logo

‘శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం’

సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ఐకమత్యంతో పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు.

Published : 18 Sep 2023 00:22 IST

జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న సిద్ధరామయ్య

కలబురగి: సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ఐకమత్యంతో పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. కల్యాణ కర్ణాటక ఉత్సవాలు, హైదరాబాద్‌-కర్ణాటక విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలబురగిలో సర్దార్‌ వల్లభాయి పటేల్‌ విగ్రహానికి ఆదివారం పూల మాల వేసి నివాళి అర్పించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవాన్ని సమర్పించారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని అందుకుని మాట్లాడారు. దేశంలో వాక్‌ స్వాతంత్య్రానికి, ధార్మిక స్వాతంత్య్రానికి భంగం కలిగించేందుకు కొన్ని మతతత్వ శక్తులు వేచి చూస్తున్నాయని ఆరోపించారు. వారితో జాగ్రత్త వహించకపోతే సముదాయాల మధ్య ఘర్షణలు మొదలవుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ దేశ స్వాతంత్య్రాన్ని రక్షించడం తమ బాధ్యత అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అభివృద్ధి అంటే రహదారులు, పెద్ద భవంతులు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఆర్థిక, సామాజిక భద్రత అని పేర్కొన్నారు. కల్యాణ కర్ణాటకను సంక్షేమ ప్రాంతంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నాలుగు గ్యారెంటీలను జారీలోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. మరో పథకం యువశక్తిని త్వరలో జారీలోకి తీసుకువస్తామని ప్రకటించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, పేదరికం తదితరాలను నియంత్రించేందుకు ఈ గ్యారెంటీలు ఉపయోగపడతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. మంత్రి ప్రియాంక్‌ ఖర్గే, కల్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌, మేయరు వి శాఖ దర్గి, ఎమ్మెల్యేలు అల్లమ ప్రభు, ఎంవై పాటిల్‌, బీఆర్‌ పాటిల్‌, కనిజా ఫాతిమా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని