logo

Aadhar: పేరు మార్చుకొని.. రెండోసారి ఆధార్‌కు దరఖాస్తు!

రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి నగరానికి వలస వచ్చాడు నవీన్‌(19).. ఆధార్‌కార్డు కోసం వేరే పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఐరిష్‌ ఆధారంగా అతనికి 2011లోనే ఆధార్‌ ఉందని అధికారులు గుర్తించారు. దానికి ఆయన పొంతనలేని సమాధానాలు ...

Updated : 17 Aug 2022 11:28 IST

 రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన యువకుడు

అధికారుల సమాచారంతో తల్లిదండ్రుల ఆనందం

మాదాపూర్‌, న్యూస్‌టుడే : రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి నగరానికి వలస వచ్చాడు నవీన్‌(19).. ఆధార్‌కార్డు కోసం వేరే పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఐరిష్‌ ఆధారంగా అతనికి 2011లోనే ఆధార్‌ ఉందని అధికారులు గుర్తించారు. దానికి ఆయన పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పారు. వారు రెండేళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుడ్ని గుర్తించి ఆనందంతో నగరానికి బయల్దేరారు. మాదాపూర్‌ ఆధార్‌ కేంద్రం మేనేజర్‌ భవాని ప్రసాద్‌ కథనం.. ఖమ్మం జిల్లా టేకులపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్‌, ఆదిలక్ష్మి దంపతుల పెద్దకుమారుడు కుంపటి సందీప్‌. 2019లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఇంటి నుంచి పారిపోయిన సందీప్‌ నగరానికి వచ్చాడు. రాయదుర్గంలోని తన అక్క మంజుల ఇంట్లో ఉంటున్నట్లుగా చెప్పాడు. మార్చిలో మాదాపూర్‌లోని ఆధార్‌సేవా కేంద్రానికి వచ్చిన సందీప్‌ తన పేరు సూర్య, తండ్రి పేరు చంద్రయ్య పేరిట వివరాలు సమర్పించి ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నాలుగు నెలలు కావస్తున్నా.. ఆధార్‌కార్డు జారీ కాకపోవడంతో గురువారం మళ్లీ ఆధార్‌కేంద్రానికి వచ్చి తన కార్డు రాలేదంటూ ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సిబ్బంది ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా 2011లోనే సదరు వ్యక్తికి ఆధార్‌కార్డు ఉందని తేలింది. అతన్ని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అధికారులు 2011లో జారీ అయిన ఆధార్‌కార్డు ఆధారంగా అతని తల్లిదండ్రుల వివరాలు సేకరించి వారికి వీడియో కాల్‌ చేసిన సందీప్‌తో మాట్లాడించారు. కరుణాకర్‌ తన కుమారుడిని గుర్తుపట్టాడు. రెండేళ్ల క్రితం అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ లభించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కుమారుడిని తీసుకెళ్లేందుకు నగరానికి బయలుదేరారు. ఈ మేరకు ఆధార్‌ కేంద్రం అధికారులు మాదాపూర్‌ పోలీసులకు సమాచారం అందించి సందీప్‌ను అప్పగించారు. తల్లిదండ్రులు వచ్చేంత వరకు పోలీస్‌ సంరక్షణలో ఉంచాలని కోరారు. ఇదిలా ఉంటే తన పేరు సూర్య, తన తల్లిదండ్రులు చనిపోయారని సందీప్‌ చెబుతుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని