భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఖమ్మం: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి(95) సోమవారం కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొన్నిరోజులు హైదరాబాద్లో చికిత్స పొందారు. అనంతరం భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ప్రజలకు నిస్వార్థ సేవలందించిన ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భద్రాచలంలోని సీపీఎం కార్యాలయం వద్దకు కదిలి వెళ్తున్నారు.
కుంజా బొజ్జిది ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం అడవి వెంకన్న గూడెం. 1926 ఫిబ్రవరి 10న జన్మించిన ఆయన చిన్నప్పుడే సీపీఎం సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. పార్టీ తరఫున పలు పోరాటాలు చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామం నుంచి వచ్చిన కుంజా బొజ్జి కాలినడకనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రజల్లో మంచి పేరు గడించిన ఆయన భద్రాచలం నుంచి 1985-1999 వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఉన్నా సైకిల్ పైనే కార్యాలయానికి వెళ్లేవారు. సైకిల్ పైనే తిరుగుతూ ప్రజల్లో ఉండేవారు. అయితే, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరతరాలు కూర్చొని తినేలా డబ్బు పోగేస్తున్న నేటి కాలంలో ఆయనొక అరుదైన నేత. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సొంత ఇల్లు కూడా లేని ఎమ్మెల్యే. నిస్వార్థంగా ప్రజలకు సేవలందించారు. రెండు సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భద్రాచలంలోని తన కుమార్తె ఇంట్లో ఉన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.