పష్టత ఇచ్చిన సర్కారు ఈనెల 11 నుంచే వీటిని ఆరంభించనుంది. తొలుత బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే ‘శక్తి’ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా ఆర్థిక శక్తితో సంబంధం లేకుండా రాష్ట్ర చిరునామనాతో ఉన్న ఆధార్‌ కార్డు, బీపీఎల్‌, ఓటరు గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి కలిగి ఉన్న మహిళలు ఏసీ, స్లీపర్‌ సదుపాయం లేని ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించే వీలుంది. రాష్ట్ర సరిహద్దులు దాటే కర్ణాటక బస్సుల్లో ప్రయాణించే వీలులేదు. విద్యార్థినులు కూడా ఈ సదుపాయంతో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. బస్సుల్లో తప్పనిసరిగా 50శాతం సీట్లు పురుషులకు కేటాయించటం ద్వారా ఉచిత ప్రయాణ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.

‘గృహలక్ష్మి’కి స్వాతంత్య్రం

ఇంటి యజమానిగా ఉండే మహిళకు ప్రతి నెలా రూ.2వేలు అందించే ‘గృహలక్ష్మి’ పథకాన్ని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభిస్తారు. ఆధార్‌ కార్డు, బ్యాంకు వివరాలతో పాటు ఈ సాయాన్ని అందించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు కనీసం నెల సమయం అవసరం. ఇందు కోసం ఈనెల 15నుంచి జులై 15 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఆపై నెల రోజుల పాటు ఈ వివరాలను సమీక్షించి ఆగస్టు 15నుంచి అధికారికంగా ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే దివ్యాంగులు, వృద్ధులు, వితంతు పరిహారాలు పొందుతున్న మహిళలు కూడా ఈ పరిహారాన్ని పొందుతారు. ఇంటి యజమాని(పురుషుడు) స్వయంగా తన భార్యే ఇంటి పెద్ద అంటూ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. ఈ ధ్రువీకరణ ఇవ్వని వారికి ఈ పథకం వర్తించదు.

జులై నుంచే అన్నభాగ్యం

గతంలో అన్నభాగ్య పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన కాంగ్రెస్‌ సర్కారు ఈసారి మరింత మెరుగైన సదుపాయాలతో ముందుకు వచ్చింది. భాజపా సర్కారు 5కిలోల బియ్యం, మరో రెండు కిలోల చిరుధాన్యాలను అందించింది. కొత్త సర్కారు ఈ పథకాన్ని సవరించి మొత్తం పది కిలోల బియ్యాన్ని అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే నెలకు సరిపడా ధాన్యాన్ని వితరణ చేసి ఉండటం, కొత్త నెల ధాన్యాన్ని సేకరించని కారణంగా జులై 1నుంచి 10కిలోల ఉచిత బియ్యం పథకాన్ని ప్రారంభించాలని తీర్మానించారు. అంత్యోదయ, బీపీఎల్‌ కార్డుదారులందరికీ 10 కిలోల బియ్యాన్ని అందిస్తారు. ఈ పథకంలో ఎలాంటి అదనపు షరతులు విధించలేదు.

నిరుద్యోగ భృతి

డిగ్రీ ఉత్తీర్ణులై కనీసం 180 రోజుల వరకు ఏ ఉద్యోగం పొందని ఏదేనీ డిగ్రీ, డిప్లొమా పట్టభద్రులెవరైనా తాము నిరుద్యోగులమని దరఖాస్తు చేసుకుంటే వారికి రెండేళ్ల పాటు రూ.3వేలు, రూ.1,500లను చెల్లిస్తారు. ఈ రెండేళ్లలో ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం పొందిన తక్షణమే ఆ పరిహార సదుపాయం తొలగిస్తారు. 18-25ఏళ్ల లోపు నిరుద్యోగులెవరైనా ఈ పథకానికి లబ్ధిదారులే. లైంగిక అల్ప సంఖ్యాకులు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ ఏడాది 4 లక్షల మంది డిగ్రీ పట్టభద్రులని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సంఖ్యకు మించి ఉంటే వారికి పరిహారం చెల్లించటం, వారి నిరుద్యోగ స్థాయిని పరిగణించే అధికారులెవరో ఇంకా తేల్చలేదు. అప్పటి వరకు వీరికి యువనిధి దక్కనట్లే.

విద్యుత్తు మెరుపు..

మిగిలిన అన్ని పథకాలతో పోలిస్తే ఉచిత విద్యుత్తు పథకం కాస్త అయోమయాన్ని సృష్టించింది. ఏడాది పొడవునా ప్రతి నెలా వినియోగించే విద్యుత్తు ప్రమాణ సగటును లెక్కించి.. ఆ సగటుపై 10 శాతాన్ని జతచేస్తారు. ఈ మొత్తం యూనిట్లకు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈనెల ఇప్పటికే బిల్లులు తయారు చేసిన కారణంగా జులై 1 నుంచి ఆగస్టు నెల 1 వరకు నమోదయ్యే యూనిట్‌లను లెక్కగడతారు. ఆపై ఏడాది పొడవునా వినియోగించే నెలసరి విద్యుత్తు సగటు 200యూనిట్లకు లోపు ఉంటేనే ఉచిత పథకానికి అర్హతగా పరిగణిస్తారు. వాస్తవానికి ఈ పథకమే ఓ షరతుల మయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని