logo

సర్కారు మెడపై కరవు కత్తి

వంద రోజుల కాంగ్రెస్‌ సర్కారుకు సవాళ్ల పరంపర మొదలైనట్లే. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన భారీ గ్యారెంటీ పథకాలను ఎలాగోలా అమలు చేసి ఊపిరి పీల్చుకున్న సర్కారుకు ‘కరవు’ రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది.

Published : 18 Sep 2023 00:22 IST

గ్యారెంటీ వ్యయానికి పరిహార భారం
కాంగ్రెస్‌కు తప్పని సవాళ్ల పరంపర

బాగల్‌కోట్‌ జిల్లాలో నీరు లేక వెలవెలబోతున్న ఘటప్రభ

ఈనాడు, బెంగళూరు: వంద రోజుల కాంగ్రెస్‌ సర్కారుకు సవాళ్ల పరంపర మొదలైనట్లే. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన భారీ గ్యారెంటీ పథకాలను ఎలాగోలా అమలు చేసి ఊపిరి పీల్చుకున్న సర్కారుకు ‘కరవు’ రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఈ సమస్య ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేనిది. పైగా నిత్యం అప్రమత్తమవుతూ పరిహారాన్ని అందించాల్సిన అనివార్యత సృష్టించేంది. గ్యారెంటీ పథకాల్లో ఒకటైన అన్నభాగ్యకు బియ్యం ఇవ్వలేకపోయిందని కేంద్రం వైపు వేలుచూపగలిగిన సర్కారు కరవు విషయంలో తమదైన బాధ్యతను నిర్వహించాల్సిందే. రానున్న మంత్రివర్గ సమావేశంలో తప్పకుండా కరవు తాలూకాలను ప్రకటిస్తామన్న సర్కారు అంతు ముందుగానే ఆ తాలూకాలేవో చెప్పేసింది. ఇక ఆ తాలూకాల్లో యుద్ధప్రాతిపదికన పరిహార చర్యలు చేపట్టాల్సిందే.

1,219 మంది రైతుల ఆత్మహత్య

గత ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా 1,219 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వర్షం కొరత, పంట నష్టం, రుణ భారం రైతులకు ప్రాణసంకటంగా మారిందని వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 2023 వరకు మొత్తం 968 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా వీరిలో 849 మంది రైతులే పరిహారానికి అర్హులని సర్కారు తేల్చింది. మిగిలిన 111 మరణాలు వ్యవసాయం, రుణాలకు సంబంధించినవి కాదని తిరస్కరించారు. హావేరిలో అత్యధికంగా 122, మైసూరు -83, బెళగావి -81, ధార్వాడ -78, యాదగిరి -56, చిక్కమగళూరు -53 శివమొగ్గ -43మంది మరణించారు.  ఐదు నెలల్లో 174 మంది మరణించగా దక్షిణ కన్నడ, కోలారులో ముగ్గురు చొప్పున రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఉడుపి, రామనగరల్లో ఎవరూ మరణించలేదు.

రెండు నెలలు ఊరట: మలెనాడు, కరావళి ప్రాంతంలో శని, ఆదివారాల్లో వర్షాలు పడటం కాస్త ఊరటం కల్పించింది. బెంగళూరులోనూ వాతావరణం మబ్బు పట్టడంతో సాధారణ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. దావణగెరెలో ఉన్నపళంగా వర్షం కురవటంతో జిల్లా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మంగళూరు, కుందాపుర, శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్కమగళూరులో వర్షం పడనుంది. సెప్టెంబరు, డిసెంబరులో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తుండటంతో రాష్ట్రమంతటా వర్షాలు పడే అవకాశం ఉంది. సగటున ఈ రెండు నెలల్లో 18.2శాతం వర్షపాతం నమోదవుతుందని అధికారులు వెల్లడించారు.

రికార్డు స్థాయి క్షామం

రాష్ట్రంలో కరవు అనే పదాన్ని 2018 తర్వాత వినలేదు. ఇదే కాంగ్రెస్‌ సర్కారు హయాంలో 2017-18లో 140తాలూకాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. ఆపై నాలుగేళ్లు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఓవైపు కరోనా విలయాన్ని సృష్టిస్తున్నా అతివృష్టి, వరదలు రాష్ట్రాన్ని చుట్టేశాయి. ఈ సమయంలో రైతుల ఇంట కరవనే మాటే వినపడలేదు. ఈ ఏడాది అప్పటి కంటే ఎక్కువ తాలూకాలు కరవు కోరల్లో చిక్కుకున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. పైగా 123 ఏళ్లలో చూడనంత ఉష్ణోగ్రతలు ఆగస్టు మాసంలో నమోదు కావటంతో సాగుబడి చతికిల పడిపోయింది.

20 ఏళ్లలో 11 సార్లు

ఇరవై ఏళ్లలో రాష్ట్రంలో 11 సార్లు కరవు పరిస్థితులు ఎదురవగా, నాలుగుసార్లు వరదలు పోటెత్తాయి. ఆ నాలుగుసార్లు గత భాజపా పాలన కాలంలోనే. 123 ఏళ్లలో ఎన్నడూ చూడనంతగా సాగు చేసిన పంటలో 50-75 శాతం నష్టపోయింది. పెట్టుబడుల్లో కనీసం 10 శాతం రాని పరిస్థితులు రాష్ట్రంలోని 100 తాలూకాల్లో నెలకొన్నాయి. రాష్ట్రంలోని 14 వ్యవసాయ మండలాల్లో ఏమాత్రం పొంతనలేని విభిన్న కరవు పరిస్థితులు కనిపించాయి. ఈ 14 మండలాల్లో రైతులు వందేళ్లలో చూడనంత కరవు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇందుకు కారణం వర్షాలు రాకపోగా, భూగర్భ జలాలు కూడా 60 శాతం తగ్గాయి. మైసూరు జిల్లాలో 8 తాలూకాలు, మండ్య, శివమొగ్గల్లో 7 చొప్పున, కొడగులో మూడు తాలూకాల్లో అత్యంత తీవ్రమైన కరవు పరిస్థితి కనిపించింది. బెంగళూరు తూర్పు, అనేకల్‌, బెంగళూరు ఉత్తర, దక్షిణ, యలహంక, బెంగళూరు నగరం, దేవనహళ్లి, దొడ్డబళ్లాపురం, హొసకోటె, నెలమంగల ప్రాంతాల్లోనూ మునుపెన్నడూ చూడని కరవు పరిస్థితులు నమోదయ్యాయి.

2002 నాటి పరిస్థితి గుర్తుకొస్తోంది

2002-2003లో చవిచూసిన కరవు పరిస్థితిని మళ్లీ చూస్తున్నాం. ఆగస్టు మూడో వారం నాటికి 62 తాలూకాల్లో కరవు కనిపిస్తే సెప్టెంబరు నాటికి వాటి సంఖ్య 136కు చేరుకుంది. కేంద్ర పరిహారంపై ఆధారపడకుండా రాష్ట్రం వాస్తవ పరిస్థితిని అంచనా వేసి రైతులను ఆదుకోవాలి.

కురుబూరు శాంతకుమార్‌, అధ్యక్షుడు, చెరకు రైతు సంఘం

కేంద్రానికి లేఖ రాశాం

ఇప్పటికే కేంద్రానికి కరవు పరిహారాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశాం. 2020 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనలతో కరవును లెక్కించకూడదని మనవి చేశాం. ఒక ప్రాంతంలోని పరిస్థితి అన్ని ప్రాంతాలకు వర్తించే విధానాన్ని రద్దు చేయాలి. కేవలం కేంద్ర మార్గదర్శకాల కారణంగానే కరవు ప్రకటన ఆలస్యం అవుతోంది. కేంద్ర మార్గదర్శకాల వల్లనే రాష్ట్రంలో కరవు వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నాం. క్షేత్రస్థాయి సమీక్షల ఆధారంగానే కరవు పరిహారాన్ని చెల్లించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు లేఖ రాశాం.      - సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని