logo

ఆ ఊరికి విద్యుత్తు ఉచిత సేవ!

బాగలకోట జిల్లా ముధోళ తాలూకా శిరోల గ్రామంలో 2,700 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. పంపుసెట్లను పని చేయించేందుకు కావలసిన త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరాలో నాణ్యత లేకపోవడంతో పలుసార్లు మోటార్లు, కాలిపోయేవి.

Published : 03 Jun 2023 01:06 IST

బాగలకోట, న్యూస్‌టుడే : బాగలకోట జిల్లా ముధోళ తాలూకా శిరోల గ్రామంలో 2,700 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. పంపుసెట్లను పని చేయించేందుకు కావలసిన త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరాలో నాణ్యత లేకపోవడంతో పలుసార్లు మోటార్లు, కాలిపోయేవి. లోడు ఎక్కువైన సమయంలో ట్రాన్స్‌ఫారాలు పేలిపోయేవి. ఈ సమస్యను తెలుసుకున్న అప్పటి రైతు నాయకుడు ఆచార్య ఎండీ నంజుండ స్వామి (దివంగత) గ్రామంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ట్రాన్స్‌ఫారాలను మరమ్మతు చేయకపోవడం, నాసిరకం విద్యుత్తు సరఫరాతో పలు సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. అధికారులు సమస్యను పరిగణనలోకి తీసుకుని మరమ్మతులు చేసే వరకు విద్యుత్తు బిల్లులు చెల్లించవద్దని నంజుడస్వామి అప్పట్లో పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు స్పందించిన రైతులు బిల్లులు చెల్లించడాన్ని నిలిపి వేశారు. బిల్లు తీసుకునేందుకు విద్యుత్తు శాఖ సిబ్బంది వచ్చినా స్పందించలేదు. ఫ్యూజు తొలగించినా ఎవరూ పట్టించుకోకుండా.. సామూహికంగా నిరసన వ్యక్తం చేశారు. సమస్యను అర్థం చేసుకున్న గ్రామ యువకులు ట్రాన్స్‌ఫారం మరమ్మతు కేంద్రాన్ని స్థానికంగా ఏర్పాటు చేశారు. వాటితో పాటు మోటార్లను నామమాత్రపు ధరకే మరమ్మతు చేయడాన్ని ప్రారంభించారు. వీరి చొరవను గుర్తించిన విద్యుత్తు శాఖ ఆ గ్రామానికి మళ్లీ విద్యుత్తును పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఆ గ్రామంలో విద్యుత్తు బిల్లులు ఇచ్చేందుకు సిబ్బంది రావడం నిలిచి పోయింది. గ్రామస్థులే స్వచ్ఛందంగా మీటరు రీడింగ్‌ తీసుకుని, వీలున్న వారు మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నారు. బిల్లు చెల్లించపోయినా.. విద్యుత్తు కోత ఉండదు. కొత్తగా ఇల్లు నిర్మించుకుంటే, విద్యుత్తుకు ప్రత్యేక అనుమతులూ తీసుకునే అవసరం లేకుండా గ్రామంలోని రైతు సంఘం సహకరిస్తుంది. స్తంభం, ట్రాన్స్‌ఫారంపై సమస్య వస్తే స్థానికులే పరిష్కరించుకుంటున్నారు. ఆ గ్రామానికి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తూ, ఎటువంటి సమస్య లేకుండా అధికారులు చూస్తున్నారు. ‘నిజానికి ఆ గ్రామం నుంచి మాకు ఆదాయం బాగుంది. మరమ్మతులు, మీటరు రీడింగ్‌లు తీసేందుకు సిబ్బంది అవసరం ఉండదు. కొందరు బిల్లులు బాగానే చెల్లిస్తున్నారు’ అని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని